అదానీ తప్పించుకోవచ్చు..జగన్‌కు ఛాన్స్ లేదు...!?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సౌరవిద్యుత్ ఒప్పందాల లంచాల కేసులో ఏమి జరుగుతుంది...? సామాన్యులు కూడా ఈ కేసులో ఏమీ జరగదని, ప్రధానిగా మోడీ ఉన్ననాళ్లూ..అదానీని, జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన వాళ్లు దర్జాగానే తిరుగుతారని, వాళ్లను ఏవరూ ఏమీ చేయలేరనే భావన సామాన్య ప్రజల్లో వ్యక్తం అవుతోంది. సౌరవిద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆయా రాష్ట్రప్రభుత్వ పెద్దలకు అదానీ లంచాలు ముట్టచెప్పారని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఈ కేసులో అదానీకి ఏమీ కాదని, ఆయనను మోడీ కాపాడతారని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ దీనిపై ఎంత యాగీ చేసినా, మోడీ పట్టించుకోరని, అయితే..అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి అదానీని ఏ విధంగా కాపాడతారనే దానిపైనే మెజార్టీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ లంచాల భాగోతంపై అమెరికా దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలు సంపాదించాయి. వారికి దొరికిన ఆధారాలతో కేసును ముందుకు తీసుకెళితే..అదానీకి కనీసం 25సంవత్సరాల జైలు శిక్ష పడుతుందనే విశ్లేషణలు వ్యాపారవర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే అమెరికా చట్టాల ప్రకారం..కేసును భారీగా జరిమానాలు కట్టి తప్పించుకోవచ్చు. పక్కా ఆధారాలు అమెరికా దర్యాప్తు సంస్థల వద్ద ఉండడంతో..అదానీ రాజీకే మొగ్గుచూపవచ్చు. అయితే..ఇది ఇప్పట్లో జరిగేది కాదు. ప్రస్తుతానికి కేసులో వాదనలు వినిపిస్తూ..ఏడాది ఆఖరులో రాజీకి రావచ్చు. అప్పటి దాకా..కేసును లాగితే..ఏడాది తరువాత పరిస్థితులను బట్టి..రాజీ చేసుకుని కేసు నుంచి బయటపడవచ్చు. దీనిలో ఇంతకన్నా ఏమీ జరగదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అదానీ రాజీపడితే..జగన్‌కు ముప్పు...!
అమెరికా నమోదు చేసిన లంచాల కేసులో అదానీ రాజీ పడితే..ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ముప్పు తప్పదు. అదానీ రాజీ అంటే..ఇక్కడ లంచాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లే..! దాని ప్రకారం ముఖ్యమంత్రిగా ఉండి లంచాలు తీసుకున్నందుకు ఇక్కడ జగన్‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దానితో పాటు..ఒప్పందాలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది అదానీని ఇబ్బంది పెట్టడమే. అలా చేస్తే మోడీకీ కోపం వస్తుంది కనుక..జగన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన తరువాత ఒప్పందాలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఏది ఏమైనా అదానీ ఈ కేసు నుంచి మోడీ సహాయంతో..తప్పించుకునే అవకాశాలు ఉండగా..జగన్‌కు మాత్రం అరెస్టు భయం పొంచింది. ప్రజల సొమ్మును అప్పనంగా ఆరగించిన జగన్‌పై చర్యలు లేకపోతే..కూటమి ప్రభుత్వం ప్రజల ముందు.. చులకైనపోతుంది.