లేటెస్ట్

జ‌గ‌న్ ఖాతాలో జైలుకెళ్లే ఐఏఎస్‌లు ఎవ‌రో...!?

జ‌గ‌న్‌, అదానీ లంచాల కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు లీకులు ఇస్తోంది. సౌర‌విద్యుత్ ఒప్పందాల్లో భారీగా సొమ్ములు చేతులు మారిన‌ట్లు అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆధారాల‌తో చెబుతుండ‌డంతో..జ‌గ‌న్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉత్ఫ‌న్నం అవుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు జ‌గ‌న్‌పై కేసులు పెట్ట‌డం, జైలుకు పంపించ‌డం వంటి చ‌ర్య‌ల‌పై పెద్ద‌గా ఆస‌క్తి లేక‌పోయినా..రాజ‌కీయ‌పార్టీలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోన్న ఒత్తిడితో కేసులు న‌మోదు చేయించ‌డానికి య‌త్నిస్తోంది. నేరుగా జ‌గ‌న్‌పై లంచాల కేసు న‌మోదు చేస్తారా..?  లేక వేరే మార్గాల ద్వారా కేసులు న‌మోదు చేస్తారా..? అనే దానిపై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో జ‌గ‌న్‌పై పీసీ యాక్ట్ ద్వారా నేరుగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని చెబుతున్నాయి. అయితే..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అలా చేయ‌ర‌ని, ఆయ‌న న్యాయ‌స్థానాల ద్వారా జ‌గ‌న్‌పై కేసులు న‌మోదు చేయిస్తార‌నే ప్ర‌చారం మీడియా, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. నేరుగా జ‌గ‌న్‌పై పీసీ యాక్ట్‌పెట్టి అరెస్టు చేయిస్తే..ఆయ‌న‌కు సానుభూతి వ‌స్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబులో ఉంద‌ని, అలా కాకుండా కోర్టుల ద్వారా చ‌ర్య‌లు తీసుకునే మార్గాన్ని ఆయ‌న ఎంచుకుంటారంటున్నారు. అదానీ, జ‌గ‌న్ లంచాల బాగోతంపై ఇప్ప‌టికే ప‌లువురు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించ‌బోతున్నారు. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ప్ర‌జాప్ర‌యోజ‌నాల వాజ్యాల‌ను దాఖ‌లు చేయ‌బోతున్నారు. 


అజ‌య్‌క‌ల్లంరెడ్డి కీల‌కం....!

ఇది ఇలా ఉంటే..జ‌గ‌న్‌, అదానీ లంచాల కేసులో కేసులు న‌మోదు అయితే..ఈ కేసులో ఐఏఎస్‌లు ఎవ‌రెవ‌రు ఉండ‌బోతున్నార‌నే దానిపై ఐఏఎస్ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ హ‌యాంలో విద్యుత్‌శాఖ‌ను ప‌ర్య‌వేక్షించిన అధికారులంద‌రిపై కేసులు న‌మోదు అవుతాయంటున్నారు. జ‌గ‌న్‌, అదానీ ఒప్పందాల స‌మ‌యంలో విద్యుత్‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న నాగుల‌ప‌ల్లి  శ్రీ‌కాంత్ పై త‌ప్ప‌కుండా కేసు న‌మోదు అవుతుంది. అదే విధంగా ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు క‌ల్లంఅజేయ‌రెడ్డిపై కూడా కేసులు న‌మోదు అవుతాయి. పిపిఏలపై అప్ప‌ట్లో క‌ల్లం అజేయ‌రెడ్డి నీతులు చెప్పారు. దీనిపై ప‌దే ప‌దే ప్రెస్‌మీట్‌లు పెట్టారు. అంత‌కు ముందు ప్ర‌భుత్వం చేసుకున్న పిపిఏల ర‌ద్దులో క‌ల్లంరెడ్డి కీల‌క‌పాత్ర పోషించారు. దీనిపై కూడా విచార‌ణ జ‌రుగుతుంది. మొత్తం మీద‌..ఈ ఇద్ద‌రు అధికారుల‌తో పాటు అప్ప‌ట్లో సిఎంఓలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌వీణ్‌ప్ర‌కాష్‌,  ధ‌నుంజ‌య‌రెడ్డిలు కూడా విచార‌ణ‌ను ఎదుర్కొంటారు. త‌రువాత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న జ‌వ‌హ‌ర్‌రెడ్డిల‌పై కూడా కేసులు న‌మోదు అవుతాయి. అయితే..రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లపై మోడీ ఒత్తిడి చేయ‌కుండా ఉంటేనే ఇవి జ‌రుగుతాయి. లేక‌పోతే..కొన్నాళ్ల హ‌డావుడే జ‌రుగుతుంది త‌ప్ప‌..మ‌రేమీ జ‌ర‌గ‌దు. అదానీని కాపాడే ప్ర‌య‌త్నంలో..జ‌గ‌న్‌ను కూడా మోడీ కాపాడ‌తార‌నే భావ‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. చూద్దాం..ఏమి జ‌రుగుతుందో..? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ