లంచాలపై మౌనమేలనోయి...!?
మౌనం అర్థాంగీకారమంటారు..? మహాభారతంలో పాండవులకు ఐదూళ్లైనా ఇమ్మని సాక్షాత్తూ దేవదేవుడైన శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. ఈ సందర్భంగా మౌనం అర్థాంగీకారమని భావించవచ్చునా..అంటూ శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని అడిగితే..కాదంటాడు..అదే రీతిలో ఇప్పుడు లంచాల కేసులో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మూగనోముబట్టారు. అదానీ, జగన్‌ల లంచాల వ్యవహారం వారం రోజుల క్రితం బయటకు వచ్చినా..ఆయన నోరు విప్పడం లేదు. సాక్ష్యాలతో ఆయన దొరికిపోవడంతోనే ఆయన మౌనంగా ఉంటున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఒకవేళ ఆయన తప్పు లేకపోతే..ఆయన లంచాలు తీసుకోకపోతే..మీడియా ముందుకు వచ్చి..ఆ విషయాన్ని స్పష్టం చేసి ఉండేవారు. కానీ..ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోవడంతోనే..మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మౌనం ఒక విధంగా అర్థాంగీకారమే.. కాగా ఈ విషయంలో పార్టీ కూడా తీవ్రంగా ఇరుకున పడింది. పార్టీ నేతలు ఎవరూ దీనిపై మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. అయితే పార్టీ తరుపున మచిలీపట్నానికి చెందిన పేర్నినాని ఏదేదో..సంబంధం లేనిదంతా మీడియా ముందు అప్పచెప్పివెళ్లిపోయాడు. ఇక భారతికి చెందిన సాక్షి కూడా రెండు రోజులు..సెకీతో ఒప్పందం చేసుకున్నామని, అదానికీ జగన్‌కూ సంబంధం లేదని ఒక రోజూ, చంద్రబాబు కంటే..తక్కువకే సౌరవిద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, ఇందులో తప్పేమిటని వాదించింది. అయితే...ప్రపంచ, దేశ, రాష్ట్ర స్థాయిలో లంచాల వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండడంతో..వాళ్లూ ఏమీ చేయలేక ఈ రోజు దాని విషయాన్ని సాక్షిలో ప్రస్తావించకుండా..ఒక ఆవు వ్యాసాన్ని రాసేసి చేతులు దులిపేసుకున్నారు.
ఇక సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా లంచాల వ్యవహారంపై దుమ్మెత్తిపోస్తున్నా..వైకాపా తరుపున దాన్ని ఖండించడానికి ఏవరూ ముందుకు రావడం లేదు. అదే సమయంలో..వైకాపా సోషల్ మీడియా కూడా నోరెత్తడం లేదు. తమ అధినేత ఇంత తేలిగ్గా లంచాల కేసులో దొరికిపోతాడని వారు ఊహించలేదు. అధికారంలో ఉన్నప్పుడు హద్దూపద్దూ లేకుండా సొమ్ములు కాజేసిన మాట నిజమని, అయితే..ఆయనెంతో తెలివి తేటలు కలిగిన వ్యక్తి కనుక అంత తొందరగా చట్టాలకు దొరకడని భావించామని, కానీ ఆధారాలతో దొరికిపోయాడని, ఈ కేసులో పార్టీ కానీ, నాయకులు కానీ, మీడియా కానీ చేసేదేమీ లేదని, కొన్నాళ్లపాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతే..అదే సర్ధుకుంటుదనే భావన కొంతమంది వైకాపా నాయకుల్లో ఉంది. తమను మోడీ కాపాడుతాడని, అదానీ కోసమైనా..తమ నేతను రక్షిస్తారని వారు ఆశిస్తున్నారు. ఇదే ఆశతో జగన్ కూడా ఉన్నారు. ఈ కేసులో అదానీ ఉండడంతో..ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతోంది. ఇప్పుడిదే..జగన్‌కు వరంగా మారింది. లేకపోతే..అమెరికా ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాడేపల్లిలో రెండు రోజుల క్రితమే జగన్ అరెస్టు కావాల్సింది. కానీ..జగన్ కు అదానీ రూపంలో అదృష్టం కలిసివస్తోంది. మరి ఈ అదృష్టదేవత ఎన్నాళ్లు కరుణిస్తుందో చూడాలి.