వాళ్లది ఫెవికాల్ బంధం...!
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి లంచాల కేసు గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనకు నేరుగా రూ.1600కోట్లు లంచాలు ముట్టినట్లు అమెరికా ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నా...ఆయనపై ఇంత వరకూ చర్యలు లేకపోవడంతో..ఏమి జరుగుతుందో తమకు ముందే తెలుసునని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయన ఎంతటి అవినీతిపరుడో, అక్రమార్కుడో.. తెలిసినా..ఆయనపై ఎవరూ ఏమీ చర్యలు తీసుకోలేరని వారు అంటున్నారు. తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షకోట్ల అవినీతి చేశాడని ఎప్పుడో పుష్కరం కింద ఆరోపణలు వచ్చి జైలుకు వెళ్లిన ఆయన అప్పటి నుండి బెయిల్‌పై తిరుగుతూనే ఉన్నారు. ఈ లోపు ఐదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పదవులు కూడా వెలగబెట్టారు. మళ్లీ మరో ఐదేళ్లు గడిచిపోయే పరిస్థితి ఉన్నా ఆయనపై కేసులు మాత్రం ముందుకు కదలడం లేదు. ఈ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే..వారి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమే దీనికి కారణమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా బయటపడిన రూ.1600కోట్ల లంచాల వ్యవహారంలో ఇప్పటి వరకూ వీసమెత్తు కదిలిక కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ చేతులను కేంద్ర పెద్దలు కట్టేశారనే భావన వ్యక్తం అవుతోంది. వాస్తవానికి జగన్ లంచాల కేసులో బిజెపి పెద్దలకు వాటా ఉందని, అందుకే..ఈ కేసులో ఎటువంటి చర్యలు లేవని వారు అంటున్నారు. అదానీ నుంచి తీసుకున్న లంచాల సొమ్ములో బిజెపి పెద్దలకు ఎంత చేర్చాలో అంత జగన్ చేర్చారని, అందుకే ఆయనపై వారు ఎటువంటి చర్యలకు ముందుకువెళ్లడం లేదంటున్నారు. మరోవైపు కూటమిలో కీలకమైన టిడిపి, జనసేన చేతలను కూడావారు కట్టేశారని, జగన్‌పై చర్యలు తీసుకుంటే..తమకు చుట్టుకుంటుందనే భయంతోనే..బిజెపి పెద్దలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదంటున్నారు. మొత్తం మీద..జగన్ ఎంత అవినీతి చేసినా, అరాచకంచేసినా, అక్రమాలు చేసినా..ఆయనను ఏమీ చేయలేరనే ఆయన అభిమానుల మాట నిజం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారిలో ఆయన పట్ల మరింత హీరోయిజం పెరిగిపోతోంది. దొంగలకు, అవినీతిపరులకు, అక్రమార్కులకు ఈ దేశంలో అభిమానులు పెరిగిపోవడం..విధివైచిత్రి. అంతకన్నా ఏమీ చేయలేం.