జగన్, అదానీ లంచాలపై చర్యలు లేనట్లే...!?
అదానీ, జగన్ లంచాల కేసులో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీ తప్పుడు మార్గంలో తమ దేశంలో నిధులు సేకరించినట్లు, దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కేసు ఫైలు చేశాయి. భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పెద్దలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారని ఆ కేసులో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే..అదానీకి, ఆయన సంస్థలో ఇతరులకు నోటీసులు జారీ చేశాయి. 21 రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని పేర్కొన్నాయి. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చజరుగుతోంది. ముఖ్యంగా వాణిజ్యవర్గాల్లో, రాజకీయవర్గాల్లో ఇవి తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి దాదాపు రూ.1600కోట్లు అదానీ లంచాలు ఇచ్చినట్లు, దానికి ఆధారాలు ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే..ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దలు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఎంత గగ్గోలు పెట్టినా, సభలను జరగనివ్వకపోయినా..మోడీ పట్టించుకోరని, అదానీపై ఎటువంటి చర్యలు తీసుకోరనే వార్తలు వస్తున్నాయి. అసలు దానికంటే..మరో బలమైన మద్దతు GQG Partners నుంచి అదానీకి లభించింది. దీంతో..అదానీపై దాదాపు చర్యలు ఉండవనే సంకేతాలు వాణిజ్యవర్గాల్లో వ్యక్తం అవుతోంది.
GQG Partners supported Adani
సౌరవిద్యుత్ ఒప్పందాల కోసం అదానీ జగన్ ఇతర రాష్ట్రాలకు చెందిన పాలకులకు లంచాలు చెల్లించారనే దానిపై GQG partners పెద్దగా పట్టించుకోలేదు. అదానీ కంపెనీల్లో దాదాపు రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ వివిధ అవసరాల కోసం పారిశ్రామికవేత్తలు లంచాలు ఇవ్వడం సర్వసాధారణమని, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ సంస్థకు చెందిన రాజీవ్‌జైన్ పేర్కొన్నారు. అమెరికా సంస్థ దాఖలు చేసిన కేసులో జరిమానాలు చెల్లించి అదానీ సంస్థ బయటపడుతుందని, వాణిజ్యకార్యకలాపాల్లో ఇవి సాధారణమేనని, దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ వివిధ మార్కెట్లో లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. వాస్తవానికి అదానీ లంచాల బాగోతం బయటకు వచ్చినప్పుడు ఈ సంస్థ పెట్టిన పెట్టుబడుల్లో దాదాపు 20శాతం క్షీణించాయి. అయితే..ఆ సంస్థ తాము అదానీ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోబోమని తేల్చి చెబుతోంది. అంతే కాకుండా ఇదంతా అధికారం నుంచి వైదొలుగుతోన్న బైడన్ కావాలని చేయిస్తున్నారని, రెండు నెలల్లో ట్రంప్ అధికారంలోకి వస్తారు కనుక..అప్పుడు ఈ కేసులు దూదిపింజెల్లా తేలిపోతాయని కూడా ఆ సంస్థ చెబుతోంది. దీంతో..అదానీ వ్యవహారం కేవలం జరిమానాలతో తేలిపోతుంది. గతంలో షార్ట్ సెల్లింగ్ సంస్థ హిడెన్‌బర్గ్ అదానీ సంస్థలపై పలు ఫిర్యాదులు చేసినప్పుడూ GQG Partners ఇదే విధంగా స్పందించాయి. హిడెన్‌బర్గ్ అరోపణలతో అదానీ షేర్లు భారీగా పతనం కాగా, GQG Partners ప్రకటనలతో మళ్లీ కోలుకున్నాయి.
ఇప్పుడు కూడా ఆ సంస్థ అమెరికా సంస్థలు చేసిన ఆరోపణలను తేలిగ్గా కొట్టేస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల్లో ఇది మామూలేనని, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతూండడంతో..అదానీపై వచ్చిన ఆరోపణలతో ఆయనకు పెద్దగా నష్టం వాటిల్లే పరిస్థితి లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వాడుకుంటుంది. దానా దీనా..అదానీ వ్యవహారం కొన్ని రోజుల పాటు వార్తల్లోనిలుస్తుంది కానీ..ఆయనపై ఎటువంటి చర్యలు ఉండవు. కాగా..ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కూడా ఇదే రీతిలో ముగుస్తుంది. అదానీ కాంట్రాక్టులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసే ధైర్యం చేయలేదు. కాంట్రాక్టులను రద్దు చేయకుండా..జగన్‌పై కేసులు పెట్టలేదు. ఒక వేళ అదానీ, అమెరికా సంస్థలు లంచాల విషయంలో రాజీ చేసుకుంటే..ఇక్కడ జగన్‌పై కేసు నమోదు చేయడానికి బలమైన ఆధారం లభించినట్లే. దీనితో జగన్‌పై కేసు పెట్టవచ్చు. కానీ..అసలు లంచాలు ఇచ్చినవాడ్ని వదిలేసి, లంచాలు తీసుకున్నవాడిపై కేసు ఏమిటని ప్రశ్నించే అవకాశం ఉంది. అదే విధంగా.. అదానీ కాంట్రాక్టులు రద్దు చేయకుండా జగన్‌పై కేసులు పెడితే..కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది. ఏతావాతా..జగన్‌పై కేసులు లేనట్లే. ఇక ఇప్పుడు వందలకోట్ల లంచాలు మేసిన జగన్ దర్జాగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తాడు. తన స్వార్థం కోసం వందల కోట్లు లంచాలు మెక్కి..ప్రజలపై లక్ష కోట్ల భారం మోపిన జగన్..మళ్లీ పేదలను ఉద్దరిస్తానని ఊరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.