జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీం కన్నెర్ర...!
జర్నలిస్టులకు స్థలాలు కేటాయించడంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. వారేమీ చట్టాలకు అతీతం కాదనీ, వారికి ఎందుకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిలదీసింది. సమాజంలో వారికేమీ ప్రత్యేకహోదా లేదని నిష్కరగా ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో దాఖలు చేసింది. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పట్లోనే కొందరు జర్నలిస్టులు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ జీవోను రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్‌వి రమణ స్థలాల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. సొసైటీ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చంటూ..ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయా స్థలాలను జర్నలిస్టులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే..ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాగా..అంతకు ముందే..ప్రజాప్రతినిధులకు కేటాయించిన స్థలాలు పరిస్థితి కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. సొసైటీలకు భూముల కేటాయింపు రద్దు చేయడంతో..ఇప్పటి వరకూ ఇచ్చిన భూములన్నీ మళ్లీ ప్రభుత్వం వద్దకు చేరే పరిస్థితి ఉంది. కాగా..సుప్రీం తీర్పు భవిష్యత్తులో జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాళ్లేమీ ప్రత్యేక తరగతి కాదని, వారేమీ..సమాజంలో అట్టడుగున ఉన్నవారు కాదనీ, వారికి భూముల కేటాయించాల్సిన పరిస్థితుల్లో లేరన్న సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ జర్నలిస్టులకు ఇళ్ల కేటాయించే పరిస్థితులు ఉండవు. సమాజంలో అందరూ సమానమేనన్న సుప్రీం తీర్పు జర్నలిస్టు వర్గాల ఆశలపై నీళ్లు జల్లింది.