EVMలు వద్దు...బ్యాలెటే ముద్దు...!
బ్యాలెట్ కోసం..రోడ్లపైకి కాంగ్రెస్...!?
దేశంలో ఇకపై జరిగే ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్లతోనే జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీని కోసం ఓ భారీ ఉద్యమాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు. ఎన్నికల్లో EVMలు ఉపయోగించడం వలన మోసం జరుగుతోందని, మోసాన్ని నివారించేందుకే బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీని కోసం రాహుల్‌గాంధీ చేసినటువంటి జోడోయాత్ర లాంటిది నిర్వహిస్తామని, ఎన్నికల కమీషన్‌పై ఒత్తిడి తెస్తామని ఆయన ప్రకటించారు. కాగా ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలన్నీ ఇవిఎంల వల్ల ఓడిపోయామని ఆరోపిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన హర్యానా, నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల వరకూ ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఐదేళ్ల నుంచి EVMల ట్యాంపరింగ్‌పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఏకపక్షంగా విజయం సాధించడం వెనుక EVMల ట్యాంపరింగ్ ఉందనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైకాపా గెలవడానికి EVMలే కారణమనే ఆరోపణలు వచ్చాయి. 175 స్థానాలు ఉన్న ఆంధ్రా అసెంబ్లీలో ఆ పార్టీకి 151 స్థానాలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే పెద్ద రగడ జరిగింది. దీనిపై టిడిపి EVMలపై సుప్రీంకు కూడా వెళ్లింది. కానీ..సుప్రీం దాన్ని పట్టించుకోలేదు.
పారదర్శికత కోసం ప్రజాఉద్యమం....!
EVMల అక్రమాలపై టిడిపి ఉద్యమించినా..దానికి మిగతా పార్టీల సహకారం లభించలేదు. అయితే..ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు కలిసిపోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి కనీస మెజార్టీ సాధించలేదు. అయితే..మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో బిజెపిపై ట్యాంపరింగ్ ఆరోపణలు రాలేదు కానీ..ఆంధ్రాలో గెలిచిన టిడిపి కూటమిపై వైకాపా ఆరోపణలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి కూడా దీనిపై ఆరోపణలు చేశారు. ఆయన పార్టీ అప్పటి నుంచి దీనిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. కాగా.. EVMలను నిషేదించి, పేపర్ బ్యాలెట్‌ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని కేఏపాల్ సుప్రీంకోర్టులో కేసు వేయగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గెలిచినప్పుడు సంతోషపడ్డవాళ్లు, ఓడినప్పుడు మాత్రం EVMలపై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించింది. కాగా..ఇప్పుడు కాంగ్రెస్ దీనిపై ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో..రాబోయే రోజుల్లో..పేపర్ బ్యాలెట్ కోసం డిమాండ్లు ఎక్కువ కావచ్చు. మరి అధికారంలో ఉన్న బిజెపి కూటమి దీనికి అంగీకరిస్తుందా..? అంటే సమాధానం లేదనే చెప్పవచ్చు. కాగా ఈ విషయంపై సామాన్యుల్లో కూడా కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో పేపర్‌బ్యాలెట్లతో ఎన్నికలను నిర్వహిస్తే..పారదర్శకత ఉంటుంది. సామాన్య ప్రజల్లో నెలకొన్న సందేహాలు తీర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలను నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంభించవచ్చు. కానీ పాలకులు ఎందుకో దానిపై విముఖంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తే..ప్రభుత్వం దిగరాకతప్పదు. చూద్దాం ఏమి జరుగుతుందో..?