లేటెస్ట్

బిఆర్‌ఎస్‌పై గ్రామీణ తెలంగాణ ఓటర్ల ఆగ్రహానికి కారణమేమిటి...!?

పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతం కూడా కెసిఆర్‌తో కలిసి నడిచింది. నాడు ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి తెలంగాణ ఆవశ్యకతను గ్రామీణులకు వివరించి వారిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేశారు.  తెలంగాణ వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయనే భావనతో మొదట్లో అంతగా లేని గ్రామీణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగింది. కెసిఆర్‌ ఎటువంటి పిలుపు ఇచ్చినా ముందూ వెనుక ఆలోచించకుండా గ్రామీణులు ఆయనతో కలిసి అడుగేశారు. తెలంగాణ కల సాకారం అయిన తరువాత తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, తెలంగాణ తెచ్చినాయనే తమ పిల్లలకు కొలువులు ఇస్తాడనే భావనతో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో అప్పటి టిఆర్‌ఎస్‌ను బాగానే గెలిపించారు. అప్పట్లో పట్టణ తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అంతగా మద్దతు దొరకలేదు. నాడు తెలంగాణకు వ్యతిరేకమన్న టిడిపి, బిజెపి పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా సీట్లను గెలుచుకుంది. అయితే..2018లో జరిగిన ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ తెలంగాణ ఓటర్లు కెసిఆర్‌పై నమ్మకంతో ఆయనను గెలిపించారు. మొదటి ఐదేళ్లలో ఉద్యోగాల ఊసులేకపోయినా..వచ్చిన తెలంగాణలో ఎప్పటికైనా తమ బిడ్డల భవిష్యత్తు మారుతుందనే భావనతో మరోసారి బిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అయితే..తరువాత కూడా ఉద్యోగాల విషయంలో, తమ బిడ్డల విషయంలో కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరితో ఖిన్నులైన గ్రామీణ తెలంగాణ వాసులు అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమన్న పెద్దాయనే, ఇంటికో ఉద్యోగం సాధ్యమా..అని అసెంబ్లీలో అన్నా, ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తాయనే భావనతో ఎదురుచూసినా వారి ఆశలు నెరవేరకపోవడం వారిలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగులు తమను మోసగించిన కెసిఆర్‌పై ధ్వేషంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాకుండా, హైదరాబాద్‌ నుండి తమ ప్రాంతాలకు వెళ్లి కసిగా బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌ ఓటమికి ఇది మొదటి కారణం.


ఇక రెండవది దళితబంధు పథకం. ఈ పథకంతో ప్రతి పేద కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తాననే కెసిఆర్‌ హామీ హామీగానే ఉండిపోయింది. ఊరికి కనీసం ఒకరూ, ఇద్దరికి కూడా రాకుండా పోయింది. ఒక వేళ ఎవరికైనా వస్తే దానిలో స్థానిక నాయకులు లంచాలు మింగారు. అంతే కాకుండా ఈ పథకం వల్ల ఇతర వర్గాల వారు బిఆర్‌ఎస్‌కు దూరం అయ్యారు. ఒక కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తుంటే తమకేమి ఇవ్వడం లేదనే భావనతో వారు బిఆర్‌ఎస్‌కు దూరం అయ్యారు. అదే విధంగా రైతుబంధు పథకం..ఒకటి రెండు ఎకరాలు ఉన్నవారితో సమానంగా వంద, యాభై ఎకరాలు ఉన్నవారికి కూడా ఇవ్వడం నిరుపేద రైతులకు, కౌలు రైతుల చిరాకెత్తింది. పేద రైతులకు ఇస్తే ఓకేనే కానీ, మోతుబరి రైతులకు ఎందుకు ఇస్తోందన్న భావన వారిలో అసంతృప్తి కారణమైంది. ఇది మూడవ కారణం. ఇక నాలుగవది హైదరాబాద్‌ ప్రాంతంతో సమానంగా తమ ప్రాంతాలను అభివృద్ధి చేయలేదన్నది మరో కారణం. కెసిఆర్‌ గెలిచిన కొత్తల్లో వరంగల్‌, కరీంనగర్‌, తదితర ప్రాంతాలను ‘ఢల్లాస్‌, వాషింగ్‌టన్‌’లండన్‌ వంటి నగరాలుగా చేస్తానన్న హామీని నిలబెట్టుకోవడం మరో కారణం. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్యవహరించడం, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దర్శనం సామాన్య ప్రజలకు లభించకపోవడం, వరి వస్తే ఉరి వేసుకోవాలనే ప్రచారం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్పు రావాలన్న కాంగ్రెస్‌ నినాదాలు గ్రామీణులను ఆకర్షించడంతో గ్రామీణ తెలంగాణ ఓటర్లు బిఆర్‌ఎస్‌కు దూరం జరిగారు. స్వంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఎక్కడో ఉన్న పంజాబ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు నిధులు పంచడం కూడా వారి ఆగ్రహానికి మరో కారణం. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ