దీపం-2 సొమ్ముపై ప్రజల్లో అసంతృప్తి...!
కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చినా..దాని ఫలితాలను పూర్తిగా పొందలేకపోతోంది. తెల్లరేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి తన ఎన్నికల హామీల్లో పేర్కొంది. ఇచ్చిన హామీ ప్రకారం ఈఏడాదికి మూడు సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. అయితే..కేంద్ర ప్రభుత్వ నిబంధలన ప్రకారం గ్యాస్ సిలిండర్ల సొమ్ములను ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు చెల్లించలేకపోతోంది. ముందుగా లబ్దిదారులు నగదు చెల్లిస్తే..రెండు మూడు రోజుల్లో ఆ నగదును సదరు లబ్దిదారు బ్యాంక్ అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే..ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు నగదు చెల్లించిన తరువాత వారికి రావాల్సిన నగదు బ్యాంక్ ఎకౌంట్లో పడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే..రెండు మూడు రోజుల్లో వస్తాయని పేర్కొనగా..కొన్ని చోట్ల వారం రోజులైనా, పదిరోజులైనా ఇంకా నగదు ఎకౌంట్‌లో పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ జి.వి.ఆంజనేయులు స్వంత నియోజకవర్గంలో Janamonline.com ప్రతినిధి కొందరిని పలుకరించగా..వారు ఈ విషయాన్ని చెబుతున్నారు. లబ్దిదారుల్లో చాలా మందికి ఎవరికీ ఎకౌంట్లలో సొమ్ము జమకాలేదని వారందరూ ముక్తకంఠంతో చెప్పారు. వీరంతా టిడిపి సానుభూతిపరులు, కార్యకర్తలే కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 అంటూ హంగామా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున్న ప్రచారాన్ని చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం లబ్దిదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో..మోడీ ప్రభుత్వం ఇలానే మోసం చేసిందని ఈ సందర్భంగా వారు చెప్పుకుంటున్నారు. గతంలో వంటగ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వాలు సబ్సీడీ ఇచ్చేవి. అయితే మోడీ ప్రభుత్వం ముందు మీరు చెల్లించండి..తరువాత మీరు చెల్లించిన సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చింది. మొదట్లో కొన్నాళ్లు ఇలా చెల్లించిన కేంద్ర ప్రభుత్వం తరువాత దానిపై పూర్తిగా సబ్సీడీని ఎత్తివేసి మోసం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తోన్న దీపం-2 పథకంపై ఇటువంటి అనుమానాలనే లబ్దిదారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..వాటన్నింటినీ పక్కనపెట్టి ఇచ్చిన హామీ మేరకు మహిళల్లో సంతోషాన్ని నింపేందుకు వంటగ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తున్నా..వాటి ప్రతిఫలం మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతున్న సూచనలు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వ పెద్దలు..సరైన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఇప్పటికే గ్రామప్రాంతాల్లో..తమకు సంక్షేమపథకాలు ఏమీ అందడం లేదనే భావన వ్యక్తం అవుతోంది. అమలు చేస్తోన్న పథకాలనైనా సక్రమంగా అమలు చేయాలి. కాగా ఫించన్లపై మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులతో పాటు, ఆయా కుటుంబాల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. అదే విధంగా రహదారులను బాగుచేయడంపై కూడా ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది.