కాక రేపుతోన్న కాకినాడ బియ్యం...!?
పేదోడికి పట్టెడన్నం పెట్టడానికి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెచ్చిన కిలో రూ.2/- పథకంతో ఎంతో మంది పేదల ఆకలి తీర్చింది. అప్పుడెప్పుడో..అన్న పెట్టిన పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. రోజులు మారినా..పథకం మాత్రం మారలేదు. అప్పుడు రెండు రూపాయలు ఉన్న కిలో ఇప్పుడు రూపాయికి మారింది కానీ..పథకం మాత్రం ఆగలేదు. నాడు పేదోడి డొక్క నింపడానికి తెచ్చిన ఈ పథకం ఇప్పుడు బియ్యం స్మగ్లర్లకు వరంగా మారింది. పిడిఎస్ బియ్యాన్ని దాదాపు ఎవరూ తినడం లేదు. రేషన్ బండి దగ్గరే అమ్మేసుకునే జనాలు ఎక్కవ. ఈ రూపాయి బియ్యాన్ని ఐదు రూపాయలకు కొని కొన్ని శక్తులు విదేశాలకు అమ్మేసుకని సొమ్ములు చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదో మాఫియాగా తయారైంది. అయితే..ఈ మాఫియాకు కాకినాడ కేంద్రంగా మారింది. రాష్ట్రంలోని రేషన్ బియ్యంలో దాదాపు 90శాతం ఇక్కడ నుంచే విదేశాలకు తరలిపోతోంది.
తొలుత హడావుడి..ఆపై....లంచాల ఆరోపణలు...!
దీనిపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా..మాఫియాను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వైకాపా హయాంలో అయితే..వీరికి అడ్డేలేకుండా పోయింది. అయితే..కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ శాఖ మంత్రి చేసిన హడావుడి, ఆ పార్టీ చేసి హంగామా అంతా ఇంతా కాదు. పిడిఎస్ బియ్యం నిల్వలు చేసిన గోదాములపై దాడులు చేసి సీజ్ చేశారు. అయితే...ఇక్కడే తిరకాసు ఉందని, సొమ్ముల కోసం ముందు హడావుడి చేసి..తరువాత వారి వద్ద నుంచి లంచాలు మేశారని వైకాపా నాయకులు, కొంత మంది మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో కూటమి మంత్రులు సీజ్ చేసిన బియ్యంలో పిడిఎస్ బియ్యం లేవని, అంతా సక్రమమేనని చెబుతూ..వాటి ఎగుమతికి అనుమతులు ఇచ్చేశారు. దీనిలో సొమ్ములు మారాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా తమనేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించిన వైకాపా తరువాత సొమ్ముల కోసమే కక్కుర్తిపడి పీడిఎస్ అంటూ బియ్యాన్ని సీజ్ చేశారని, ముడుపులు ముట్టాక అన్నీ వదిలేశారని తమ స్వంత పత్రికల్లో తాడికాయలంత అక్షరాలతో రాసేస్తున్నారు. దీంతో...కూటమి మంత్రుల్లో చలనం వచ్చింది. మళ్లీ పిడిఎస్ బియ్యంపై హడావుడి మొదలైంది.
రూ.16కోట్లు ముడుపులు...!
కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రిపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు భారీ ముడుపులు ముట్టచెప్పారని వైకాపా పత్రిక రాస్తోంది. సిఎంఆర్ బకాయిల విడుదలలో ఆయన రూ.16కోట్లు ముడుపులు అందుకున్నారని, ఈ విషయాన్ని మిల్లర్లు, మిల్లర్ల సంఘం కూడా దృవీకరిస్తోందని ఆ పత్రిక ఆరోపిస్తోంది. దీనిలో నిజమెంతో కానీ...ముందు హడావుడి చేసిన మంత్రి తరువాత ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. అదే కాకుండా పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్‌లో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యే అనుంగు అనుచరుడికి సివిల్ సప్లయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారని, ఇదంతా లాలూచీ వల్లేననే విమర్శలు ఉన్నాయి.
ద్వారంపూడి వ్యూహంలో చిక్కారా...!?
ఈ మొత్తం వ్యవహారంలో జనసేన, కూటమి మంత్రులు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పన్నిన వలలో చిక్కుకున్నారనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఆయన ఒక వ్యూహం ప్రకారం దెబ్బ కొట్టారని, మిల్లర్లను, మిల్లర్ల సంఘ నేతలకు ముందుంచి వెనుక నుంచి చక్రం తిప్పారని, కాకినాడ పోర్టు దెబ్బతింటే ఎగుమతులు దెబ్బతింటాయనే ప్రచారాన్ని చేయించారని, పోర్టుపై చాలా మంది నిరుపేదలు ఆధారపడుతు న్నారని, వారిని చూసైనా ఈ విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలనే ఒత్తిడి తెచ్చారని, దానికి కూటమి మంత్రులు లొంగారనే వార్తలు వస్తున్నాయి. కూటమి నేతలు ఎప్పుడైతే లొంగారో..ఇక అక్కడ నుంచి ద్వారంపూడి తన విశ్వరూపం చూపించారని, వారిని ఇప్పడు కోలుకోకుండా దెబ్బకొడుతున్నా రని, వారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, సొమ్ముల కోసం, కమీషన్ల కోసం..వారు దిగజారరే ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద మంత్రులు ముందస్తు వ్యూహం లేకండా కాకినాడ బియ్యంలో ఇరుక్కుపోయారనే భావన వ్యక్తం అవుతోంది.
పవన్ రాక...!
నిన్న కాకినాడ కలెక్టర్ పిడిఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని సముద్రంలోని నౌకలోపలికి వెళ్లి తనిఖీలు చేశారు. కొంత మేర పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే..ఈ హడావుడి జరుగుతున్న సమయంలోనే జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ కాకినాడలో ఒక రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు ఆయన కాకినాడలోని పోర్టును తనిఖీ చేస్తున్నారు. కాగా పవన్ రంగంలోకి దిగడంతో..ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. పిడిఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోన్న స్మగ్లర్లపై భారీ ఎత్తున దాడి చేసేందుకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలోపెడుతోంది. ఒకవైపు..పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ ఆగడం లేదు..మరోవైపు ప్రభుత్వంపై విమర్శలూ ఆగడం లేదు. ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగడంతో..ఈ విషయంపై నెలకొన్న అనుమానాలు పటాపంచలవుతాయనే భావన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ బియ్యంపై రాజకీయ, అధికారవర్గాల్లో మాత్రం చర్చ జరుగుతోంది.