సీజ్ ది షిప్...!?
సోషల్‌మీడియాలో పవన్ వ్యాఖ్యలు వైరల్
కాకినాడ బియ్యం కాక రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. కాకినాడ కేంద్రంగా అక్రమ బియ్యం రవాణాపై గత కొంత కాలంగా వివాదం నెలకొంది. అక్రమ రేషన్ ఎగుమతికి కాకినాడ కేంద్రంగా మారిందని, వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు దీనిలో పాత్ర ఉందని జనసేన, టిడిపిలు కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే..వీరి ఆటకట్టిస్తామని జనసేన, టిడిపి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు, రైస్‌మిల్లర్స్‌పై దాడులు చేయించారు. అయితే..ఆ తరువాత ఎందుకో దానిపై అంత సీరియస్‌గా చర్యలు తీసుకున్నది లేదు. అయితే..ఇంతలోనే జగన్ పత్రిక ఓ మంత్రి ముడుపులు అందుకుని రేషన్ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వదిలేశారని, కమీషన్ల కక్కుర్తితో రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. ఇది నేరుగా జనసేనకు తగిలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగి కాకినాడ పోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్రమ రేషన్ ఎగుమతిదారులకు చెందిన షిప్‌ను సీజ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడీ ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ అన్న మాటలను ఆయన మద్దతుదారులు గొప్పగా ప్రచారం చేసుకుంటుంటున్నారు. కొంత మంది దీన్ని టిడిపికి అన్వయిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడే ఉన్న టిడిపి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ఉద్దేశించి పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో..గతంలో ఇక్కడ వైకాపా అక్రమాలు చేశారని, ఇప్పుడు టిడిపి కనుసన్నల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ.. దీన్ని పవన్ ఆపారంటూ సోషల్ మీడియాలో వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కలెక్టర్ ముందే సీజ్ చేశారా...?
కాగా పవన్ వ్యతిరేకులు, వైకాపాకు చెందిన వారు..పవన్ కంటే ముందుగానే.. షిప్‌ను కలెక్ట్‌ర్ సీజ్ చేశారని, కొత్తగా పవన్ చేసిందేముందని ఎద్దేవా చేస్తున్నారు. కాకినాడ కలెక్టర్ పవన్ కంటే ముందుగానే సముద్రంలోకి వెళ్లి షిప్‌ను పరిశీలించి అక్రమాలను గుర్తించి షిప్‌ను సీజ్ చేశారు. పవన్ సినీపక్కీలో వ్యవహరించి..ఏదో చేశామనే హంగామా చేస్తున్నారని, ఆయన అక్కడ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. కాగా..జగన్ పత్రిక పవన్ వ్యవహారంపై అక్కసు వెళ్లగక్కింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా..ఇప్పటిదాకా పవన్ ఎక్కడికి పోయారని, కమీషన్ల వ్యవహారం బయటకు రావడంతోనే..ఆయన బయటకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారని, మంత్రులు చేయాల్సిన పనులన్నీ పవన్ చేస్తుంటే..ఇక మంత్రులు ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. హోంమంత్రి అనిత, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉత్సవవిగ్రహాలుగా మార్చి, సినీ ఫక్కీలో నాటకాలు ఆడుతున్నారంటూ..విమర్శలు గుప్పించింది.