ఫించన్లపై పూర్తి సంతృప్తి...!
ఆరు నెలల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నింటిని వాయిదా వేసినా..కొన్ని పథకాల అమలులో మంచి మార్కులే కొట్టేస్తుంది. అలాంటి పథకాల్లో ఫించన్ల పెంపు ఒకటి. తాము అధికారంలోకి వస్తే..ఫించన్లను పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అక్షరాలా అమలు చేస్తున్నారు. వృద్ధులకు ఒకేసారి వెయ్యిరూపాయాలు పెంచి వారి మనస్సులను చూరగొన్నారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య ఫించన్లు రెండు వేల నుంచి మూడు వేలు చేరడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో రెండు వేలు వృద్ధాప్య ఫించన్ ఉండేది. అప్పట్లో జగన్ తాను అధికారంలోకి వస్తే..రూ.2వేలు మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే..ఒకేసారి మూడు వేలు చేయకుండా ప్రతి ఏడాది రూ.250/-ల వరకూ పెంచుకుంటూ వెళ్లారు. దీనిపై ఫించన్ లబ్దిదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఇచ్చిన హామిని ఐదేళ్ల పాటు అమలు చేయలేదని, ఇదోరకమైన మోసమని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆగ్రహాన్ని మొన్నటి ఎన్నికల్లో వారు చూపించారు.
నూటికి నూరు మార్కులు...!
ఫించన్‌దార్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు ఫించన్లు పెంచి ప్రతి నెల 1వ తేదీనే ఫించన్లు అందచేస్తున్నారు. ఒక్కోసారి ఆదివారం మొదటితేదీ వస్తే..ముందు రోజే పంపిణీ చేసి ఫించన్‌దార్ల మొహాల్లో చిరునవ్వులను చిందిస్తున్నారు. ఇదొక్కటే కాదు..గతంలో ఒక నెలలో ఎవరైనా ఫించన్ తీసుకోకపోతే..ఇక అంతే సంగతి. తరువాత ఆ ఫించన్ ఇచ్చేవారు కాదు. కానీ..ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం రెండు మూడు నెలలు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తరువాత నెలలో భద్రంగా ఇస్తున్నారు. దీంతో..ఫించన్ దారుల్లో ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోంది. వృద్ధులు, వికలాంగులు, ధీర్ఘకాలికవ్యాధులు కలిగిన వారు ప్రతినెలా ప్రభుత్వం తమకు జీతం వలే..అందచేస్తోన్న సొమ్ములతో ముగ్ధులవుతున్నారు. చంద్రబాబును కొందరు మహిళలు తమ కొడుకంటూ చెబుతున్నారు. ఇదేదో..ఆయన ముందు పొగడడం కాదు..ఎవరూ అడగకుండానే..తమకు ప్రతినెలా..రూ.4వేలు వస్తున్నాయంటూ మురిసిపోయి..చెప్పుకుంటున్నారు. ఇటీవల Janamonline.com ప్రతినిధి పల్నాడు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పర్యటించినప్పుడు ఓ మహిళను ప్రశ్నించగా..ఆమె చంద్రబాబు ఇస్తోన్న ఫించన్‌తో జీవితాన్ని హాయిగా వెళ్లదీస్తున్నానని, తనకు ఎవరూ లేరని, అయినా..సంతోషంగా బతుకుతున్నానని, జీవితంపై ఆశలు చిగురిస్తున్నాయని ఎంతో సంతోషంగా చెప్పింది. ఈమొక్కరే కాదు..చాలా మందిలో ఇదేరకమైన సంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఎవరూ లేని వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అందిస్తోన్న ఈ సహాయం వారిని మానసికంగా, ఆర్థికంగా నిలబెటుతోంది. మొత్తం మీద ఐదారు నెలల చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయినా..ఫించన్ల విషయంలో మాత్రం నూటికి నూరు మార్కులు కొట్టేసింది.