జనాల మూడ్ మారుతున్నట్లుంది..!?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు అవుతోంది. అయితే..వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి మాత్రమే అమలు చేస్తున్నారు. మిగతా ఐదు ఇంకా మొదలెట్టలేదు. అయితే..ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఫించన్ పెంపును అమలు చేస్తున్నారు. అదే విధంగా మెగా డిఎస్సీని విడుదల చేశారు. కానీ..దాన్ని నిలుపుదల చేశారు. ఇక అన్నక్యాంటీన్లు, రోడ్లనిర్మాణం, అమరావతి, పోలవరం వంటి వాటిని అమలు చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండూ సమానంగా తీసుకెళ్లాలనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. అయితే..ఉద్యోగాల కల్పన కోసం వివిధ కంపెనీలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం బాగానే కృషి చేస్తోంది. మరోవైపు శాంతిభద్రలు గాడిలోపడ్డాయి. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం నాణ్యమైన మద్యాన్ని తెచ్చారు. అయితే..వాటి రేట్లను పూర్తిగా తగ్గించలేదనే భావన మద్యం వినయోగదారుల్లో ఉంది. అయితే అన్నిటి కంటే ముఖ్యమైనది....ప్రజలకు ఫ్రీడం వచ్చింది. ముఖ్యంగా మీడియాకు విపరీతమైన స్వేచ్ఛ లభించింది. గతంలో...వార్త రాయాలంటే వణికినవాళ్లు ఇప్పుడు యధేచ్చగా కలాలను ఝళిపిస్తున్నారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వ చర్యలు అభినందనలకు నోచుకుంటే..మరికొన్ని అంశాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సంక్షేమపథకాలను అమలు చేయడం లేదనే అసంతృప్తి పేద వర్గాల్లో నెలకొంటుంది.
శ్రీఘ్రంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలి
ముఖ్యంగా తల్లికివందనం అమలుచేయలేదనే అసంతృప్తి బాగానే ఉంది. అదే విధంగా విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేయలేదనే ఆక్రోశం విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఉంది. అదే సమయంలో ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.1500/- లు ఇవ్వలేదు. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి రూ.20వేలు ఇవ్వలేదు. ఇది కూడా వారిలోఅసంతృప్తికి కారణమవుతోంది. ఎన్నికల ముందు బాగా ప్రచారమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమలులోకి రాలేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3వేలు కూడా ఇవ్వలేదు. ఆరు హామీల్లో మూడు సిలిండర్ల పథకమే కాస్త అమలులో ఉంది. అదీ కొంత మందికి సొమ్ములు తిరిగి ఖాతాల్లో పడడం లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వైకాపా నాయకులు ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కొన్ని వర్గాల ప్రజల్లో ఇదే అభిప్రాయం ఉంది. మంచో..చెడో..వాడు.. ఎంత తిన్నా, ఎంత దోచుకున్నా, ఎంత మందిని హత్యలు చేసినా, అక్రమాలకు చేసినా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినా...మాకు..ఎంతో కొంత వేస్తున్నాడు..ఇప్పుడు అదీ లేకుండా పోయిందనే మాట అక్కడక్కడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఇలా అంటున్నవాళ్లంతా జగన్ వైపుకు వెళతారని కాదు కానీ..వారి మూడ్ మారిపోతోందనే సంకేతాలు వెళుతున్నాయి. గజదొంగ అయినా, దోపిడీదారు అయినా..తమకు ఎంతో కొంత ఇస్తున్నాడు కదా..వాడు ఎంత దోచుకుంటే..ఏముందిలే..అన్న ఆలోచన వారిలో ఉంది. మొత్తం మీద..కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని బాధలు పడుతున్నా..కనీసం తల్లికివందనం, మహిళలకు రూ.1500/-, రైతు పెట్టుబడి పథకాలను అమలు చేస్తే వారిలో ఉన్న అసంతృప్తి, నిరాశ తగ్గే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ పెద్దలు ఏమంటారో...?