తండ్రీ...కొడుకులు...అన్నాదమ్ములు...భలే..భలే...!?
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భలే భలే వింతలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని వింతలు..ఇప్పుడే చూస్తున్నాం. అన్న ఎన్టీఆర్‌ను అధికారంలోంచి దించిన తరువాత కూడా చంద్రబాబు ఇటువంటి వింతైన నిర్ణయాలను తీసుకోలేదు. కానీ..ఇప్పుడు వింతైన, వికారమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తున్నానంటూ..ఆయన చేస్తోన్న పనులు పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు చిరాకును తెప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సంగతి తేలుస్తారనుకుంటే..నానబెట్టి..నానబెట్టి కార్యకర్తల సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానీ, ఇతర పోస్టుల భర్తీ విషయంలో కానీ..ఆయన చేస్తోన్న జాప్యం...పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా..పైరవీకారులకు, అడ్డదారిలో వచ్చిన వారికి కట్టబెడుతోన్నవైనంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా..రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఆయన తీసుకున్న నిర్ణయమే..పార్టీలో వివాదాస్పదం అయితే..తాజాగా మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవడం కూడా వివాదాస్పదమే అయింది. నాగబాబును తీసుకోవడంలో చంద్రబాబు నిర్ణయమేమీ లేకపోయినా..అది పవన్ నిర్ణయమే అయినా..ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించడంపై పార్టీలో అసహనం వ్యక్తం అవుతోంది. పవన్‌ను బుజ్జగించడానికే..ఈ నిర్ణయం తీసుకున్నారనే భావన వ్యక్తం అవుతోంది.
జగన్ చేసిన తప్పులే వీళ్లు చేస్తారా...?
జగన్ అవినీతి, అరాచకాన్ని తట్టుకోలేక ప్రజలంతా..ఒక్కటై..కూటమికి అధికారం కట్టబెడితే..వీళ్లూ..అతనిదారిలోనే నడుస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో జగన్ అవినీతి, అరాచకాలకు, బంధుప్రీతికి పాల్పడ్డారని విమర్శించిన వాళ్లే..ఇప్పుడు ఆయన దారిలోనే నడుస్తున్నారు. రాష్ట్రాన్ని చక్కగా పాలించమని, కనీసం ప్రశ్నించే ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు తీర్పులు ఇస్తే..దాన్ని పక్కన పెట్టి వీళ్లు పదవులు, అధికారాన్ని పంచుకుంటున్నారనే విమర్శలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడిన వారిని వదిలేసి మధ్యలో వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టారు. తాజాగా జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రిని చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రకటించడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగబాబును జనసేన కోటాలో మంత్రి పదవి ఇస్తారంటున్నారు. వారికి నాలుగు మంత్రిపదవులు ఇస్తామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం ఇప్పటికే ఒక ఖాళీ వదిలేశారని, ఇప్పుడు దాన్ని భర్తీ చేస్తారని చెబుతున్నారు. ఇదంతా పవన్ నిర్ణయమేనని, ఇందులో చంద్రబాబుకు సంబంధం లేదని చెబుతున్నారు. అయితే..నిర్ణయం ఎవరిదైనా..ఈ ప్రభావం కూటమిపై గట్టిగానే పడబోతోంది.
పదవులన్నీ కుటుంబాలకేనా..?
ఇప్పుడు నాగబాబును మంత్రిని చేస్తే..చంద్రబాబు క్యాబినెట్‌లో తండ్రీతనయుడు, అన్నాదమ్ముడు మంత్రులుగా ఉండబోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తనయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక పవన్ కుటుంబం నుంచి పవన్ ఇప్పటికే పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రిపదవి ఇస్తారు కనుక..ఆయన కుటుంబానికి రెండో మంత్రి పదవి వస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రంనాయుడి కుటుంబానికి కూడా రెండు పదవులు లభించాయి. రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రిగా ఉండగా, ఆయన బాబాయి అచ్చెంనాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి టిడిపి పార్టీలో చాలా కుటుంబాలకు పదవులు దక్కాయి. ఒకే కుటుంబానికి రెండు, మూడు పదవులు లభించాయి. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఒకే కుటుంబానికి చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే..నేరుగా ఒకే కుటుంబానికి చెందిన వారు..ఇద్దరు...ఇద్దరు మంత్రులుగా ఉండడం..అరుదైన విషయమే.
వైకాపా అవకాశం...!
ప్రజలకు మేలు చేయమని అధికారం ఇస్తే..పదవులు పంచుకుంటున్నారనే విమర్శలను కూటమి ఎదుర్కోబోతోంది. సంక్షేమపథకాలు అమలు చేయలేదని ఇప్పటికే ప్రతిపక్ష వైకాపా రాద్ధాంతం చేస్తోంది. నీకు రూ.15వేలు..నీకు రూ.15వేలంటూ..ఆ పార్టీ గేలిచేస్తోంది. ఇక రేపటి నుంచి అయ్యకు ముఖ్యమంత్రి పదవి..కొడుక్కు మంత్రి పదవి..తమ్ముడికి మంత్రిపదవి..అన్నకి మంత్రి..పదవి..అక్కకు మంత్రి పదవంటూ.. హేళనకు దిగుతుంది. మొత్తం మీద..కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయాలతో..విమర్శలపాలవుతోంది. రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో జరుగుతోన్న రాద్ధాంతం...ఇప్పుడు నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడంతో..తారాస్థాయికి చేరనుంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తోన్నవారికి మంత్రిపదవులు దక్కడం లేదని, ఆరు, ఏడు సార్లు గెలిచిన వారికి మంత్రిపదవులు ఇవ్వని చంద్రబాబు..ఎమ్మెల్యేగా ఎన్నిక కాని వారికి మంత్రి పదవులు ఇస్తున్నారనే అసంతృప్తి టిడిపి పార్టీలో నెలకొంది. కాగా...చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై తీవ్ర అసహనంతో ఉన్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు..తాజా పరిణామాలతో మరింతగా అసంతృప్తికి లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.