❛చౌదరి❜ని....చౌదరంటే తప్పేముంది:యనమల
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎస్ఇజెడ్‌ల పేరిట కె.వి.రావుకు భారీగా పేదల భూములను కట్టబెట్టారని, ముఖ్యంగా బీసీల భూములు లాగేసుకున్నారని..ఈ విషయంలో ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే..ఆయన రాసిన లేఖలో కులాన్ని ప్రస్తావించడం, ముఖ్యంగా వైకాపా అధినాయకులు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నాయకుల భాషను ఉపయోగించడం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది. వైకాపా నాయకులు లేని కులతోకలను తగిలించిన చందంగానే యనమల కమ్మ కులస్థులకు తోకలను తగిలిస్తున్నారు. వారి జాడ్యం ఈయనకు అంటుకుందా..? లేక వారి నుంచి ఉత్పేరకం చెందారా..? అంతటి సీనియర్ నాయకుడు వైకాపా భాషను ఉపయోగించడం ఏమిటి..? సీనియర్ నాయకుడై ఉండి, బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదని, ఆ భాష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తప్పులేదని, కానీ..కులాన్ని కించపరుస్తూ..కావాలని..ఎద్దేవా చేస్తూ..ఆ కులం వాళ్లంతా దోపిడీదారులన్నట్లు ఆయన లేఖ రాయడంపై మండిపడుతున్నారు. దీనిపై యనమల రామకృష్ణుడు నిన్న ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. చౌదరిని..చౌదరి అంటే తప్పేముందని..ఆయన తన మాటలను సమర్ధించుకున్నారు. తాను రాసిన దానిలో తప్పులేదని..వాదిస్తున్నారు. ❛❛కేవీ రావు అనేది నిస్సందేహంగా చౌదరి. నేను ఆయన్ని ఆ పేరుతో పిలవడానికి హక్కు కలిగి ఉన్నాను. ఆయన తన కులాన్ని తన పేరుకు చివర జోడించకపోవచ్చు, నేను నా పేరులో యాదవ అనే పదాన్ని ఉపయోగించనట్లే. కానీ, నేను యాదవ కులానికి చెందినవాడిని. ఇది ఏవిధంగానూ వివాదాస్పదం చేయకూడదు. నన్ను ఎవరూ ప్రశ్నించే హక్కు లేదు. నేను పార్టీలోని సుధీర్ఘకాలం పనిచేశాను.❜❜ అని ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
యాదవ కులం నష్టపోయింది...!
కాకినాడ సెజ్‌వల్ల తన కులం వాళ్లు నష్టపోయారని, వారితో పాటు మత్స్యకారులు, ఎస్సీలు ఆదాయాన్ని కోల్పోయారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్యలపై తాను, చంద్రబాబునాయుడు పోరాడామని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి కోసం ఉన్న భూములను రద్దు చేసిందని ఆయన అన్నారు. కాకినాడ సీపోర్ట్‌ను నిర్వహిస్తున్న కెవిరావు రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారు 10,200 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, తరువాత దాన్ని జిఎంఆర్ గ్రూపుకు లాభాలకు అమ్ముకున్నారని, ఇందులో రూ.150కోట్ల లాభం వచ్చిందని, తరువాత జిఎంఆర్ గ్రూపు దాన్ని అరబిందో గ్రూప్‌కు రూ.3500కోట్లకు అమ్ముకుందని వారు 10రెట్ల లాభం పొందారని, కానీ తన కులానికి చెందిన వారికి మాత్రం ఎటువంటి లాభం పొందలేదని ఆయన విమర్శించారు. ఇంత లాభాలు ఆర్జించిన వారు రైతులకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా తనకు చంద్రబాబుతో ఎటువంటి విభేదాలు లేవని, తాను ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని, తన కుమార్తెను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆ ఇంటర్వ్యూలో యనమల పేర్కొన్నారు. అయితే..పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి బహిరంగంగా లేఖలు రాసి, పార్టీని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం వెనుక ఆయనకు వేరే ఆలోచనలు ఉన్నాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. దాదాపు 40ఏళ్ల నుంచి పార్టీలో ఉంటున్న యనమలకు హఠాత్తుగా చౌదరి అనే కులంతో పాటు, తాను యాదవుడు అనేది కూడా గుర్తుకు వచ్చిందా..? అంటూ ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద..ఈ వివాదాన్ని ఇంతటితో ఆపే ఉద్దేశ్యం ఆయనకు లేదని తాజాగా ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది.