అంత బాగేమీ లేదు..అధికారుల మాట వింటే..అంతే...!?
కలెక్టర్ల సమావేశం సందర్భంగా తమ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అంతా బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు చంకలు గుద్దుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన సందర్భంగా కొన్ని పథకాలపై లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే..వారు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తోన్నది కేవలం ఫించన్లపైనే..మిగతా రెండు విషయాల్లో..అంత సంతృప్తేమీ ప్రజల్లో కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకూ ఉన్న సామాజిక ఫింఛన్లను ఒకేసారి వెయ్యిరూపాయలు పెంచేసింది. దీనిపై సర్వత్రా సంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం వెయ్యి రూపాయిలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుంది. కానీ..కూటమి ప్రభుత్వ ఏకాఎకిన ఒకేసారి రూ.వెయ్యి పెంచేసింది. అదే విధంగా వికలాంగులు, ధీర్ఘకాలిక రోగాలన బారిన పడినవారికి కూడా భారీగా ఫింఛన్లు పెంచింది. దీంతో సహజంగానే ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే..అన్నక్యాంటీన్లు, రైతులకు మద్దతు ధరలపై కూడా ప్రజల్లో సంతృప్తి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే..అన్న క్యాంటీన్లల సమయాల్లో కుదింపు, తగినంత మందికి ఆహారం అందించకపోవడం వంటివాటిపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రోజుకు కొన్ని టోకెన్లుమాత్రమే ఇవ్వడం...అవి అయిపోయిన తరువాత ఇక లేవని నిర్వహకులు చెప్పడం కొన్ని చోట్ల అసంతృప్తికి దారి తీస్తుంది. ఇక ధాన్యం కొనుగోలులో తేమశాతం అంటూ..ఇష్టారాజ్యంగా కోతవేస్తున్నారు. దీనిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కానీ..అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరుగుతుందని నివేదకలు ఇస్తున్నారు.
తల్లికి వందనంపై నిట్టూర్పులు..!
కూటమి ప్రభుత్వానికి భారీగా ఓట్లు రావడానికి ప్రధాన కారణం మహిళలు. వారంతా చంద్రబాబు అధికారంలోకి వస్తే..ఎంత మంది పిల్లలు ఉంటే..అంత మందికి రూ.15వేలు ఇస్తామని చెప్పడంతో..గంపగుత్తగా కూటమికి ఓట్లేశారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం దాని సంగతిని పట్టించుకోలేదనే భావన వారిలో ఉంది. ఇక మొదటి సంతకం అంటూ చెప్పిన మెగా డిఎస్సీపై నిరుద్యోగులు పలు ఆశలు పెట్టుకున్నారు. అయితే..ఇది రాజకీయకారణాలతో ఆపేశారనే మాట నిరుద్యోగుల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. దీనిపై వారు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన విధంగా డిఎస్సీని నిర్వహించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అదే విధంగా మద్యం విధానంపై మద్యం వినియోగదారుల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే..ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వెలుస్తోన్న బెల్ట్‌షాపులపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళలకు ఇస్తామన్న రూ.1500/-, నిరుద్యోగభృతి వంటి పథకాలు అమలు చేయకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. ఇంకోవైపు విద్యుత్‌రేట్ల పెంపుపై కూడా అసహనం వ్యక్తం అవుతోంది. అధికారులు చెప్పినట్లు అంతా సవ్యంగా ఏమీ లేదు. గతంలో కూడా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును అంతా బాగుందంటూ మోసపుమాటలతో ఆయనను నమ్మించి ముంచేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి ఇదే విధంగా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం..ఆ పని ఏమయింది..? ఇదెంత వరకూ వచ్చింది..? ఇంకేమీ చేయాలంటూ..అధికారులను ప్రశ్నించేవారు..దానికి వారు కూడా అంతా అయిపోయిందని, అన్నీచేశామని, అంతా సంతృప్తికరంగా ఉందంటూ కాకిలెక్కలు చెప్పేవారు. చంద్రబాబు వాళ్లు చెప్పేదంతా నమ్మేసేవారు. చివరకు అదంతా శుద్ధ అబద్దమని 2019 ఎన్నికల ఫలితాలతో ఆయనకు అర్థం అయింది. ఈసారైనా..అధికారుల కాకిలెక్కలను నమ్మకుండా..వాస్తవంగా ఏమి జరుగుతుందో..ఆయన ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. లేకుంటే..వారి నమ్ముకుంటే..మరోసారి మునకే..! తస్మాత్ జాగ్రత్త చంద్రబాబూ...!?