‘పార్థా’ ఇంకా వైకాపా వాసనలు పోలేదా...!?
నూజివీడులో సర్థార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సభలో వైకాపాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధితో పాటు, మాజీ ఎంపి కొనకళ్ళనారాయణతో పాటు, సర్థార్ గౌతు లచ్చన్న మనవరాలు, ఎమ్మెల్యే గౌతు శీరిషలు ఈ సభలో పాల్గొన్నారు. దీనిపై టిడిపి సోషల్‌మీడియా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతోంది. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్‌ను ఎలా ఆ సభకు రానిస్తారని, ఆయనను వెంట పెట్టుకుని ప్రదిక్షణలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ‘జోగి’ ఇష్టారాజ్యంగా వ్యవహరించి దాడులు చేశారని, బూతులు తిట్టారని, అటువంటి నాయకుడిని టిడిపి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొననీయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబును, ఆయన భార్య భువనేశ్వరిని దూషించిన మాజీ మంత్రి కొడాలినానితో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనివంశీని కూడా టిడిపి పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పిలవాలని వారు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. జూనియర్ ఎమ్మెల్యే అయిన ‘శిరీష’కు తెలియకపోయినా..సీనియర్ అయిన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘కొలుసు పార్థసారధి’కి ఈ విషయం తెలియదా...? లేక పాత వైకాపా వాసనలు ఆయనకు ఇంకా పోలేదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టిడిపిలో చేరిన ‘పార్థసారధి’కి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ‘లోకేష్’లు మంచి విలువ ఇస్తున్నారని, కానీ ఆయన మాత్రం తన పాత పార్టీ వారితోనే ఇంకా సన్నిహితంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ‘పార్థసారధి’కి మంచివాడు,నెమ్మదస్తుడు అనే పేరుంది. అయితే..ఆయన మాత్రం తన పార్టీ వారికన్నా వైకాపా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన వారికి కూడా ఆయన అధిక విలువ ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
‘కొలుసు’ చుట్టూ వైకాపా వారే..!
‘పార్థసారధి’ సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తన చుట్టూ వైకాపా వారినే నియమించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కార్యాలయ అధికారిగా గతంలో ‘గుడివాడ’లో పనిచేసి అవినీతిపరుడుగా ముద్రపడిన అధికారిని నియమించుకున్నారు. ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన మంత్రికి నెలకు ఇంత కడుతున్నానని బహిరంగా చెబుతున్నారట. రాష్ట్ర సమాచారశాఖలో అవినీతి ముద్రపడ్డ అధికారులను రక్షించడంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు సొమ్ములు ముట్టచెబితే..ఏ పనైనా చేస్తారనే పేరు వచ్చింది. అంతే కాదు తన కులానికి చెందిన అధికారులు, మంత్రి సామాజికవర్గానికి చెందిన వారు ఎవరు వచ్చి, ఏ పని అడిగినా..కాదనకుండా చేసిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఆయన ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా మంత్రి పార్థసారధి మాత్రం ఆయనను కొనసాగిస్తూనే ఉన్నారు.
చంద్రబాబును దూషించిన వారే పిఆర్‌ఓలు...!
ఇక మంత్రి వద్ద పిఆర్‌ఓగా పనిచేసే వ్యక్తి గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నియమించబడ్డారు. అయితే సదరు పిఆర్‌ఓ చంద్రబాబును,ఆయన కుటుంబసభ్యులను ఇష్టారాజ్యంగా దూషిస్తారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అతని సంగతి తెలిసికూడా మంత్రి అతనిని ప్రోత్సహిస్తున్నారు. ఆ వ్యక్తి గత చరిత్ర గురించి మంత్రికి తెలుసా..? తెలిసీ అతనిని కొనసాగిస్తున్నారా..? చంద్రబాబును దూషిస్తే నాకేమిటిలే..అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారనే భావన చూసేవారిలో కనిపిస్తోంది.
వైకాపా వారికే సీసీ యాడ్స్...!
సమాచారశాఖ మంత్రిగాఉన్న పార్థసారథి గతంలో వైకాపాకు అనుకూలంగా పనిచేసిన వారికే యాడ్స్ ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. రైల్వేస్టేషన్‌ల్లో సీసీ యాడ్స్‌ను వైకాపాకు చెందిన యాడ్ ఏజెన్సీలకు కట్టబెడుతున్నారు. ఈ యాడ్ ఏజెన్సీ అధినేత వైకాపా అధినేత ‘జగన్’కు అత్యంత సన్నిహితుడు. ‘జగన్’ లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఖర్చులన్నీ ఇతనే భరించారు. జగన్‌కు సన్నిహితుడైన..ఈయనకు ఇప్పుడు పిలిచి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా గత ప్రభుత్వంలో సమాచారశాఖను దోచుకున్న జగన్ సామాజికవర్గానికి చెందిన ఓ యాడ్ కంపెనీని కూడా మంత్రి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అవినీతి అధికారులకు ప్రోత్సాహం...!
కాగా గత వైకాపా పాలనలో సమాచారశాఖను దోచుకున్న అప్పటి కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రప్పిస్తానని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమయిందో కానీ..విజయ్‌కుమార్‌రెడ్డితో అంటకాగిన అవినీతి అధికారులకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు అవినీతికి పాల్పడిన వారిని శిక్షించకుండా..వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడమేమిటో..? వారంతా వైకాపా సానుభూతిపరులే.. వారిపై అంత ప్రేమ ఎందుకో..? మొత్తం మీద ఈ సీనియర్ మంత్రి అనవసర వివాదాలతో పాటు పక్షపాత చర్యలకు పాల్పడుతున్నారని, ఆయన వ్యవహారశైలి వైకాపా వారికి అనుకూలంగా ఉందనే వాదన ప్రబలంగా ఉంది. దానితో పాటు చంద్రబాబును, ఆయన కుమారుడిని దూషించే వైకాపా వాళ్లను తన పిఆర్‌ఓలుగా నియమించుకోవడం ఏమిటి..? ఇలాంటి వారిని నియమించుకుని ఆయన ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారో అర్థం కావడం లేదు. ‘జోగి’ విషయంలో అనుకోకుండా తప్పు జరిగిందని మంత్రిపార్థసారధి చెప్పి, క్షమాపణలు చెప్పడంతో..వివాదం ముగిసిపోతుందేమో కానీ..తన చుట్టూ ఉండేవారి విషయంలో..ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే..వీరే..ఆయనను శుభ్రంగా ముంచేత్తారనడంలో ఎటువంటిసందేహం లేదు. ఇప్పటికైనా ఆయన వారిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.