అధికార వ్యవస్థలో భారీ మార్పులు...!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి ప్రజల నుంచి అభినందనలు వస్తోండగా, మరి కొన్ని విషయాల్లో మాత్రం వ్యతిరేకత వస్తోంది. ఇది ప్రజల నుంచి అని చెప్పడానికి లేదు కానీ..ముఖ్యంగా పార్టీ కార్యకర్తల నుంచి చంద్రబాబు ఆయన కుమారుడిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ అభిప్రాయాలకు పార్టీ అధినేత విలువ ఇవ్వడం లేదని, గత జగన్ పాలనలో తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారనేదే వారి ప్రధాన ఫిర్యాదు. అదే విధంగా..అప్పట్లో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, బియ్యంమధుసూధన్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటివారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి వారిలో గూడు కట్టుకుపోయింది. మరోవైపు అధికార వ్యవస్థలో ఇంకా వైకాపా వాసనలు వస్తున్నాయని, అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి కూడా వారిలో ఉంది. అయితే..అధికార వ్యవస్థలో మార్పులు తెస్తారని, ఆరు నెలలు పాలన తరువాత..ఇప్పుడు అధికార వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నారని చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు.
నూతన సిఎస్, డీజీపీ...!
నూతన ఏడాది తరువాత పాలనలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కొత్తవారిని ప్రభుత్వం నియమించబోతోంది. ప్రస్తుతం సిఎస్‌గా పనిచేస్తోన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన తనకు మరో ఆరు నెలలు పొడిగింపు ఇవ్వాలని కోరుతున్నా..అది జరిగే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో ఆయనకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు శాంతిభద్రతల విషయంలో కీలకమైన పోలీసు విభాగంలో నూతన డీజీపీ రాబోతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు ఈనెలాఖరు రిటైర్డ్ కాబోతున్నారు. ఆయన స్థానంలో సమర్థుడైన ఐపిఎస్ అధికారిని డీజీపీగా నియమిస్తారని తెలుస్తోంది.
సిఎంఓలో మార్పులు...!
పాలనలో కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జిగా ఉన్న రవిచంద్ర బాగా పనిచేస్తున్నారు. ఆయన నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఆయనతో ఇబ్బందేమీ లేదు. మరో అధికారి రాజమౌళి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే..వీరిద్దరు తప్ప మిగతా వారి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వైకాపా వారికే పనిచేస్తున్నారని, టిడిపి వారిని దగ్గరకు రానీయడం లేదనే విమర్శలను కొందరు ఎదుర్కొంటున్నారు. దీంతో..ఒకరిద్దరు సిఎంఓ అధికారులను బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా వైకాపాతో అంటకాగే వారిని పక్కకు తప్పిస్తారంటున్నారు.
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఇది ఇలా ఉంటే వచ్చే నూతన ఏడాదిలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులను బదిలీ చేస్తారంటున్నారు. నూతన సిఎస్, డీజీపీలను ఎంపిక చేసిన తరువాత ఈ బదిలీలు ఉంటాయనే ప్రచారం ఉంది. కొందరు సీనియర్ అధికారులు ఈనెలాఖరుకు రిటైర్‌కానున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తారు. అదే విధంగా కొంత మంది అధికారుల వద్ద రెండు లేక మూడు శాఖలు ఉన్నాయి. వారంతా ఇన్‌ఛార్జిలుగా పనిచేస్తున్నారు. ఇటువంటి వాటికి కొత్తవారిని అధిపతులుగా నియమించనున్నారు.
వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు...?
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు ఐఏఎస్ అధికారులు వైకాపాకు అనుబంధంగా పనిచేశారనే ఆరోపణలు రావడంతో వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టింది. ఇలా వెయిటింగ్‌లో ఉన్నవారిలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, మురళీధర్‌రెడ్డి,మాదవీలత, జగన్ సిఎంఓలో పనిచేసిన ముత్యాలరాజు,నీలకంఠారెడ్డి తదితరులు ఉన్నారు. వీరిని ఇంకా వెయిటింగ్‌లో ఉంచుతారా..? లేక పోస్టింగ్‌లు ఇస్తారో చూడాలి. అవినీతి, అక్రమ ఆరోపణలు ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం లేదు. జగన్‌తో మిలాఖత్ అయిన వారెవరికీ పోస్టింగ్‌లు ఇవ్వరనే ప్రచారం ఉంది. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షసాధింపులకు పాల్పడరని, నూతన ఏడాదిలో వారికి పోస్టింగ్‌లు ఇస్తారనే మాటా ఉంది. మొత్తం మీద...నూతన ఏడాదిలో అధికార వ్యవస్థలో భారీగా మార్పులు ఉంటాయి. అదే సమయంలో కొందరు కీలకమైన అధికారులకు మరింత ఉన్నతస్థానాలను ఇవ్వబోతున్నారు.