‘నర్సరావుపేట’లో ‘టిడిపి’ జెండా ఎగిరేనా...!?
ఒకప్పుడు ‘టిడిపి’కి కంచు కోట అయిన ‘నర్సరావుపేట’ తరువాత కాలంలో క్రమేణా..తన ప్రాభవం కోల్పోయింది. కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలకు గండికొట్టి..పల్నాడు ముఖద్వారంలో టిడిపి జెండాను ఎగురువేసినా, అనంతర కాలంలో క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోయి..తిరిగి లేవలేని స్థితికి చేరింది. టిడిపి స్థాపించిన దగ్గర నుంచి వరుసగా ఐదుసార్లు ఇక్కడ నుంచి గెలిచిన దివంగత నేత ‘కోడెల శివప్రసాదరావు’ తరువాత ఎవరూ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందలేదు. 1983,1985,1989,1994,1999ల్లో వరుసగా ఐదుసార్లు గెలిచిన ‘కోడెల’ డబుల్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. ఎప్పుడైతో ‘కోడెల’ అక్కడ ఓడిపోయారో..అక్కడ నుంచి ఇక ‘టిడిపి’ మళ్లీ నిలబడలేకపోతోంది. 1999 తరువాత జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ‘టిడిపి’ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. తొలుత 2004లో ఓడిపోయన ‘కోడెల’ ఆ తరువాత 2009లోనూ ఓడిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆయన ‘సత్తెనపల్లి’కి వెళ్లిపోయారు. అప్పట్లో టిడిపి పాత గుంటూరు జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించినా ‘నర్సరావుపేట’ను మాత్రం గెలవలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఈ సీటును పొత్తులో భాగంగా బిజెపికి ఇచ్చినా..ఇక్కడ టిడిపి సానుభూతిపరుడే ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా ఇక్కడ నుంచి టిడిపి గెలవలేకపోయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి మరోసారి పరాభవం ఎదరుయింది. బీసీ వర్గానికి చెందిన ‘అరవిందబాబు’ను రంగంలోకి దించినా..టిడిపి విజయంసాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఎన్నికలు రానుండడంతో..ఇక్కడ టిడిపి మరోసారి ఓటమిబాటలో పయనిస్తుందా..లేక ఈసారైనా విజయం సాధిస్తుందా..అన్న ప్రశ్న టిడిపి వర్గాల నుంచి, ఆ పార్టీ సానుభూతి పరుల నుంచి వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి గత నాలుగున్నరేళ్ల నుంచి ఇక్కడ టిడిపి మరింత బలహీనపడిరది. రెండేళ్లు ‘కరోనా’ వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. అంతే కాకుండా బయటకు వచ్చి ప్రశ్నించిన వారిపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన వారిపై వైకాపా నాయకులు ఉధృతంగా కేసులు పెట్టించారు. అదే విధంగా స్థానిక ఎన్నికల సందర్భంగా టిడిపి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. స్థానిక నాయకులు కొందరు వైకాపా నాయకులతో కుమ్మక్కు అవడం, ఇతరత్రా వ్యాపారాలు వారితో కలిసి నిర్వహించడం వంటి చర్యల వల్ల టిడిపి ఇక్కడ పెద్దగా పోరాడలేకపోయింది. స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా టిడిపి దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది. వైకాపాలో ఉన్న వర్గ రాజకీయాలు ఆ పార్టీకి మైనస్ అవుతున్న పరిస్థితుల్లో కూడా టిడిపి ముందంజ వేయలేకపోతోంది. వైకాపా అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేకు సీటు ఇవ్వవద్దని, ఆయన స్థానంలో వేరే వారికి ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపనితీరు, వర్గరాజకీయాలు, అభివృద్దిలేమి, దౌర్జన్యాలు, దమనకాండపై మెజార్టీ తటస్థ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు ‘టిడిపి’ని మళ్లీ గెలిపించాలని కిందిస్థాయి కార్యకర్తలు, సానుభూతిపరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా స్థానిక నాయకత్వం మాత్రం వారి ఆశలకు అనుగుణంగా పనిచేయలేకపోతంది. ప్రస్తుతం టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న ‘అరవింద్‌బాబు’కు మంచి వ్యక్తిగా పేరున్నా..వైకాపా నాయకత్వాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారనే భావన కార్యకర్తల్లో ఉంది. ఆయనను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటిస్తుందా..? లేక వేరే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థిగా ప్రకటిస్తుందా..? అన్న దానిపైనే విజయావకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ నుంచి నలుగురైదుగురు నాయకులు టిడిపి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తుండగా, గత ఎన్నికల్లో ఓడిపోయిన ‘అరవింద్‌బాబు’కే అధిష్టానం అవకాశం ఇస్తుందని, ఆయనపై సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రెండూ కలిసి వచ్చి టిడిపి విజయం సాధిస్తుందని ‘అరవింద్‌బాబు’ను సమర్థించే వారు చెబుతున్నారు. మొత్తం మీద వైకాపాకు ధీటైన అభ్యర్థిని పోటీకి దింపితేనే..రెండు దశాబ్దాల పరాజయాలకు తెరపడుతుందని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు.