Accidental Prime Minister...?
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ రోజు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మృతిపై భారత దేశవ్యాప్తంగా సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. మృదుస్వభావిగా, నెమ్మదస్తుడిగా, వివాదరహితుడిగా, ఆర్థికవేత్తగా ఆయనకు పేరుంది. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల వల్లే..భారతదేశం ఇప్పుడు ఇలా ఉందనే అందరూ ఒప్పుకుంటారు. తెలుగువాడైన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. అప్పట్లో..ఈ ద్వయం..అప్పుల్లోచిక్కి రోజు గడవడమే కష్టమైన స్థితిలోఉన్న భారతదేశాన్ని ఒడ్డున పడేశారంటారు. బంగారాన్ని తాకట్టుపెట్టి రోజులు గడుపుతున్న దేశాన్ని..ఇప్పుడీ స్థితికి తేవడంలో వీరి పాత్రను మరిచిపోలేం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్‌లో సంపూర్ణమెజార్టీ లేకపోయినా..తనదైన పాలన సాగించిన పివి భారత్‌ను ఆదుకున్నారు. ఆయనకు సహకరించిన మన్మోహన్‌సింగ్ తరువాత ప్రధాని కావడం ఎవరూ ఊహించని విషయం.
1996లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత ఎన్‌డిఏ తరుపున వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. తొలివిడత 13రోజుల్లో వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత ఏడాదిన్నర, తరువాత ఐదేళ్లు కంటే తక్కువ సమయంలోనే ఎన్‌డిఏ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. అంటే 1996 నుంచి 2004 వరకూ ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో కాంగ్రెస్ తరుపున సోనియాగాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఆమెతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిరాకరించడంతో..ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు. విదేశీయతే ఆమెకు ప్రధాని పదవిని దూరం చేసింది. అయితే..ఈ పరిస్థితుల్లో ప్రధాని పదవి తనకు రాకపోయినా ఫర్వాలేదు..అధికారం మాత్రం తన చేయి దాటకూడదనే ఉద్దేశ్యంతో ఆమె మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిగా చేసిందంటారు. అప్పట్లో ప్రణబ్‌ముఖర్జికి అవకాశం వస్తుందని భావించినా..సోనియా ఆయనను నమ్మలేదంటారు. ఆయను ప్రధాని చేస్తే..తన మాట వినరని, రాజకీయంగా పెద్ద ఉద్దేశాలు లేని మన్మోహన్‌సింగ్ అయితే..తన మాట వింటారని ఆమె భావించి ఆయనను ఎంపిక చేశారంటారు. అయితే..ఆయనకు ఎటువంటి అర్హతలు లేవని కాదు. ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఆయనకు ఉన్నాయి. కానీ..రాజకీయంగా బలవంతుడు కాకపోవడమే..ఆయనకు ప్రధాని పదవి దక్కడానికి ప్రధాన కారణం. అయితే..ప్రధానిగా ఆయన పనితీరును ఎవరూ తప్పు పట్టలేరు.
తనకున్న పరిమితులతో ఆయన రెండుసార్లు దేశాన్ని అద్భుతంగా ఏలారు. అయితే..సోనియా, రాహుల్ అడుగులకు మడుగులొత్తారనే విమర్శలు ఆయనపై కోకొల్లలుగా ఉన్నాయి. ఆయనను సోనియా, రాహుల్, ఆయన కుటుంబం రిమోట్ కంట్రోల్‌లాగా వాడుకుందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన మంత్రివర్గంలోని మంత్రులు అవినీతికి పాల్పడినా, అరాచకాలకు పాల్పడినా..మన్మోహన్ మౌనమునిలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. సోనియాకు భయపడి పాలనాపరంగా ఆయన రాజీ పడకుండా ఉంటే..దేశం మరింత శక్తిమంతంగా ఎదిగేదనేవారూ ఉన్నారు. అయితే..తనకున్న పరిమితులకు లోబడి మన్మోహన్‌సింగ్ దేశాన్ని ఆర్థికంగా బలంగా ఎదిగేందుకు కృషి చేశారు. సరళీకృత ఆర్థిక సంస్కరణలతో ఆయన దేశాన్ని పరుగులెత్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్తాలు నింపేశారు. ఇప్పుడు దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందంటే..మన్మోహన్‌సింగ్ వేసిన బాటలవల్లే. రాజకీయంగా బలహీనమైనా..పాలనాపరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మధ్యతరగతి, సామాన్యులకు ఎంతో మేలు చేశాయి.సమాచారహక్కు చట్టం ఆయన హయాంలోనే వచ్చింది. దీని వల్ల పాలకుల్లో బాధ్యత పెరిగింది. అదే విధంగా ఆర్థికంగా చేసిన సంస్కరణల వల్ల దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. యాధృచ్ఛకంగా ప్రధాని అయినా..ఆయన దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టారు. కొన్ని అడ్డంకులు లేకపోతే..దేశం మరింతగా అభివృద్ధి చెంది ఉండేది. ఏది ఏమైనా..దేశాన్ని ఆర్థికంగా ఉన్నతస్థానంలో నిలబెట్టిన మన్మోహన్‌సింగ్ సేవలను ఏ భారతీయుడూ మరిచిపోలేడు.