‘అజయ్‌కల్లంరెడ్డి-దినేష్’ ఫార్ములాతోనే ‘సిఎస్’ నియామకం...!?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీరబ్‌కుమార్’ ఈనెలాఖరుతో రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో ‘సిఎస్‌గా ఎవరిని నియమిస్తారనేదానిపై రాజకీయ, అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. నూతన సిఎస్ రేసులో పలువురు సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. వీరిలో ‘సాయిప్రసాద్, ‘విజయానంద్, ఆర్.పి.సిసోడియా, కృష్ణబాబు తదితరులు ముందు వరసలో ఉన్నారు. అయితే..వీరిలో కూడా ‘సాయిప్రసాద్, విజయానంద్‌ల్లో ఒకరిని ‘చంద్రబాబు’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వీరిద్దరిలో ‘విజయానంద్’వైపే ‘చంద్రబాబు’ మొగ్గుచూపిస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన దాదాపు ‘సిఎస్’గా నియమించినట్లేననే భావన కూడా వ్యక్తం అవుతోంది. అయితే..‘సాయిప్రసాద్’ కోసం ఆయన సామాజికవర్గం తీవ్రంగా యత్నాలు చేస్తోందని, ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇదెంత నిజమో తెలియదు. బీసీ సామాజికవర్గానికి చెందిన ‘విజయానంద్’వైపే ‘చంద్రబాబు ఉన్నారని, అయితే..తనపై వస్తోన్న ఒత్తిడిని తట్టుకునేందుకు ఆయన గతంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ అనుసరించబోతున్నారని ప్రచారం సాగుతోంది.
ఏమిటీ ‘అజయ్‌కల్లం-దినేష్’ ఫార్ములా...!
2014-2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న ‘చంద్రబాబు’ నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయడానికో ఫార్ములాను రూపొందించారు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయినప్పుడు సీనియర్‌గా ఉన్న ‘అజయ్‌కల్లంరెడ్డి’ తనను ప్రభుత్వ కార్యదర్శిగా నియమించాలని ‘చంద్రబాబు’ను కోరారు. దీనికి ‘చంద్రబాబు’ అంగీకరించారు. అయితే ఆయనకు అప్పటికి నెలరోజులు మాత్రమే సర్వీసు ఉంది. అయితే ముందుగా నెల రోజుల పాటు ‘సిఎస్’గా నియమించి, ఆ తరువాత ఓ ఆరు నెలలు పొడిగింపు ఇవ్వాలని ‘చంద్రబాబు’ నిర్ణయించారు. అయితే...అప్పట్లో సిఎంఓ ఇన్‌ఛార్జిగా ఉన్న ‘సతీష్‌చంద్ర’ ‘అజయ్‌కల్లంరెడ్డి’ని సిఎస్‌గా నియమించడాన్ని తప్పుపట్టారు. (దీనికి ఆయన తరువాత భారీ మూల్యమే చెల్లించారు.‘జగన్’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘సతీష్‌చంద్ర’ను తీవ్రంగా అవమానించారు. గతంలో ఆయన సిఎంఓ ఇన్‌ఛార్జిగా ఉన్న గదిని ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకుని ‘అజయ్‌కల్లంరెడ్డి’ తీసుకున్నారు. ఆ గది ముందు ‘సతీష్‌చంద్ర’ను గంటలకొద్ది నిలబెట్టి అవమానించి ప్రతీకారం తీర్చుకున్నారు ‘అజయ్‌కల్లంరెడ్డి’.) ఆయన ‘దినేష్‌కుమార్’ను సిఎస్‌గా నియమించాలని ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెచ్చారు. దీంతో..‘చంద్రబాబు’ ఎటూ తేల్చుకోలేకపోయారు. దాంతో..చివరకు ఓ ఫార్ములాను అమలు చేశారు. ఆ ఫార్ములా ప్రకారం ముందుగా నెలరోజుల పాటు ‘అజయ్‌కల్లంరెడ్డి’ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జీవోను విడుదల చేశారు. అంతేనా..అదే జీవోలో నెలరోజులు ముగిసిన దగ్గర నుంచి ‘దినేష్‌కుమార్’ సిఎస్‌గా పనిచేస్తారంటూ..చరిత్రలో ఎప్పుడూ విడుదల కానీ జీవోను అప్పట్లో విడుదల చేసి ‘చంద్రబాబు’ సంచలనం సృష్టించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ జీవోపై ‘అజయ్‌కల్లంరెడ్డి’ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, తనను ‘చంద్రబాబు’ అవమానించారని భావించి, తరువాత ఆయన ‘జగన్మోహన్‌రెడ్డి’ గెలుపుకోసం తీవ్రంగా పనిచేశారు. ఇదంతా చరిత్ర. ఇప్పుడూ అదే విధంగా ‘చంద్రబాబు’ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
‘అజయ్‌కల్లంరెడ్డి-దినేష్‌కుమార్’ ఫార్ములా వలే..ఇప్పుడు ముందుగా ఏడాదిపాటు ‘విజయానంద్’ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని, తరువాత కాలానికి ‘సాయిప్రసాద్’ను సిఎస్‌గా నియమిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదంతా ఇప్పుడు వస్తోన్న వార్తల ఆధారంగానే. అయితే..గతంలో ఇచ్చినట్లు ఇప్పుడు జీవో ఇవ్వరంటున్నారు. ‘సాయిప్రసాద్’ను పిలిచి చెబుతారని, ‘విజయానంద్’ రిటైర్‌మెంట్ తరువాతే ‘సిఎస్’గా ఆయనకు అవకాశం కల్పిస్తారని హామీ ఇస్తారని చెబుతారనే ప్రచారం సాగుతోంది. మొత్తం మీద... ‘చంద్రబాబు’ కనుక గతంలో పాటించిన విధంగానే చేస్తే..అది మరో సంచలనమే. సీనియర్లను అవమానించకూడదని, అందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యమే దీనిలో ఉందని టిడిపి నేతలు అంటున్నారు. మొత్తం మీద..ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బీసీ వర్గానికి అవకాశం దక్కుతుంది. బీసీల పార్టీగా టిడిపి వారికి పెద్దపీట వేస్తోందని కూడా వారు చెబుతున్నారు.