లేటెస్ట్

‘చేపల’ కంపే ‘ఇంపు’...!

వెనకటికి ఒక చేపలమ్మే ఆమె..చేపలు అమ్ముకుంటూ ఉండగా హఠాత్తుగా భారీ వర్షంతో తడిసిపోయింది. చేపల బుట్టతో సహా ఆమె ఓ ఇంటిలోనికి వెళ్లి ఆశ్రయం ఇవ్వాలని ఆ ఇల్లాలిని కోరింది. దానికి ఆ ఇల్లాలు అంగీకరించి, తుడుచుకోవడానికి పొడిబట్టలు ఇచ్చి..తరువాత అన్నంపెట్టి..ఓ గదిలో ఆమె విశ్రమించడానికి ఏర్పాట్లు చేసింది. దానికి ‘చేపలమ్మే ఆమె’ కృతజ్ఞత చెబుతూ..ఆ రూమ్‌లో విశ్రమించడానికి వెళ్లింది. అయితే..ఆ గదంతా..మల్లెపూలతో నిండి ఉండిరది. ఎటుచూసినా..మల్లెపూల సువాసన వస్తోంది. ఎంతో పరిమిళమైన ఆ వాసన ఆమెకు నిద్రను పట్టనీయలేదు. ఎంత ప్రయత్నించినా..ఎన్నిసార్లు దొర్లినా..కిందామీదా అయినా కునుకే పట్టలేదు మల్లెపూల పరిమిళంతో..దాంతో..ఆమె..ఇలా అయితే..లాభం లేదనుకుని..తన చేపల బుట్టను తెచ్చుకుని..తలవైపున పెట్టుకుంది. ఆ చేపల దుర్గంధంతో ఆమెకు వెంటనే నిద్రపట్టేసి హాయిగా నిద్రపోయింది. మల్లెపూల సుగంధాల కన్నా..ఆమెకు అలవాటైన చేపల కంపే ఆమెకు ఇంపైయి..హాయిగా నిద్రపోయింది. ఈ చేపలమ్మె ఆమె వలే..కొన్ని రాజకీయపార్టీలు వ్యవహరిస్తున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా..ఆ..పార్టీ..ఈ పార్టీ అని కాకుండా..అన్నిపార్టీలు..అదే దోవలో నడుస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీకి, ప్రభుత్వానికి సహాయకారిగా ఎన్నికల వ్యూహకర్త ‘రాబిన్‌శర్మ’ను నియమించుకోబోతున్నారనే వార్తలు చూస్తుంటే..‘చేపలమ్మ’ కథే గుర్తుకువస్తుంది. 


గతంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇదే విధంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో తనకు ‘ప్రశాంత్‌ కిశోర్‌’ ఘనవిజయం సాధించిపెట్టారని, ఆయనను తరువాత ప్రభుత్వ వ్యవహారాల్లోనూ భాగస్వామ్యం కల్పించారు. మరి వీరి వల్లే పార్టీ గెలిస్తే 2024లో ‘జగన్‌’ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు..? అప్పట్లో ‘జగన్‌’ గెలుపుకు కారణం..ఒక్కసారి అవకాశం ఇద్దాం..యువకుడు, రాజశేఖర్‌రెడ్డి కుమారుడు, 2014లో ఓడిపోయాడు..ప్రజల్లో కలియతిరుగుతున్నాడు..ఏదోదే చెబుతున్నాడు..ఒకసారిచూద్దామనేదే..! అంతే తప్ప..‘పికె టీమ్‌’ వల్ల కానేకాదు. అదే సమయంలో..ఆయన పార్టీ కార్యకర్తలు, ఆయన మతానికి చెందిన వారు, ఆయన కులస్తులు..తమ వాడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే గొప్పపట్టుదలతో పోరాటం చేయడమే...ప్రధాన కారణం. అయితే ‘జగన్‌’ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలను, నేతలను, అమాత్యులను, ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా, ‘పికె’ టీమ్‌ ఇచ్చే దొంగ సర్వేలను నమ్మి ఘోరంగా బోల్తా పడ్డారు. ఇప్పుడు తాను చేసిన తప్పులను తలచుకుని విలపిస్తున్నారు.


గతంలో ‘జగన్‌’ పాటించిన విధానాలనే నేడు కూటమి ప్రభుత్వం పాటిస్తోంది. గత ఎన్నికల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన కార్యకర్తలను, దిగువస్థాయినాయుకులను, సానుభూతిపరులను పట్టించుకోకుండా, అధికారులకు, ఇలాంటి వ్యూహకర్తలకు పెద్దపీట వేస్తోంది. నాడు ‘చంద్రబాబునాయుడు’ను ‘జగన్‌’ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు ఉద్యమంలా కదిలింది పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులే తప్ప..ఈ ఎన్నికల వ్యూహకర్తలు కాదు. ‘చంద్రబాబు’ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా..ఆయన వెంట నిలిచింది...పార్టీ కార్యకర్తలే..మరి ఇప్పుడు..ప్రభుత్వంలో..పార్టీలో వందలకోట్లు పోసి..వ్యూహకర్తలను తెచ్చుకుంటే..వచ్చే లాభం ఏమిటో..? ఎన్నికల సమయంలో..ఏదో చేశారనుకుంటే..ఓకే..ఇప్పుడు..వ్యూహకర్తలు..ఎందుకు..? ఒక సామాన్య కార్యకర్తను అడిగితే..చెబుతాడు..ప్రభుత్వం...ఎలా పనిచేస్తుందో..? ఏమేమి సరిచేసుకోవాలో..? అంతే కానీ..వందలకోట్లు ధారబోసి..చేపలకంపులాంటి వ్యూహకర్తల వచ్చేదేమిటి..? వాళ్లేమైనా..నిజాయితీ, నిష్కరగా పనిచేస్తారా..? అలా చేసేటట్లయితే..‘జగన్‌’ మళ్లీ అధికారంలోకి రావాల్సింది. అంటే..వాళ్లెంత డేంజర్‌ వ్యక్తులో..అర్థంకావడం లేదా..? వజ్రాలాంటి కార్యకర్తలను కాదనుకుంటే..జరిగేదేమిటో కళ్లముందు కనిపిస్తున్నా...మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. మొత్తం మీద..‘చేపలమ్మ’కు చేపల కంపు లేకపోతే నడవదన్నట్లు ఈ పార్టీలకు ఎన్నికల వ్యూకర్తలు లేకపోతే...పార్టీలు, ప్రభుత్వాలను నడపలేరేమో..!?

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ