లేటెస్ట్

సిఎస్‌గా ‘విజ‌యానంద్‌’ను నియ‌మించిన ప్ర‌భుత్వం

అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్లే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ‘విజ‌యానంద్‌’ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రోజు నియ‌మించింది. ఆయ‌న‌ను సిఎస్‌గా నియ‌మిస్తూ ఈ రోజు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నీర‌బ్‌కుమార్ ఈనెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఆయ‌న స్థానంలో కె.విజ‌యానంద్‌ను సిఎస్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. 1992 బ్యాచ్‌కు చెందిన విజ‌యానంద్‌ను ప్ర‌స్తుతం విద్యుత్‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆయ‌న‌ను సిఎస్‌గా నియ‌మించ‌బోతోంద‌ని www.Janamonline.com ఇంత‌కు ముందే చెప్పింది. వాస్త‌వానికి సాయిప్ర‌సాద్‌ను సిఎస్‌గా నియ‌మిస్తార‌ని రాజ‌కీయ‌, అధికార‌వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగింది. చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన సాయిప్ర‌సాద్‌ను చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌ర‌ని, బీసీ వ‌ర్గానికి చెందిన విజ‌యానంద్‌కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కూడా Janamonline.com తెలిపింది. కాగా ఈ ప‌దవి కోసం ప‌లువురు ఐఏఎస్ అధికారులు పోటీ ప‌డ్డారు. ముఖ్యంగా సాయిప్ర‌సాద్ చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌కు ఆయ‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు ఇచ్చారు. అయితే..ముందుగా విజ‌యానంద్‌కు అవ‌కాశం ఇచ్చి త‌రువాత సాయిప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని, దీంతో..సాయిప్ర‌సాద్‌కు విజ‌యానంద్ రిటైర్ అయిన త‌రువాత సిఎస్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం ఉంది. కాగా..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపిక‌లో ఓ వివాదాస్ప‌ద సంస్థ కీల‌క‌పాత్ర పోషించింద‌ని, వారి ఒత్తిడి వ‌ల్లే విజ‌యానంద్‌కు అవ‌కాశం ద‌క్కింద‌ని సోష‌ల్‌మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే సుధీర్ఘ అనుభ‌వం ఉండ‌డం, బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం, అదీ యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం విజ‌యానంద్‌కు క‌లిసివ‌చ్చింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. మొత్తం మీద నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు విజ‌యానంద్ రాష్ట్ర నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ