‘విజయానంద్’ వారసుడు ఎవరు...!?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను నియమించడంతో..ఆయన ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఇంధనశాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంధన శాఖ అధిపతిగా ‘విజయానంద్’ దాదాపు 12 సంవత్సరాలు పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆయన ఇంధనశాఖలో పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వశాఖాధిపతిగా ఒకేఒక్కరు ఇన్ని సంవత్సరాలు పనిచేయడం నిజంగా విశేషమే. ‘కిరణ్ కుమారెడ్డి ’ ‘చంద్రబాబునాయుడు’ వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి,మరలా చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పనిచేసినా..‘విజయానంద్’ను మాత్రం ఇంధనశాఖ నుంచి పక్కకు తప్పించలేదు. వారందరినీ ‘విజయానంద్’ బాగా ఆకట్టుకున్నారని, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఉండే ఇంధనశాఖ వల్ల అందరూ లాభపడ్డారనే భావన వివిధ వర్గాల్లో ఉంది. ఆయన పనితీరువల్లే వీరందరూ ఆయనను అదే పదవిలో కొనసాగించారా..? లేక తెరవెనుక వ్యవహారాలు ఏమైనా జరిగాయా..? అనేదానిపై స్పష్టత లేదు. రాష్ట్ర విభజన తరువాత ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వివిధ కార్పొరేట్ కంపెనీలతో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకంగా పనిచేశారు. అదే విధంగా ‘జగన్మోహన్‌రెడ్డి’ ముఖ్యమంత్రి కావడంతోనే..పిపిఏల ఒప్పందాలను రద్దు చేయడంలో..తరువాత ‘అదానీ’తో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ‘విజయానంద్’ ప్రత్యేకంగా కృషిచేశారంటారు. ‘అదానీ`జగన్’ల లంచాల భాగోతం బయటకు వచ్చాక ‘విజయానంద్’పై చర్యలు ఉంటాయని, ఆయనను అమెరికాలో అరెస్టు చేస్తారని టిడిపిని సమర్థించే కొన్ని మీడియా సంస్థలు పదే పదే వార్తలు ప్రచురించాయి. అయితే..అదేమీ జరగలేదు కానీ..ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ లభించింది. కాగా ఇప్పుడు ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే దానిపై అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ‘విజయానంద్’ వలే..ఆకట్టుకునే వ్యక్తి ఎవరు..? వచ్చిన అధికారి ఆయన వలే ప్రభుత్వానికి సహకరిస్తారా..? కార్పొరేట్ శక్తులను రాజకీయనాయకులను మిళితం చేస్తారా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. మొత్త మీద ‘విజయానంద్’ వారసుడిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.