‘చంద్రబాబే’ పింఛన్లు పంపిణీ చేయాలా...!?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లును వెంటనే పెంచేసింది. అప్పటి వరకూ ఉన్న రూ.3వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4వేలు చేసింది. అదే విధంగా వికలాంగుల, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి వరుసగా రూ.6వేలు, రూ.15వేలు చేసి వారిలో వెలుగులు నింపింది. కూటమి ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవడంతో..పింఛన్‌దారుల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే..గతంలో హామీ ఇచ్చిన మూడు నెలల బకాయిలతో పాటు ఆ నెలది కూడా కలిపి ఒకేసారి పింఛన్‌ను పంపిణీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమంలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని తన చేతుల మీదుగా లబ్దిదారులకు పింఛన్ అందచేశారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేయించారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమని వైకాపా పెద్దలు గతంలో నానా యాగీ చేశారు. ఇదేమీ పెద్ద విషయం కాదని ‘చంద్రబాబు’ చేతల ద్వారా నిరూపించారు. అయితే..మొదట సారి కనుక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు..తరువాత ఆయన పాల్గొనరేమో అన్న భావన ఉండేది. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా ఏదో ఒక జిల్లాలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. పింఛన్లను పంపిణీ చేస్తూ..ఆయా చోట్ల ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను వింటున్నారు. అయితే..దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో పాల్గొనడమేమిటని, దీని వల్ల ప్రజలపై ఎంత ఖర్చుపడుతుందో ప్రభుత్వం ఆలోచిస్తోందా..అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏదో ఒక జిల్లాకు వెళ్లిన ప్రతిసారి కనీసం మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు అవుతున్నాయని, ఇదంతా వృధానేగా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పింఛన్ల పంపిణీ ఉద్యోగులకు అప్పచెప్పినందున ఇక ముఖ్యమంత్రి చేసేదేముందన్న ప్రశ్నను వారు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులతో..గతంలో..విద్యార్థులకు మంజూరు చేయకుండా ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తే..బాగుంటుంది కదా..దీని వల్ల ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని వారు సూచిస్తున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు కనుక..పదే పదే ఆయన అవసరం లేదని, ఆయన పార్టీ వాళ్లు ఆయా జిల్లాలో పాల్గొంటే..చాలని వారు చెబుతున్నారు. ఖర్చు తగ్గింపు చర్యల వల్ల ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న భావన వ్యక్తం అవుతోంది.
చేసింది చెప్పుకోవద్దా...!?
పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పదే పదే పాల్గొంటే అవుతోన్న ఖర్చుపై ఆలోచించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంతో తప్పులేదనేది ముఖ్యమంత్రిని, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించేవారి మాట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వలే విచ్చలవిడిగా ఖర్చు చేయడం లేదని వారు అంటున్నారు. గతంలో ‘జగన్’ జిల్లాల పర్యటనకు వస్తే వేలాది మంది పోలీసులను బందోబస్తుకోసం నియమించేవారని, పరదాలు కట్టేవారని, చెట్లు కొట్టేసేవారు. అంతేనా..ఆయనేదో ‘బటన్’ నొక్కేకార్యక్రమాన్ని పెట్టుకుంటే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయ స్వంత పత్రికతో పాటు ఇతర పత్రికలకు కట్టబెట్టేవారని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదంటున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోవడానికి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించడంలో తప్పులేదనే భావన వారిలో ఉంది. గతంలో ప్రభుత్వ సొమ్ముతో ‘జగన్’ వాలంటీర్లను నియమించుకుని..వారి ద్వారా..సామాజిక పింఛన్లు పంపిణీ చేయిస్తూ..తన పార్టీ ప్రచారం చేసుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ‘చంద్రబాబు’ ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏమీ ఖర్చు చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పింఛన్లను పంపిణీ చేయిస్తున్నారని, దీని ద్వారా ప్రజల సొమ్ము ఏమీ వృదా కాదని అంటున్నారు. మరోవైపు తాము పెంచిన పింఛన్ల సొమ్ముతో వృద్ధులు, వికలాంగులు, ధీర్ఘకాలిక రోగస్తులు స్వాంతన పొందుతున్నారని, దీన్ని రాజకీయం చేయవద్దని టిడిపిని సమర్ధించేవారు చెబుతున్నారు. కాగా..గతంలో ఇచ్చిన పింఛన్లనే ఇప్పుడూ కొనసాగిస్తున్నారని, దీని ద్వారా వైకాపా మద్దతుదారులే..ఎక్కువ లబ్ది పొందుతున్నారని, కూటమి ప్రభుత్వానికి అదనంగా వచ్చే లాభం కొంతేననే భావన రాజకీయ పరిశీలకుల్లో ఉంది.ఏది ఏమైనా..ముఖ్యమంత్రి ప్రతిసారీ పింఛన్ల పంపిణీ కోసం ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.