లేటెస్ట్

‘సిఎస్‌’ పోస్టుపై ఇంత చర్చ అవసరమా...!?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘సిఎస్‌’గా ఉన్న ‘నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌’ రిటైర్‌ కావడంతో..ఆయన స్థానంలో ‘విజయానంద్‌’ను కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈయన నియామకంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ముందుగా ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను ఎలా ఎంపిక చేస్తారనే విమర్శలు వచ్చాయి. అనంతరం ఆయన కన్నా సీనియర్‌ అధికారులు ఉన్నా వారిని కాదని, జూనియర్‌ అయిన ఆయనను ఎలా నియమించారనే ప్రశ్నలు వచ్చాయి. మరోవైపు కులం చూసి అత్యున్నత పదవి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న కూడా వచ్చింది. ‘సెకీ’ ఒప్పందంలో అవినీతి జరిగిందని, దానికి ‘విజయానందే’ బాధ్యుడనే ఆరోపణలున్నా ఆయనను ఎలా నియమించారంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘విజయానంద్‌’  వైకాపా పార్టీ సానుభూతిపరుడని, ఆయన మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’కి అత్యంత సన్నిహితుడని, అలాంటి వ్యక్తిని ఎలా నియమిస్తారని టిడిపి కార్యకర్తలు, నాయకులు అంతరంగిక సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే..ఎన్ని ఆరోపణలు వచ్చినా..ఎవరు ఎంత మొత్తుకున్నా ‘చంద్రబాబు’ మాత్రం ‘విజయానంద్‌’కే ‘సిఎస్‌’ పోస్టును ఇచ్చేశారు. అయితే..అర్థం కాని విషయం ఏమిటంటే..గతంలో ‘జగన్‌’ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తన కులానికి చెందిన వారిని ‘సిఎస్‌’గా, డీజీపీగా,టిటిడి ఇఓగా, సిఎంఓ ఇన్‌ఛార్జిగా నియమించుకుంటే..ఒక్కరంటే..ఒక్కరు గొంతెత్తి ప్రశ్నించలేదు. ఇదేమిటి..? అత్యున్నత పోస్టులన్నీ ఒకే సామాజికవర్గానికి ఎలా ఇస్తారంటూ..ఎవరూ నిలదీయలేదు. అయితే..ఇప్పుడో ‘బీసీ’కి అత్యున్నత పదవి ఇస్తే..అటు ప్రతిపక్షాలతో పాటు, ఇటు స్వంత పార్టీ నేతలు కూడా ‘చంద్రబాబు’ను నిలదీస్తున్నారు. ఎక్కడ ఉంది లోపం. ప్రజాస్వామ్యయుతంగా..నడవడమే..దీనికి కారణమా..? లేక..ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? తెలియదు కానీ..‘బీసీ’లకు పదవులు ఇచ్చినా ‘చంద్రబాబు’ మాత్రం విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. 

వీటన్నింటిని పక్కన పెడితే..అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి..? ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే..ముఖ్యమంత్రి తరువాత..ఆయనే పాలనలో కీలకం. ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నామ్‌కేవాస్తీగా మారిందనే మాట రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల నుంచి వినిపిస్తోంది. గతంలో..వివిధ శాఖలకు ఐఏఎస్‌ అధికారులను ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రులు తప్పక సంప్రదించేవారు. వారి సూచనలు తీసుకున్న తరువాతే..ఆయా ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చేవారు. అయితే..ఇప్పుడా పరిస్థితి లేదు..ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లిస్ట్‌పై సంతకం చేయడమే..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పని. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లోనూ ‘సిఎస్‌’ పాత్ర గణనీయంగా ఉండేది. కానీ..ఇప్పుడు..ఆయన పాత్ర పరిమితమే. అయితే..ప్రతి ఐఏఎస్‌అధికారి జీవిత లక్ష్యం ‘సిఎస్‌’గా పనిచేయడం. అయితే..అది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది కనుక ఆ పోస్టుకు తీవ్రమైన పోటీ ఉంటోంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడో ఐఏఎస్‌ను ‘చంద్రబాబు’ ‘సిఎస్‌’ను చేస్తానంటే..ఆయన వద్దన్నారని ప్రచారం సాగుతోంది. ఇది తెలిసిన ఆయన సన్నిహితులు కొంత మంది..‘ఎందుకు ఆ పోస్టు వద్దన్నారు సార్‌...? అని ప్రశ్నిస్తే..‘సిఎస్‌’ పని పోస్ట్‌మాస్టర్‌ పనే..వచ్చిన దస్త్రాలపై సంతకాలుచేయడమే కదా.. అంతదాని కోసం...నేనెందుకు..? ఇక్కడ ఉంటే..ముఖ్యమైన శాఖలో పనిచేస్తున్నాను..ఎంతో కొంత ప్రజలకు నేరుగా ఉపయోగపడుతున్నాను.శాఖ మొత్తం నా కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇంత కంటే..ఏమి కావాలని అన్నారని తెలుస్తోంది. ఆయన అన్నది వందకు వందశాతం నిజమే. అయితే..ప్రొటోకాల్‌ ప్రకారం..‘సిఎస్‌’కు ప్రాధాన్యత ఉంటుంది. గౌరవం ఉంటుంది...ఐఏఎస్‌ అధికారులపై కంట్రోల్‌ ఉంటుంది. ఏవి ఉన్నా..గతంలో ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుకు లభించడం లేదనే భావన ఐఏఎస్‌ వర్గాల్లో ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ