నూతన ఏడాదిలో ‘చంద్రబాబు’కు ‘లిట్మస్‌టెస్ట్’...!?
మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు...!
టిడిపితో హోరాహోరిగా పోరాడుతున్న ‘పిడిఎఫ్’
వెనకుండి మద్దతు ఇస్తోన్న ‘జగన్’
‘చంద్రబాబు’ పాలనపై కార్యకర్తల్లో వ్యతిరేకత...!
స్వంత కులాన్ని పట్టించుకోకపోవడమూ కారణమే...!
నూతన ఏడాది మరికొద్ది నిమిషాల్లో రాబోతోంది. ముగుస్తోన్న ఏడాది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టింది. ఏడాది మొదట్లో టిడిపి కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు సమరోత్సాహంతో కలసికట్టుగా పనిచేసి..నియంత ‘జగన్’ను గద్దె నుంచి దింపేశారు. చరిత్రలోని లేని ఘన విజయాన్ని నమోదు చేసి ‘చంద్రబాబు’ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రాణ త్యాగాలు చేశారు..ఆస్తులను పోగొట్టుకున్నారు..శీలాలను పోగొట్టుకున్నారు..వికలాంగులు అయ్యారు..ఇలా ఒకటేమిటి..సమస్థం త్యాగం చేశారు. ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయితే..రాష్ట్రానికి మేలు జరుగుతుందని, తుగ్లక్ చర్యలతో నష్టపోయిన ‘ఆంధ్రా’ను ఆయన అయితేనే నిలబెడతారే భావనతో వారు తమ సర్వస్వాలను అర్పించేసి..తిరుగులేని పోరాటంతో విజయదుంధుభి మోగించారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత వారి స్వప్నాలు సాకారమయ్యాయా..? వారు అనుకున్నది జరుగుతుందా..? అంటే మొదటి ఆరు నెలల్లో అటువంటి ప్రయత్నమే జరగలేదని చెప్పవచ్చు. ఈ ఆరు నెలల్లో కొంత మేర ప్రజలకు ‘చంద్రబాబు’ పాలన నచ్చినా...ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఆయన సామాజికవర్గానికి ‘తండ్రీకొడుకుల’ పాలన నచ్చడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చెప్పాం..ఇప్పుడేమి చేస్తున్నామనే దానిపై వాళ్లు ప్రతిరోజూ సమీక్షించుకుంటూ..తాము ఆశించిన ప్రభుత్వం ఇది కాదని నిర్వేదాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పులు చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేయడం, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు లేకపోవడం...‘జగన్’ అండచూసుకుని రెచ్చిపోయిన అధికార మూకలకు మళ్లీ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం, గతంలో కులముద్ర వేసి ‘జగన్’ పక్కన పెట్టిన సీనియర్ అధికారులకు ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం.. కార్యకర్తలకు, దిగువస్థాయి నాయకులను కలుసుకోవడానికి సమయం ఇవ్వకపోవడం, మళ్లీ అధికారుల మాటలు నమ్మి సమీక్షలతో సమయం వృధా చేయడం, సీనియర్లను పక్కనపెట్టి ప్రత్యర్థిపార్టీకి చెందిన వారిని అందలం ఎక్కించడం...ఇలా ఒకటేమిటి..సమస్థం..అస్తవ్యస్థ విధానాలతో..కార్యకర్తల హృదయాలను తండ్రీకొడుకులు ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఇందుకేనా..మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంది...? అనే నిర్వేదం ప్రతిఒక్కరిలో కల్గుతోంది. అయితే ప్రస్తుతానికి ఇలా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారు..తమలో తాము తిట్టుకోవడం, సహచరులతో వాపోవడం వరకే చేస్తున్నారు. అయితే..వాళ్లూ ఎప్పుడూ ఇలానే ఉండరనే సంగతిని అధిష్టానం..గుర్తించడం లేదు. అదను చూసుకుని అధినేతకు, ఆయన కుమారుడికి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్ట్...!
నూతన ఏడాది మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధినేత ‘చంద్రబాబు’కు షాక్ ఇవ్వడానికి పార్టీలోని అసంతృప్తి వాదులు, స్వకులం వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా చైతన్యం కలిగిన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో తమను నిర్లక్ష్యం చేసినందుకు, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వనందుకు..అధినేతకు ఒకగట్టి షాక్ ఇవ్వాలనే భావన స్వకులంలోనే ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తే..వీళ్లు ఇలా చేస్తారా..? చూద్దాం వారి సంగతి..? అంటూ..వీరావేశాలకు పోతున్నారు. కాగా..వీరు ఇలా ఉంటే..ప్రతిపక్ష వైకాపా తెరవెనుక నుంచి టిడిపికి షాక్ ఇచ్చేందుకు యత్నిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఘోరమైన ఓటమికి గురైన వైకాపా..ఇప్పుడు టిడిపిలో నెలకొన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగకుండా..తమ రహస్య మిత్రులను రంగంలోకి దింపింది. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పిడిఎఫ్ అభ్యర్థికి వైకాపా తెరవెనుక నుంచి మద్దతు ఇస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కమ్యూనిస్టులతో అవగాహన కుదిరితే..రాబోయే రోజుల్లో వారితో కలిసి వీధిపోరాటాలు చేయాలనేది వైకాపా అధినేత ‘వై.ఎస్.జగన్’ ఎత్తుగడ. ఇప్పటికే..వారిని బుట్టలో పెట్టేసిన ‘జగన్’ అదను కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే టిడిపి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాను అదే ఫార్మెట్‌లో రిటన్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆయన ఎత్తులు వేస్తున్నారు. ఒకవైపు కమ్యూనిస్టులు, మరోవైపు టిడిపిలోని అసంతృప్తి వాదులు కలిసి ‘చంద్రబాబు’కు లిట్మస్‌టెస్ట్ పెట్టబోతున్నారు. మార్చిలో జరిగే ఈ ఎన్నికల్లో ఒకవేళ టిడిపి అభ్యర్థి ఓడిపోతే..ఇక ‘జగన్’ను అడ్డుకోవడం ‘చంద్రబాబు’కు, ‘పవన్’కు శక్తికి మించిన పనే.
ఆరు నెలలకే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ఇప్పటికే ‘జగన్’ ఆయన అనూయులు తెగ ప్రచారం చేస్తున్నారు. వారి ప్రచారాన్ని నిజం చేసేందుకైనా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ని గెలిపించాలని వారు కసరత్తులు చేస్తున్నారు. ఒకవైపు వైకాపా, పిడిఎఫ్‌లు ఎన్నికల్లో గెలవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంటే..టిడిపి మాత్రం నింపాదిగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది కనుక టిడిపి అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనంటూ ఊహల్లో తేలియాడుతోంది. అయితే..ఇప్పటికే..కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ఒక సెక్షన్ ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సూపర్ సిక్స్ ఎక్కడా అంటూ..కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కూటమి నుంచి సరైన సమాధానం లేదు. ఇది ఇలా ఉంటే..ఎన్నికల్లో గెలిచిన తరువాత ‘తండ్రీకొడకులు’ తమను పక్కనపెట్టారంటూ..ఆయన సామాజికవర్గానికి చెందిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని గతంలో ‘జగన్’ వేధించారని, టిడిపి అధికారంలోకి వస్తే తమ బాధలు పోతాయని వారు భావించగా అదేమీ జరగలేదు. గతంలో ఉన్నవిధంగానే ఇప్పుడూ ఉందని వారు వాపోతున్నారు. తమ ప్రాణాలు లెక్కపెట్టకుండా, వందలకోట్లు సొమ్ములు తెచ్చి ఎన్నికల్లో గుమ్మరిస్తే..తమను పట్టించుకోవడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఇంకెందుకు ఈ ప్రభుత్వం అంటూ..నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇప్పటి వరకూ వారిలో అసంతృప్తి మాత్రమే ఉంది. ఇక నూతన ఏడాదిలోనూ ఇదే పరిస్థితులు ఉంటే..వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చాటతారనడంలో ఎటువంటి సందేహం లేదు. వైకాపా, పిడిఎఫ్‌లతో పాటు, టిడిపిలో అసంతృప్తితో ఉన్నవారంతా ఒకటైతే..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి భంగపాటు తప్పదేమో..? నూతన ఏడాదిలోనైనా పార్టీ కోసంపనిచేసిన టిడిపి కార్యకర్తలను, సానుభూతిపరులను ‘చంద్రబాబు’ ఆయన తనయుడు పలకరించకపోతే..వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యహరిస్తారు.
సంక్షేమం, అభివృద్దే గెలుపు మంత్రాలు...!
కాగా వైకాపా, పిడిఎఫ్, టిడిపి అసంతృప్తి వాదులంతా కలిసి వచ్చినా...తనను ఏమీ చేయలేరనే భావన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’లో ఉన్నట్లుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను చాలా పనులు చేశానని, పింఛన్లు పెంచానని, రాజధాని అమరావతి, పోలవరం పనులుచేస్తున్నానని, మెగా డిఎస్సీ ఇచ్చానని, పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు ఒకటవతేదీనే చెల్లిస్తున్నానని, మద్యం రేట్లను తగ్గించానని, నాణ్యమైన మద్యం ఇస్తున్నానని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశానని, ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చానని, ఇన్ని చేస్తున్న తనకు ఎదురేముంటుందనే భరోసాతో ముఖ్యమంత్రి ఉంటున్నారట. అయితే..ఇవన్నీ ఒకెత్తు..పార్టీ కార్యకర్తలు మరో ఎత్తు. వారి మనోభిప్రాయాలను గౌరవించకపోతే..ఎన్ని చేసినా..ఎంత అభివృద్ధిచేసినా..భంగపాటు తప్పదనే విషయం చరిత్ర రుజువు చేసింది. పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులను నొప్పించారని, వారు ఊరికే ఉండరని, వారు తాము మళ్లీ మోసపోయామనే భావనతో ఉన్నారని, వారిని సంతృప్తి పరచకపోతే..నూతన ఏడాదిలో ‘చంద్రబాబు’కు కఠిన స్థితి ఎదురవుతుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.