లేటెస్ట్

‘ఏమిటి 1995 ‘సిఎం’...!?

ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎవరు అడిగినా..అడగకపోయినా...తాను 1995 ముఖ్యమంత్రిని అవుతానని పదే పదే చెప్పుకుంటున్నారు. నాటి పరిపాలనను తాను మళ్లీ తెస్తానని చెబుతున్నారు. ఇంతకీ...నాడు...ఏమి జరిగింది..? అప్పట్లో ఆయనేమి చేశారు..? అప్పట్లో ఆయన సాధించిన విజయాలేమిటి...? నాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి...? నాడు ఆయన్ను ప్రపంచ నేతలు ‘ఆంధ్రా సీఇఓ’గా ఎందుకు వర్ణించారు..?దాని వలన ఆయనకు లాభం జరిగిందా...? నష్టం జరిగిందా..? నాడు పాలనాదక్షుడిగా పేరుతెచ్చుకున్న ఆయన నేడు ఎందుకు పాలనాపరంగా, రాజకీయంగా విఫలం అవుతున్నారు...నాడు..జరిగిందేమిటో..ఇప్పటి తరానికి తెలియదు. ఇప్పుడు మీడియాలో ఉన్నవాళ్లకు కూడా నాడు ‘చంద్రబాబు’ పాలన గురించి పెద్దగా తెలియదు. బాగా సీనియర్లకు తెలుసు నాడేమి జరిగిందో...?? నాటి ‘బాబు’ పాలన ఎలా మొదలై..ఎలా..ముగిసిందో..చూద్దాం.


ఎన్టీఆర్‌పై తిరుగుబాటు...!

1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, నాటి కమ్యూనిస్టుపార్టీలు మిత్రపక్షాలుగా పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో ఈ కూటమి ఘనవిజయం సాధించింది. 294 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 250 సీట్లు వచ్చాయి. టిడిపికే స్వంతంగా 219 స్థానాలు వచ్చాయి. ఇంకోవైపు అసెంబ్లీలో అప్పటి వరకూ పాలించిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఆ పార్టీకి కేవలం 26 సీట్లకే పరిమితమైంది. అయితే..ఈ విజయాన్ని చూసుకుని ‘అన్న ఎన్టీఆర్‌’ విర్రవీగిపోయారు. అధికారం మొత్తాన్ని తన రెండవ భార్య ‘లక్ష్మీపార్వతి’కి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో..టిడిపిలో అలజడి మొదలైంది. నిజమైన కార్యకర్తలకు న్యాయం పేరిట ‘చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ’ తదితరులు కలిసి ‘ఎన్టీఆర్‌’ను పదవి నుంచి దింపేశారు. ‘ఎన్టీఆర్‌’ను పదవీచ్యుతుడ్ని చేయడాన్ని కొందరు ‘వెన్నుపోటు’గా చెబుతుంటారు. అది ‘తిరుగుబాటు’ కానీ..లేదా ‘వెన్నుపోటు’ కానీ..ఏదైతే ఏమి..‘ఎన్టీఆర్‌’ నుంచి పాలనాపగ్గాలు ‘చంద్రబాబు’ చేతికి చిక్కాయి.  కాగా...అప్పల్లో ‘చంద్రబాబు’ పదవి మూడునాళ్ల ముచ్చటనే భావనలు ఉండేవి. అయితే ‘చంద్రబాబు’ అదృష్టమనాలో..ఏమో కానీ..పదవి కోల్పోయిన ‘ఎన్టీఆర్‌’ 1996 జనవరిలో మరణించారు. దీంతో..‘చంద్రబాబు’కు ‘ఎన్టీఆర్‌’ నుంచి ఎదురైయ్యే సవాళ్లు తప్పాయి. అయితే..ఎన్టీఆర్‌ వంటి మహానేత కూర్చోన్న సీటులో ‘చంద్రబాబు’ను చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఎటువంటి జనాకర్షణ, వాగ్ధాటి లేని ‘చంద్రబాబు’ తనను తాను నిరూపించుకోవడానికి, దాయాదుల నుంచి ‘సిఎం’ సీటును రక్షించుకోవడానికి ఆయన తనదైన శైలిని ఎంచుకున్నారు. 


ఉక్కపోత...!

‘ఎన్టీఆర్‌’ను పదవి నుంచి తప్పించిన తరువాత, అధికారంలో భాగస్వామ్యం కోసం, ఎన్టీఆర్‌ పెద్దల్లుడు ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’ ‘ఎన్టీఆర్‌’ తనయుడు ‘హరికృష్ణ’లు తీవ్రంగా పోటీపడ్డారు. ముందుగా ‘దగ్గుబాటి’కి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని వాగ్ధానం చేసిన ‘చంద్రబాబు’ ఆయనకు ఆ పదవి ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. అయితే ‘ఎన్టీఆర్‌’ తనయుడు ‘హరికృష్ణ’కు మాత్రం ‘రవాణాశాఖ మంత్రి’ పదవి ఇచ్చారు. ఈ ఇద్దరు నేతల వ్యవహారశైలితో ‘చంద్రబాబు’ ఉక్కపోతకు గురయ్యారు. దాంతో..వారిద్దరినీ..చాకచక్యంగా పక్కనపెట్టేశారు.వారిద్దరినీ పక్కకు తప్పించిన తరువాత..పాలనలో తన మార్కు కోసం ఆయన ప్రత్యేక శైలిని అనుసరించారు. 


ఆర్థిక సంస్కరణలు..!

రాజకీయంగా ఆయన కొద్దిగా కుదురుకున్నాక..ఆయన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షపార్టీలు, మిత్రపక్షాలు కాదన్నా..ఆయన దూకుడుగా ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఐటీని ప్రోత్సహించారు. శాంతిభద్రలు కాపాడడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మావోయిస్టులను అణిచివేశారు. ఈ పక్రియలో ఆయన ప్రాణాలకు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో చెలరేగిన మతకల్లోలాలను ఉక్కుపాదంతో అణిచేశారు. విజన్‌ 2020 పేరిట దార్శినిక పత్రాన్ని విడుదల చేసి...అమలు చేశారు. ఇలా ఒకటేమిటి..పనిచేసే ముఖ్యమంత్రిగా, ‘ఆంధ్రప్రదేశ్‌ సిఈఓ’గా పేరు తెచ్చుకున్నారు. అప్పుల్లో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్‌’ను ఒడ్డున పడేశారు. అయితే..ఎన్ని చేసినా..ఆయన రాజకీయంగా..మాత్రంగా ఘోరమైన దెబ్బలు తిన్నారు. 


1995 ఫార్ములా..పనిచేయదు..‘చంద్రబాబూ’...!

అప్పట్లో ‘చంద్రబాబు’ తీసుకొచ్చిన సంస్కరణలవల్ల కార్పొరేట్‌ శక్తులే బాగుపడ్డాయనే ప్రచారం జోరుగా ప్రజల్లోకి వెళ్లింది. సాంప్రదాయంగా వ్యవసాయ రాష్ట్రమైన ‘ఆంధ్రప్రదేశ్‌’లో ‘చంద్రబాబు’ రైతులను పట్టించుకోలేదని, ఆయనను కాంగ్రెస్‌ రైతు వ్యతిరేకిగా ప్రచారం చేసింది. అప్పట్లో వాళ్లు చేసిన ప్రచారం వల్ల ‘చంద్రబాబు’కు ఆయన పార్టీకి ఘోరమైన దెబ్బతగిలింది. ఎంతో అభివృద్ది చేసినా, ఆర్థిక సంస్కరణలు తెచ్చినా, పాలనలో బాధ్యత పెంచినా..ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్రానికి మేలు జరిగినా..రాజకీయంగా మాత్రం కోలుకోలేని దెబ్బ తిగిలింది. 1995లో ఆయన పాలన వల్ల ‘ఆంధ్రప్రదేశ్‌’కు రాజకీయంగా, ఆర్థికంగా గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. కానీ..ఆయనకు రాజకీయంగా ఏమి మేలు జరిగింది. 219స్థానాలు గెలుచుకున్న టిడిపి తరువాత 47సీట్లకు పరిమితం అయింది. పోనీ..తరువాత అయినా..‘చంద్రబాబు’ చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రజలు అధికారం ఇచ్చారా..? అంటే లేదు..2004లో ఓడిపోయిన..ఆయన మళ్లీ అదృష్టావశాత్తూ..రాష్ట్ర విభజన జరిగి మళ్లీ 2014లో అధికారంలోకి రాగలిగారు. అయితే..2014 నుంచి 2019 వరకూ విభజిత ‘ఆంధ్ర’ను నిలబెట్టేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. నూతన రాజధాని,పోలవరం అంటూ ఆయన కన్న కలలు..మళ్లీ ఐదేళ్లకే..కలలయ్యాయి. 2019 నుంచి 2024 వరకూ..రాష్ట్రంలో ‘జగన్‌’ పాలనతో అధోగతిలోకి జారిపోయింది. దీంతో..2024లో మళ్లీ ‘చంద్రబాబు’కు అవకాశం వచ్చింది. అయితే..పాలన మొదలుపెట్టిన ఆరు నెలల అయినా..ఆయన ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్నారు. ఎక్కడ చూసినా..అసంతృప్తి సెగలే..స్వంత పార్టీ కార్యకర్తలు, నాయకులు..అసంతృప్తి రాగాలు తీస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాను..మళ్లీ..1995 సిఎం అవుతానని ఆయన చెబుతున్నారు. అయితే..1995 సిఎం వల్ల..ఆయనకు నష్టమే జరిగింది కానీ..లాభమేమీ జరగలేదు. నాటి ఆయన ఒంటెత్తు పోకడలవల్ల..పాలనలో విజయం సాధించారేమో కానీ..రాజకీయంగా ఘోరాతిఘోరంగా దెబ్బతిన్నారు. అయితే..ఇప్పుడూ మళ్లీ అదే మోడల్‌లో వెళతానని చెబుతున్నారు. దీని వల్ల పాలనాపరంగా ఎంతో కొంత మంచి జరుగుతుందేమో కానీ..రాజకీయంగా మరోసారి ఘోరంగా దెబ్బతింటారు. ఆకస్మికతనిఖీలు, జవాబుదారీతనం, ఆర్థిక సంస్కరణలు వంటివి ఉద్యోగులకు రుచించవు. ఉద్యోగులతో పాటు, రైతు వర్గాలు దూరం అవుతాయి. యువత, సామాన్యుల రోజువారి సాదక,బాధలు పట్టించుకోకుండా విజన్‌ 2047 అంటే..రాజకీయంగా మరోసారి..2004 ఫలితాలకు ‘చంద్రబాబు’ సిద్ధంగా ఉండాలి. తన వ్యూహాలు, ఎత్తుగడలు, సంయమనంతో..విజయం సాధించానని ఆయన భావించవచ్చు కానీ..అది అర్థసత్యమే..అన్న విషయాన్ని ఆయన గ్రహించాలి. తనకే అంతా తెలుసు..తన వ్యూహాలకు తిరుగులేదనుకున్న 2004లో ఏమి జరిగిందో..‘చంద్రబాబు’ గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడూ..అధికారుల నక్కజిత్తులను నమ్మితే..ఇక అంతే సంగతులు. వాస్తవాలు వేరు..ఊహాలు వేరు. ఎప్పుడో..ఏదో చేస్తాననే మాటల వల్ల ఉపయోగమేమి లేదు. తక్షణ ఫలితాలే..ప్రజలకు కావాలి. బ్రహ్మాండమైన ఊహాశక్తితో..ప్రచారాలు చేస్తే..చివరకు అవే శాపాలై చుట్టుకుంటాయి...2014లో అమరావతిలాగా..!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ