‘బుడితి’కి ‘పివి రమేష్’ మద్దతు...!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ‘బుడితి రాజశేఖర్’ సర్వీసు పెంపుపై అధికార, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవసాయశాఖ స్పెషల్ సిఎస్‌గా ఉన్న ‘రాజశేఖర్’ సర్వీసును మరో ఏడాదిపాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై అధికారవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సర్వీసును పెంచడాన్ని కొందరు తప్పుపడుతుండగా, మరికొందరు సమర్ధిస్తున్నారు. వాస్తవానికి ఐఏఎస్ అధికారుల సర్వీసు పెంపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోని డీఓపీటీ చూసుకుంటుంది. కేంద్ర సర్వీసులకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే డీఓపీటీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. అదే విధంగా ఐఏఎస్ అధికారుల విషయంలోనూ జరగాల్సి ఉంటుంది. అయితే..’బుడితి’ వ్యవహారంలో అటువంటి నిబంధలను పాటించలేదన్నది ప్రధాన ఆరోపణ. అంతే కాదు రిటైర్ అయిన అధికారికి మళ్లీ అవే అధికారాలు కట్టబెట్టడం సరికాదనే వాదన మరోటి. ఇక రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు బద్దవ్యతిరేకి అని, ‘చంద్రబాబు’ను పలుసార్లు దూషించారనేది ఆయనపై ఉన్న ఆరోపణలు. టిడిపికి మద్దతు ఇచ్చే పత్రికలు, మీడియా దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ‘చంద్రబాబు’ను బహిరంగంగా దూషించిన వ్యక్తికి, పైగా ‘జగన్’ను నిత్యం మోసే వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నది వారి వాదన. ఆయనను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? ఆయనంత గొప్ప అధికారేమీ కాదని, అహంకారం, అహంభావం, మితిమీరిన కులతత్వంతో ఆయన వ్యవహరిస్తారని, ఇటువంటి వ్యక్తి కోసం ‘చంద్రబాబు’ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
కాగా..అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు, విమర్శలు, ఆరోపణలు వస్తున్న సమయంలో..బుడితిని సమర్థిస్తూ మాజీ ఐఏఎస్ ‘పివి రమేష్’ బహిరంగ ప్రకటన చేశారు. ‘రాజశేఖర్’ చిత్తశుద్ది కలిగిన అధికారని, ఆయన వృత్తిపరమైన సామర్ద్యాన్ని ప్రదర్శిస్తారని, ఆయన రాష్ట్రం కోసం చాలా చేశారని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని, ఆయన సర్వీసును ప్రభుత్వం పొడిగించలేదని, కేవలం ఆయన సర్వీసును ప్రభుత్వం వాడుకుంటోందని, ఆయన సేవలను ప్రభుత్వం వాడుకోవడం అభినందనీయమని ఆయన సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘రాజశేఖర్’ను కూడా ‘జగన్’ ప్రభుత్వం వేధించిందని, ఆయనకూ ఏడాది పాటు జగన్ పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని ‘పివి రమేష్’ తెలిపారు. కాగా ‘రమేష్’ సమర్థనలు ఎలా ఉన్నా..’రాజశేఖర్’పై ఆయన స్వంత సామాజికవర్గంలో కూడా అంత సదాభిప్రాయం లేదు. ఆయన వ్యవహారశైలిపై ఆయన సామాజికవర్గ నేతలే పార్టీలకు అతీతంగా విమర్శలు కురిపిస్తారు. పేరుకు దళితుడైనా ఆయన దళితులపట్ల కనీసం మానవత్వంతో వ్యవహరించరనేది వారి మాట. మొత్తం మీద..’బుడితి రాజశేఖర్’ సర్వీసు విషయంలో ‘చంద్రబాబు’ సరైన నిర్ణయం తీసుకున్నారా....? లేదా అనేది భవిష్యత్‌లో తేలుతుంది.