లేటెస్ట్

‘బీసీ మంత్రి’ కెరీర్‌ ఎండ్‌...!?

తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, వారికి ప్రత్యేకమైన స్థానం ఆ పార్టీలో ఉంటుంది. అసలు పార్టీనే వారిదీ..అనే భావన వారిలోనూ, టిడిపిలోనూ ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా దివంగత ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు కానీ, తరువాత ‘చంద్రబాబు’ హయంలో కానీ వారికే పెద్దపీట వేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే తెలుగురాష్ట్రాల్లో బీసీలు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. ఒకరూ ఇద్దరూ కాదు..వందల కొద్ది మంది బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లుగా ఇలా ఒకటేమిటి, అన్నింటిలో దాదాపు సగశాతం పదవులు వారిని వరించాయి. ఈ క్రమంలో బీసీల నుంచి ఎందరో నేతలు..ప్రముఖంగా ఎదిగారు. అలా ఎదిగిన బీసీ నేతలు వయస్సు రీత్యా రిటైర్‌ కావడం లేదా మరణించడంతో..కొత్త బీసీ నేతలకు టిడిపిలో మంచి గుర్తింపు లభిస్తోంది. అలా గుర్తింపు లభించిన ఆ నేతలు తమకు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటూ..తమ కెరీర్‌కు ఎండ్‌ కార్డు వేసుకుంటున్నారు. అలా ఎండ్‌ కార్డులో వచ్చిన నేత గురించి చెప్పుకుందాం.


ఆయన రాజకీయ చైతన్యం అధికంగా గల జిల్లా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అలా గెలుచుకుంటూ వచ్చిన ఆ నేతకు మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసివచ్చింది. ఎన్నికల ముందు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా..ఆయనకు వరుస కలిసి రాలేదు. ఎన్నికలకు ముందు ‘చినబాబు’ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన ఈ నేత విచ్చలవిడిగా సొమ్ములు ఖర్చు పెట్టారు. ఈయన తీరు ఎలా ఉంటుందంటే..ఆయనకు అవసరం అనుకుంటే..‘లక్ష’ ఇచ్చే దగ్గర ‘ఇరవైలక్షలు’ ఇస్తారట. అందరితో కలివిడిగా ఉండే ఈనేతకు టిడిపి కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రావడంతో..ఆయనకు వరమైంది. అంతే కాకుండా అప్పటి వరకూ బీసీల్లో పెద్ద నేతలుగా ఉన్న ‘కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు’ వంటి సీనియర్లు కాకుండా..భవిష్యత్‌ అవసరాలకు పనికివస్తారనే ఆలోచనతో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేకు కీలక మంత్రి పదవి ఇచ్చి ‘చంద్రబాబు’ ప్రోత్సహించారు. ఎమ్మెల్యేగానే విలాసపురుషుడైన ఈ నేత మంత్రి అయ్యాక మరింతగా విలాసాలు చేసుకుంటున్నారట. అంతేనా..కీలకమైనశాఖకు మంత్రి కావడంతో..పైరవీలు, హంగామా బాగానే చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పేషీలో ఓ అధికారి ప్రతిపనికీ రేటు పెట్టారని, ఆయనకు తెలియకుండా ఎటువంటి పనులు కావని ప్రచారాలు సాగుతున్నా, ఈ నేత దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అంతేనా..తెలంగాణకు చెందిన ఓ సీనియర్‌ మంత్రితో మనోడికి ఎప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి. ఆ మంత్రితో కలిసి ‘దుబాయ్‌’లో విహరించడం, విలాసాల్లో తేలియాడిపోవడం..ఆయనకు నిత్యకృత్యం.


కీలకమైనశాఖలో కీలకంగా పనిచేయాల్సిన సదరు మంత్రి వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. అయితే..తనకు పెద్దగా ఆశలు లేవని, మంత్రి పదవి నుంచి తొలగిస్తే ‘ఢల్లీి’ వెళతానని, తన సోదరుడు ఇక్కడ చూసుకుంటారని తన అంతరంగికులతో చెబుతున్నారట. అయితే..ఇక్కడే ఆయనకు చెక్‌ పడేటట్లు ఉంది. ఆయన నియోజకవర్గంలో వైకాపాకు చెందిన నాయకుడు టిడిపిలోకి రావడం, ఇప్పుడు ఈయనపై ఆరోపణలు రావడంతో..రాజకీయంగా ఆయనకు చెక్‌ పడినట్లేనని, ఆయన చేతుల్లారా చేసుకుంటున్నారని, వచ్చిన అవకాశాన్ని ఆయన ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారో..అర్థం కావడం లేదని ఆయన నియోజకవర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ నేతను అంత తేలిగ్గా అంచనా వేయవద్దని, ఆయన ఎవరి వద్ద ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటారని, అవసరం అనుకుంటే..ఎవరినైనా మేనేజ్‌ చేసే శక్తి ఆయనకు ఉందని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఆయన ఎవరి కడుపులోనైనా తలపెడతారని, ఆయన కడుపులో తలపెట్టిన తరువాత..ఇక ఆయనకు కాని పని ఉండదని కూడా వారు అంటున్నారు. రాష్ట్ర స్థాయినేతగా ఎదిగే అవకాశం వచ్చినా, స్నేహాల పేరిట, సొమ్ముల కోసం ఆయన తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఒక ‘యనమల’ ఒక ‘కెఇ’ ఒక ‘దేవేందర్‌గౌడ్‌’ ఒక ‘కళా వెంకటరావు’లా ఎదుగుతారని ఆశిస్తే..ఈయన ఒక్కసారి మంత్రిగా..కెరీర్‌కు ఎండ్‌ కార్డు వేసుకుంటున్నారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా..ఈ బీసీ మంత్రి వైఖరి మార్చుకుంటారా..? లేదో చూడాలి మరి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ