‘చంద్రబాబు’ వ్యూహం ఇదేనేమో...!?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశించిన రీతిలో పనిచేయలేదనే భావన వారిలో ఉంది. ముఖ్యంగా గతంలో తమను వేధించిన వైకాపా నాయకులు, కార్యకర్తల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరైన చర్యలు తీసుకోలేదనే బాధ వారిలో ఉంది. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు చేసిన వైకాపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను, ఆ పార్టీ నాయకులను జైలుకు పంపడం లేదని, వారితో మిలాఖత్ అవుతున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వస్తున్నాయి.ముఖ్యంగా గతంలో బరితెగించి అరాచకాలు చేసిన వారినెవరినీ జైలుకు పంపకపోవడం, అదీ వారు చేసిన అవినీతికి, అక్రమాలకు ఆధారాలు లభించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏదో జరుగుతోందన్న భావన పార్టీలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ‘అదానీ’ నుంచి రూ.1700కోట్లు లంచాలు తీసుకున్నారని, ఆధారాలతో దొరికినా..ఆయనపై కేసు నమోదు చేయకపోవడం, పైగా ముఖ్యమంత్రే ‘లడ్డూలాంటి’ అవకాశం అని పేర్కొనడం అనుమానాలకు, అపార్థాలకు కారణమవుతోంది.
సరే..‘జగన్’ విషయంలో ‘చంద్రబాబు’కు ఏదో వ్యూహం ఉందేమో..అందుకే చర్యలు తీసుకోలదనుకున్నా..మిగతా మాజీ మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై పార్టీలోనూ, పార్టీ సానుభూతిపరుల్లోనూ చర్చ సాగుతోంది.మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం అమ్ముకున్న వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. అయితే..ఈ కేసులోనూ..ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు. అదే విధంగా మాజీ మంత్రులు ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, రోజా, అమర్‌నాథ్, అంబటిరాంబాబు, కాకాని గోవర్థన్‌రెడ్డి, ధర్మాన ప్రసాద్ వంటి వారితో పాటు, పలువురు ఎమ్మెల్యేలు అడ్డంగా అవినీతిలో దొరికిపోయినా..వారిపై చర్యలు తీసుకోలేదు. వీరందరిపై ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోంది. దీంతో టిడిపి కార్యకర్తల్లో, నాయకుల్లో ,సానుభూతిపరుల్లో ‘చంద్రబాబు’ వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఎందుకు ఇంత మెతకగా వ్యవహరిస్తున్నారు..? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారందరిపై గట్టి చర్యలు తీసుకుంటానన్న ఆయన..ఇప్పుడు అత్యంత పేవలంగా వ్యవహరించడంపై పార్టీలో నిరాశాజనకమైన వాతావరణం కనిపిస్తోంది. ‘జగన్’ వంటి అరాచకశక్తిపై చర్యలు తీసుకోకపోతే..మళ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారనే భావన వారిలోఉంది. అయితే..దీని వెనుకో వ్యూహం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ముందు చూపుతోనే మెతకవైఖరి...!
పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆశించిన విధంగానే వైకాపా నాయకులపై గట్టి చర్యలు తీసుకుంటే..వారంతా ‘బిజెపి’లోకి క్యూ కడతారు. వైకాపా మాజీ మంత్రులపై చర్యలు తీసుకుంటే వారు ముందుగా వైకాపాకు రాజీనామా చేసి..వెంటనే ‘బిజెపి’ తీర్థం తీసుకుంటారు. వారు ‘బిజెపి’ తీర్థం తీసుకుంటే వైకాపాకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే..వైకాపా ఓటు బ్యాంక్ ఎప్పుడూ ‘బిజెపి’కి మళ్లదు. వైకాపా నాయకులు వెళ్లినా..వాళ్లు ఓట్లు చీల్చేది కూటమి పార్టీల నుంచే..! గ్రామస్థాయిలో పటిష్టమైన వ్యవస్థ లేని ‘బిజెపి’కి ఈ వలస నాయకుల ప్రభావంతో..గ్రామస్థాయిలో ఆ పార్టీ బలపడుతుంది. ‘బిజెపి’పై వారికి ప్రేమ లేకపోయినా..వారిపై ఉన్న కేసుల భయంతోనే...అరెస్టుల భయంతోనే..వారు తప్పనిసరిగా ‘బిజెపి’ జెండా పట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో..సహజంగానే గ్రామస్థాయిలో ‘బిజెపి’ బలం పెరుగుతుంది. దీని వల్ల ‘టిడిపి’కే నష్టం.
ఉదాహరణకు ‘చిత్తూరు’ జిల్లాలో అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు, అంతులేని విధ్యంసాలకు పాల్పడిన ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ ఆయన సోదరుడిని, ఆయన కుమారుడ్ని అరెస్టు చేస్తే..వాళ్లంతా ఇప్పటికే ‘బిజెపి’ తీర్థం పుచ్చుకునేవారే..! వారిపై గట్టిచర్యలకు పాల్పడి వారిని జైలుకు పంపిస్తే..బెయిల్‌పై వచ్చిన వారంతా..‘బిజెపి’ జెండాతో తిరిగేవారు. దాని వల్ల టిడిపికి రాజకీయంగా వచ్చే లాభం ఏమిటి..? ఇటీవల కాలంలో జరిగిన మరో ఉదాహరణ చెప్పుకుందాం. ‘విశాఖడైరీ’లో అవినీతి జరిగిందని శాసనసభా స్పీకర్ దానిపై సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభాసంఘం విచారణ జరపకముందే..విశాఖడైరీలో అవినీతికి కారకుడైన వైకాపా నాయకుడు ‘బిజెపి’లో చేరిపోయారు. దాంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చేయగలిగింది ఏముంది..? అలానే. ‘ప్రకాశం’ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ‘బాలినేని శ్రీనివాసరెడ్డి’ని ‘టిడిపి’లోకి తీసుకోలేదు. ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని భావించారు. దీంతో..ఆయన వెంటనే ‘జనసేన’లో చేరిపోయారు. ఇక ఇక్కడ ‘టిడిపి’ చేసేదేముంది. ‘ఉమ్మడి కృష్ణా’లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నాని’లను అరెస్టు చేస్తే వారంతా మూకుమ్మడిగా ‘బిజెపి’కి జైకొడతారు. దీంతో ఇక్కడ ఉనికే లేని..‘బిజెపి’ ఎంతో కొంత ఉనికిని సంపాదిస్తుంది. వైకాపా నేతలపై ఏ చర్యలు తీసుకున్నా, వారంతా..‘బిజెపి’ని ఆశ్రయిస్తారు. రాష్ట్రంలో బలపడాలనే ఆలోచనతో ఉన్న ‘బిజెపి’ ఈ వలస నాయకులను వెంటనే తన పార్టీలో చేర్చేసుకుంటోంది. వారు అవినీతిపరులా..? అరాచకశక్తులా..లేక ఇంకేదైనా కానీ..వారు వస్తే..బిజెపి చేర్చేసుకుంటుంది. దీంతో ఉనికి లేని ‘బిజెపి’ వచ్చే ఎన్నికల నాటికి బలంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైకాపా నాయకుల వలసల వల్ల వైకాపా ఏమీ బలహీనపడదు. గతంలో ఆ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినా..ఆ పార్టీకి ఇసుమంత కూడా నష్టం జరగలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ‘చంద్రబాబు’ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది విశ్లేషకులు భావన. అయితే..అవినీతి, అక్రమాలు చేసిన వారిని ఈ భయంతో వదిలేయాలా..? అంటే లేదనేది ‘చంద్రబాబు’ సమాధానం.
ఎవరైతే..అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారో..వారి జాతకాలన్నీ ప్రజల ముందుంచాలనేది ఆయన వ్యూహం. ఉదాహరణకు ‘పేర్నినాని’ విషయమే తీసుకుందాం. రేషన్ బియ్యాన్ని అమ్ముకున్న కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయంలో చట్టం చేయాల్సిన పనిచేసుకుంటూ పోతోంది. ఇక్కడ ఎటువంటి రాజీ లేదు. అయితే..ఆయనపై గట్టి చర్యలు తీసుకోరు. దీంతో..ఆయన కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆయన అవినీతిపరుడని, పేదల బియ్యం బొక్కిన పందికొక్కనే విషయం సామాన్యులకూ తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనను ‘బిజెపి’ కానీ, ‘జనసేన’ కానీ తీసుకుంటే..వారికే నష్టం..ఇలా మిగతా వారి వ్యవహారాలు బయటకు వస్తాయి. చట్టపరంగా చేసే చర్యలూ ఉంటాయి. వాళ్లను ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం అనే వ్యూహాన్ని ‘చంద్రబాబు’ అనుసరిస్తున్నారు. అయితే ఆయన వ్యూహాన్ని అర్థం చేసుకోలేని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు ఆయనపై దండెత్తుతున్నారు. అయితే..ఈ వ్యూహం విజయవంతం అవుతుందా..? లేదా..? అనేదానిపై సందేహాలు ఉన్నాయి. తప్పుచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే..అది తప్పుడు సంకేతాలను పంపిస్తుందనే భావన ఉంది. ఏది ఏమైనా..‘బిజెపి’ పెద్దలకు దొరకకుండా, వైకాపా నాయకులను కట్టడి చేసే వ్యూహాన్ని ‘చంద్రబాబు’ అనుసరిస్తున్నారని వారు అంటున్నారు.