లేటెస్ట్

‘బూచోడొస్తాడు’....జాగ్రత్త...!?

చిన్నతనంలో..పసిపిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటే..‘బూచోడోస్తాడు...పట్టుకుపోతాడు..’ అంటూ తల్లులు పిల్లలను బెదిరించి..అన్నం తినిపించేవారు. పిల్లల మంచి కోసం తల్లులు..ఆ విధంగా చేస్తారు..తమ పిల్లాడి ఆరోగ్యం కోసం..మంచికోసం..వారి శ్రేయస్సుకోసం. అయితే..ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వ పెద్దలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల మంచి కోసమో..లేక వారి రాజకీయ ప్రయోజనం కోసమో తెలియదు కానీ..ప్రతి విషయానికి ‘జగన్‌ మళ్లీ వస్తాడంటూ...’ బెదిరింపులకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాక ముందే..ఆ కూటమి పెద్దలంతా కూడబలుక్కునట్లు ఒకటే మాట..మాట్లాడుతున్నారు. ‘మళ్లీ జగన్‌ వస్తే...’ అంటూ..! వీళ్ల మాటలు చూసిన సామాన్యులకు చిరాకెత్తుతోంది. ఏమిటి వీళ్లు...? ప్రజలంతా ఏకమై..బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చి పాలన చేయమని ప్రోత్సహిస్తుంటే..చేతకాని వాళ్లా..మళ్లీ ‘జగన్‌ వస్తే..అంటూ..’ చిరాకు మాటలు మాట్లాడుతున్నారనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏదో కింది స్థాయి నాయకులు మాట్లాడారంటే..ఏమో అనుకోవచ్చు. కానీ..అధికారమంతా కేంద్రీకృతం చేసుకుని, అధికారాన్ని అనుభవిస్తూ..తాము చేయాల్సింది చేయకుండా..‘జగన్‌’ అనే బూతాన్ని చూపుతూ కాలం వెళ్లదీయాలని వీళ్లు చూస్తున్నారా..? అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ‘జగన్‌’ అండ్‌ కో చేసిన పాపాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి తదితరాలను చూసే కదా..ప్రజలంతా..కూటమికి ఓటేసి గెలిపించింది. మరి గెలిచిన వాళ్లు చేయాల్సిందేమిటి..? అన్యాయాలు, అక్రమాలు, అవినీతి చేసిన బూతాలను మళ్లీ ప్రజలపైకి వదలకుండా బంధించాలి కదా..? అలా చేయకుండా..వారిని గాలికి వదిలేసి...చేతకాని మాటలు మాట్లాడుతూ..మళ్లీ ‘జగనొస్తాడనే పల్లవి’ని అందుకున్న వీరిపై ప్రజల్లో చులకనభావం వ్యక్తం అవుతోంది.


సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ..‘మళ్లీ జగన్‌ రాడంటూ..బాండ్‌ రాసిమ్మని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని’చెబుతున్నారు. దీని అర్థం ఏమిటి..? ఏమని దీన్ని అర్థం చేసుకోవాలి...? ఆయన మాటలు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు...? మళ్లీ ‘జగన్‌’ రాకుండా చేసుకునే పని ఎవరిది..? ఆ పని ‘లోకేష్‌’ చేతుల్లో ఉందా..? లేక ప్రజల చేతుల్లో ఉందా..?  ప్రజారంజకంగా పరిపాలిస్తే, ప్రజల అవసరాలు తీరిస్తే..మళ్లీ ప్రజలకు త్రీడి సినామాలు చూయించకుండా వాస్తవాల్లో ఉంటే.. మళ్లీ ప్రజలే..‘జగన్‌’ సంగతి చూసుకుంటారు..? ప్రజాశ్రేయస్సే పరమావధిగా భావించి పాలిస్తే..ప్రజలు మళ్లీ ఆ పాత బూతం వైపు చూడాల్సి అవసరం ఏముంది..? అలా కాకుండా బూతం పేరు చెప్పి...ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేద్దామని అతితెలివి తేటలు చూయిస్తే..పాత బూతమే మంచిదని, అది ఎంత తిన్నా...తమకు ఎంతో కొంత వేసిందని, అది బూతమైనా, రాకాసాయినా..వీళ్ల కంటే పాతబూతమే మేలని మళ్లీ నెత్తిన పెట్టుకుంటారు. మాటి మాటికి..జనాలను ‘జగన్‌’ పేరుతో బెదిరిస్తే..ఏదో రోజు అది తిప్పుకొడుతుందనే సంగతిని పాలకులు మరిచిపోకూడదు. బ్రహ్మాండమైన అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని, బూతాన్ని తరిమేసే పని పాలకులదే..కానీ..ప్రజలది కాదు. ఈ విషయాన్ని పాలకులు సదా గుర్తుంచుకోవాలి.   

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ