వాళ్ల నిర్లక్ష్యమే కారణమా...!?
వాళ్ల నిర్లక్ష్యమే కారణమా...!?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్వమంగళ రూపాన్ని కనులారా చూసుకుని తరించాలని, ముక్తిపొందాలని,వైకుంఠానికి చేరాలనుకుని వచ్చిన అమాయక భక్తులు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వెకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం ‘తిరుపతి’లో ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి ఇంత మంది చనిపోవడం భక్తులను కలిచివేస్తోంది.‘తిరుమల’లో గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు. అయితే..అనూహ్యంగా జరిగిన ఈ ఘోరంతో టీటీడీ పాలకమండలిపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే..ఇలా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వ చాతకానితనంతోనే అమాయకులు మృతి చెందారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు హిందూసంఘాలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి. లక్షలాది మంది వచ్చే చోట ఏర్పాట్లను సరిగా చేయాలని, ప్రభుత్వానికి, టీటీడీ పాలకమండలి బాధ్యత లేకుండా వ్యవహరించాయని విమర్శిస్తోంది. ఇది అధికార కూటమికి తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నమాట అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఈ సంఘటనకు మొత్తం ముగ్గురే కారకులని, వారు సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా టీటీడీ ఈఇ ‘శ్యామలరావు’ జెఇఓ ‘చౌదరి’, టీటీడీ ఛైర్మన్ ‘నాయుడు’లే దీనికి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఈఓ ‘శ్యామలరావు’ ‘జెఇఓ’ ‘చౌదరి’లు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, అంతా తమకే తెలుసన్నట్లు వారి ప్రవర్తన ఉంటోందన్న వార్తలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. ‘శ్యామలరావు’ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని, ఆయన తన ఇష్టారీతిలో ‘టీటీడీ’ని నడిపిస్తున్నారని, ఇక జెఇఓ ‘చౌదరి’ అయితే అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారని, టీటీడీలో మిగతా అధికారుల సూచనలను పట్టించుకోవడం లేదని, తాము చెప్పిందే వేదమన్నట్లు వ్యవహరిస్తున్నారని, వారి వల్లే ఇలా జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఇటీవలే టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన ‘టివి5 నాయుడు’కు అనుభవం లేదని, అనుభవజ్ఞల సలహాలను ఆయన తీసుకోలేదని, క్యూలైన్ల వ్యవహారంలో ఆయన ఇతర అధికారులను సంప్రదించారా...? లేక ఆయన స్వంతంగానే నిర్ణయం తీసుకున్నారా..? అనేదానిపై చర్చసాగుతోంది. కాగా..గతంలో ‘వైకుంఠ ఏకాదశి’ టిక్కెట్ల కోసం ‘తిరుమల’లోనే టిక్కెట్లు ఇచ్చేవారని, వైకాపా హయాంలో ‘తిరుపతి’లో ఇస్తున్నారని, వారు టిక్కెట్లను అమ్ముకోవడం కోసం ఇలా చేశారనే మాట ‘టిడిపి’ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే..ఎవరు ఏమి చేసినా..జరిగిన ఘోరమైన సంఘటనకు టీటీడీ పాలకమండలి, ప్రభుత్వం బాధ్యత వహించక తప్పదు. అమాయక భక్తుల ఉసురుతీసిన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.