‘బాబు’ వేటు వారిపై...‘పవన్’ ఆరోపణలు వీరిపై...!
‘తిరుపతి’లో జరిగిన తొక్కిసలాటపై కూటమి ప్రభుత్వంలో విబేధాలు పొడచూపాయా..? జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఒకరకంగా..ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్’ మరోరకంగా స్పందిస్తున్నారు. ‘తిరుపతి’లో జరిగిన విషాదకర సంఘటనపై ముఖ్యమంత్రి ఆగమేఘాలపై స్పందించారు. నిన్న సాయంత్రం సంఘటన జరిగినప్పుడు ఆయన ‘విశాఖపట్నం’లో ప్రధాని ‘మోడీ’ కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత..ఈ సంఘటనపై ముఖ్యమంత్రి పూర్తి దృష్టిసారించారు. అక్కడి నుంచే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి బాధితులకు అందాల్సిన సహాయంపై తక్షణం దృష్టిసారించి, వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. ఆ తరువాత వెంటనే ‘తిరుపతి’కి చేరుకుని బాధితులను పరామర్శించారు.సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ ఈఓ ‘శ్యామలరావు’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత జరిగిన సంఘటనకు బాధ్యులంటూ డీఎస్పీ ‘రమణకుమార్’ గోశాల డైరెక్టర్ ‘హరనాథ్‌రెడ్డి’ని సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ ‘సుబ్బారాయుడు’, జేఈఓ గౌతమి, సీఎస్‌ఓ శ్రీధర్‌ను వెంటనే బదిలీ చేశారు. మరోవైపు తొక్కిసలాటపై విచారణ చేయిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్’ దీనిపై ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ నిర్ణయాలకు విరుద్ధంగా స్పందించారు. జరిగిన విషాదకర సంఘటనకు ప్రధాన కారకులు జెఇఓ ‘వెంకయ్యచౌదరి, ఈఓ ‘శ్యామలరావు’ ‘టిటిడి పాలకమండలి, పోలీసులే కారణం అంటూ మండిపడ్డారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని, వారి వల్ల ప్రభుత్వ విమర్శలు ఎదుర్కొంటుందని మండిపడ్డారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తింటున్నామని, ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, దీనికి వారే బాధ్యులని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనకు కారకులుగా డీఎస్సీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేస్తే..దానికి విరుద్ధంగా ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ‘జెఈఓ, ఈఓ, పాలకమండలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మొత్తం మీద జరిగిన దురదృష్టకరమైన సంఘటతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిరది. పాలక కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అతి పెద్ద ఎదురుదెబ్బను తిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష వైకాపా రాద్ధాంతం చేస్తోంది. ఆ పార్టీ నాయకులంతా క్యూలో వచ్చి విమర్శలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వెంటనే తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. దీనిపై ఆయన రాజకీయం చేయబోతున్నారు. తన హయంలో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగినా..తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని ‘జగన్’ కూటమి ప్రభుత్వంలో జరిగిన సంఘటనను రాజకీయంగా అందిపుచ్చుకునేందుకు హడావుడిగా తిరుపతి వచ్చారని ‘టిడిపి’ నేతలు విమర్శిస్తున్నారు.