వాళ్లిద్దరినీ తప్పించాల్సిందే...!?
‘తిరుపతి’లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటకు కొందరిని ముఖ్యమంత్రి తక్షణ బాధ్యులుగా చేసి సస్పెండ్ చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఈ సంఘటనలో టీటీడీ ఈఓ, టీటీడీ జెఇఓల నిర్లక్ష్యం, నిరాసక్తత, ప్లానింగ్ లేకపోవడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ టివి5 నాయుడు అనుభవలేమి కూడామరో కారణం. దీంతో..ఇప్పుడు సస్పెండ్ చేసిన వారితో పాటు, ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఇఓ ‘వెంకయ్య చౌదరి’ని వెంటనే బదిలీ చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్’ పరోక్షంగా ఇదే డిమాండ్‌ను చేస్తున్నారు. వీరిద్దరినీ వెంటనే బదిలీ చేసి, ఇతర పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పరువు కొంత వరకైనా నిలుస్తుంది. అసలు టీటీడీ ఈఓగా ‘శ్యామలరావు’ను నియమించినప్పుడే కొందరు పెదవి విరిచారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడని, అటువంటి వ్యక్తిని ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈఓగా నియమించి ‘చంద్రబాబు’ తప్పు చేశారని అప్పట్లోనే వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే..ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ మాత్రం తాను అనుకున్న విధంగానే ఆయననే కొనసాగించారు. ‘తిరుమల’ లడ్డూ వివాదంలో కూడా ‘శ్యామలరావు’ ‘చంద్రబాబు’కు ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. అయితే..దాన్ని ‘చంద్రబాబు’ పెద్దగా పట్టించుకోలేదు. అయితే..ఇప్పుడు ‘తిరుపతి’ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. టీటీడీ ఈఓ, అదనపు ఈఓలు సరిగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. కానీ..వారిద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఘోరమైన ఘటన జరిగింది. ‘అదనపు ఈఓ’గా ఉన్న ‘వెంకయ్య చౌదరి’ పనితీరు కూడా అంత్య దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఆయన అహంకారపూరితంగా వ్యవహరిస్తారని, కింది స్థాయి అధికారులతో సరిగా వ్యవహరించలేదని, అదే విధంగా గతంలో ‘జగన్’కు మద్దతు ఇచ్చేవారినే ఇంకా కీలకమైన పదవుల్లో కొనసాగిస్తున్నారని, ఆయన జెఈఓగా వచ్చి ఐదారు నెలలు అవుతున్నా కొండపై ఆయనకు ఇంకా పట్టురాలేదనే వాదనలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్న ఆయన ప్రభుత్వ పరువు పోయే విధంగా,ముఖ్యంగా అమాయక భక్తుల ప్రాణాలు పోయే విధంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్లానింగ్ ఏది...?
వైకుంఠ ఏకాదశి కోసం లక్షల మందిని ‘తిరుపతి’లో పోగేయాల్సిన అవసరం ఏమిటి..? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల నుంచి అంత మంది భక్తులను ‘తిరుపతి’కి రప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. గతంలో వైకాపా అవలంభించిన విధానాన్ని మార్చాలని వీరికి అనిపించలేదా..? లక్షల మంది ఒక చోట పోగైతే వచ్చే ఇబ్బందుల గురించి వీరికి తెలియదా..? లేక తెలిసినా..నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? ‘వైకుంఠ ఏకాదశి’ టిక్కెట్లు..ఒక రోజు ముందు ఇవ్వడం ఏమిటి..? వారం రోజుల ముందు నుంచి ఇవ్వవచ్చుకదా..? దాని సంగతి అలా ఉంచితే..టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు కదా..? దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌లో ఇస్తే..తిరుపతికి అంత మంది వచ్చి ఉండేవారు కాదు కదా..? ఒక వేళ ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణమండపాల్లోనో..టీటీడీ దేవస్థానాల్లోనే భక్తులకు ఇవ్వాల్సింది. ఇదేమీ చేయకుండా గతంలో వైకాపా వాళ్లు అనుసరించిన విధానాన్నే గుడ్డిగా అనుసరించి, అమాయక భక్తుల ప్రాణాలను తీసేశారు. సరైన ప్లానింగ్ లేకపోవడం, నిర్లక్ష్యం, నిరాసక్తత, అహంకారపూరిత చర్యలవల్లే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి బాధ్యులైన ఈ ఇద్దరు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. కాగా..టీటీడీ జెఈఓ బాధ్యతలు ఏమిటో..ఆయన అక్కడ చేయాల్సిన పనులు ఏమిటో..ప్రభుత్వం ఒకసారి సమీక్షించాలి. తిరుపతిలో కానీ, తిరుమలలో కానీ..జేఈఓదే సర్వాధికారం. ఈ అధికారాలను చేతుల్లో పెట్టుకుని ఈఓను ఆడిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద..జరిగిన దురదృష్టకరమైన సంఘటన నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవాలి.