లేటెస్ట్

‘డిప్యూటీ స్పీకర్ల’తో ‘చంద్రబాబు’కు తలపోటు...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ‘డిప్యూటీ స్పీకర్ల’ గండం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ‘చంద్రబాబు’ పనిచేసిన ప్రతిసారీ..డిప్యూటీ స్పీకర్లతో ఆయనకు తలనొప్పులు తప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఈ తలపోటు..మళ్లీ ఇప్పుడు ‘రఘురామకృష్ణంరాజు’ రూపంలో మరోసారి మొదలైంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ‘చంద్రబాబు’ ఉన్నప్పుడు ‘కె.చంద్రశేఖర్‌రావు’కు మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో..ఆయనను ‘చంద్రబాబు’ డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ‘కెసిఆర్‌’ తరువాత ‘చంద్రబాబు’ను ముప్పుతిప్పలు పెట్టారు. తనకు మంత్రి పదవిని ఇవ్వని ‘చంద్రబాబు’ను గద్దె దింపేవరకూ ఆయన ఊరుకోలేదు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ‘చంద్రబాబు’ తన మంత్రివర్గంలో ‘కెసిఆర్‌’కు స్థానం కల్పించలేదు. కులాల లెక్కలు వేసుకునే ‘చంద్రబాబు’ ‘కెసిఆర్‌’కు మంత్రి పదవి ఇవ్వకుండా, అప్పట్లో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ‘విజయరామారావు’కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో..‘కెసిఆర్‌’ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే..ఆయన అసంతృప్తిని గమనించిన ‘చంద్రబాబు’ ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అయితే..ఈ పదవితో ‘కెసిఆర్‌’ సంతృప్తి పడలేదు. ‘చంద్రబాబు’ ఇచ్చిన ‘డిప్యూటీ స్పీకర్‌’ పదవికి రాజీనామా చేసేసి, ‘తెలంగాణ’ జెండా ఎత్తుకున్నారు. ఆయన ఒకసారి ‘తెలంగాణ’ ఉద్యమాన్ని ఎత్తుకున్న తరువాత ఆయనను ఎవరూ ఆపలేకపోయారు. అప్పట్లో ‘ఎమ్మెల్యే’ పదవితో పాటు, డిప్యూటీ స్పీకర్‌ పదవి కూడా రాజీనామా చేసిన ‘కెసిఆర్‌’ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అదే సమయంలో ‘చంద్రబాబు’ పతనానికి కారణమయ్యారు. అప్పట్లో ‘చంద్రబాబు’ చేసిన తప్పు ఇప్పటికీ ఆయనను వేటాడుతూనే ఉంది. రాష్ట్ర విభజనకు కూడా ఇదే తప్పే కారణమనేవారూ ఉన్నారు. అయితే..అప్పట్లో ‘డిప్యూటీ స్పీకర్‌’గా ‘కెసిఆర్‌’ వేధిస్తే..ఇప్పుడు ‘రఘురామకృష్ణంరాజు’ కూడా అదే దారిలో నడుస్తున్నారు.


‘రఘురామ’ మరో ‘కెసిఆర్‌’ అవుతారా..?

వాస్తవానికి టిడిపి కూటమి గెలిచిన వెంటనే ‘రఘురామకృష్ణంరాజు’కు మంత్రి పదవి వస్తుందని చాలా మంది భావించారు. అయితే విచిత్రంగా ‘చంద్రబాబు’ ఆయనను పక్కనపెట్టారు. దీంతో..‘రఘురామ’తో పాటు ఆయన మద్దతుదారులు చిన్నబుచ్చుకున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన నర్మగర్భవ్యాఖ్యలుచేశారు. తన కులంలో అంత సమర్థులు లేరని ‘చంద్రబాబు’ భావించారేమో...? తన కంటే..బాగా పనిచేసిన వారు ఉన్నారనే భావనతో ఉన్నారో..తనకు తెలియదని..ఆయన నిగూఢమైన వ్యాఖ్యలు చేశారు. తరువాత కూడా ఆయన అడపా..దడపా..నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ‘చంద్రబాబు’ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇచ్చారు. దీంతో..ఆయన సంతృప్తి పడతారనే భావన ‘చంద్రబాబు’ది. అయితే..‘రఘురామకృష్ణంరాజు’ దానితో సంతృప్తి పడడం లేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నా..తనపై జరిగిన హత్యాయత్నం కేసులో ‘చంద్రబాబు’కు చుక్కలు చూపిస్తున్నారు. తనను కస్టడీలో హింసించిన ‘పివి సునీల్‌కుమార్‌’ను అరెస్టు చేయాలని, ఆయనతో పాటు..తన గుండెలపై కూర్చున్న ‘తులసిబాబు’ అనే వ్యక్తికి ‘గుడివాడ’ ఎమ్మెల్యే ‘వెనిగండ్ల రాము’ మద్దతు ఇస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ‘రఘురామ’ డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన డిమాండ్‌కు పార్టీలో మద్దతు లభిస్తోంది. ‘రఘురామ’ను హింసించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు. ‘రఘురామకృష్ణంరాజు’కే న్యాయం జరగకపోతే..తమలాంటి వారికి ఏమి న్యాయం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లోనూ అదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే...ఇక్కడ ప్రభుత్వాధినేత అభిప్రాయం ఎలా ఉందో తెలియదు...? ఆయన కానీ..పార్టీ కానీ..ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తోంది. కనీసం పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు కూడా స్పందించడం లేదు. ఎందుకో తెలియదు కానీ..ఈ విషయంలో పార్టీ అధినేతకు వేరే రకమైన అభిప్రాయం ఉందేమోనన్న అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే..తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోకపోతే..ఎంత దూరమైనా వెళతానని ‘రఘురామకృష్ణంరాజు’ పరోక్షంగా బెదిరిస్తున్నారు. నిన్న ఆయన బహిరంగంగానే..తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో తనకు తెలియదని, అయినా..ఈ విషయంలో తాను రాజీ పడనని, ఎంత దూరమైన వెళతానని చెబుతున్నారు. అయితే..‘రఘురామ’ వ్యవహారాలపై అధినేతకు నచ్చడం లేదని, ఆయన తీరు పార్టీకి ఇబ్బంది తెస్తుందని, ఆయన పార్టీలో ఓ శక్తిగా ఎదుగుతున్నారని, ఆయన వల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందనే భావన ఉందంటున్నారు. మరోవైపు..‘రఘురామ’కు 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, వారంతా ‘జనసేన’లోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. అయితే..ఈ 12మంది ఎమ్మెల్యేలు ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ‘రఘురామకృష్ణంరాజు’తో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. వీరిలో ఒకరు ఆయనకు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారంటున్నారు. మొత్తం మీద..‘రఘురామకృష్ణంరాజు’ వ్యవహారం మరో ‘కెసిఆర్‌’లా తెలుగుదేశం పార్టీకి చుట్టుకుంటుందా..? అనే బెంగ, ఆందోళన నిజమైన పార్టీ కార్యకర్తల్లో ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ