లేటెస్ట్

‘జర్నలిస్టు’ల ముసుగులో కేసులు...కోర్టులతో చివాట్లు...!

‘జర్నలిస్టు’లు ఏమైనా చేయవచ్చా...? రాజ్యాంగానికి, కోర్టులకు, న్యాయవ్యవస్థకు అతీతులా..? వీరికేమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా..? ఏమీ లేదు. వీరంతా సమాజంలోని పౌరులతో సమానమే...! అందరూ చట్టానికి,న్యాయానికి లోబడాల్సిందే..అయితే..ప్రజల శ్రేయస్సు కోసం, వారి హక్కుల కోసం, బడుగు,బలహీనవర్గాల గొంతులు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారనే కోణంలో కాస్తాకూస్తో..సమాజంలో విలువ ఇస్తారు. అంతకంటే...వీళ్లకేమీ ప్రత్యేక హక్కులు లేవు..లేదా ప్రత్యేకమైన రిజర్వేషన్లు లేవు. అయితే..జర్నలిస్టులనే ముసుగు తగిలించుకుని..మేము ఏమైనా చేస్తాం..ఏదైనా చేస్తాం..కొందరి కోసం ఎటువంటి తప్పుడు కేసులనైనా వేస్తాం..పార్టీల కోసం..విలువలు వదలుకుని, వలవలు దిగజార్చుకుంటాం..అంటూ కొందరు చేస్తోన్న హీనమైన పనులవల్ల జర్నలిస్టు సమాజానికి చెడ్డపేరు వస్తోంది. ఇటీవల కాలంలో ఇద్దరు జర్నలిస్టులు కోర్టులతో చివాట్లు తిన్నారు. వీరిద్దరూ..ఏమైనా ప్రజాసమస్యల కోసం లేక బడుగు,బలహీన,అణగారిన వర్గాల కోసం కోర్టుల్లో కేసులు వేశారంటే..కానే కాదు. వీరు తాము మెచ్చిన, నచ్చిన పార్టీ అధినేత మెప్పు పొందేందుకు..కోర్టులో పిటీషన్లు దాఖలు చేసి కోర్టులతో చివాట్లు తిన్నారు. మొదటి నుంచీ ఈ ఇద్దరితోపాటు మరికొందరు జర్నలిస్టులు పార్టీల వంతపాడే పాటలో ముందంజలోనే ఉన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు..అన్ని పార్టీలకు ఇలా కొమ్ముకాసే వారెందరో..? అయితే..కొందరు కొన్ని పార్టీలను భుజానవేసుకున్నా..వారి లిమిట్‌లో వారు..ఉంటారు. కానీ కొందరు బరితెగించి..ఆ పార్టీ సేవ కోసం, పార్టీ అధినేత కనుసన్నల్లో పడడానికి పడరాని పాట్లు పడుతున్నారు. 


ఇటీవల జరిగిన ఉదంతాల్లో కోర్టులో చివాట్లు తిన్న ఇద్దరిలో ఒకరు స్వర్గీయ ముఖ్యమంత్రి ‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి’కి భక్తుడు. ఒకప్పుడు ఒక ప్రధాన పత్రికలో పనిచేసిన ఆయన తరువాత ఆ పత్రిక నుంచి బయటకు వచ్చి స్వంతంగా పత్రిక పెట్టుకున్నారు. అలా పత్రిక పెట్టుకున్న ఆయనకు ‘వై.ఎస్‌’ ఇతోధికంగా సహాయం చేశారంటారు. సహాయం అంటే..‘వై.ఎస్‌’ ఏమీ తన జేబు నుంచి సొమ్ములేమీ ఇవ్వలేదు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పలు ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా ప్రకటనలు ఇప్పించారు. అంతేనా..ఆ జర్నలిస్టు అడిగిన ఇతర పైరవీలను కూడా చేసిపెట్టి అతని దృష్టిలో దేవుడయ్యాడు. ప్రజాసొమ్మును ఒకే ఒక్కరికి కట్టబెట్టి చేతికి ఎముకలేదనే ప్రశంసలు ఆ జర్నలిస్టు నుంచి పొందారు. ఇలా ప్రభుత్వ సొమ్మును తనకు భుజకీర్తులు తొడిగేవారికి పంచిపెట్టడం ‘వై.ఎస్‌’కు ఆయన కుమారుడికి వెన్నతోపెట్టిన విద్యనుకోండి. ‘వై.ఎస్‌’ మరణం తరువాత..సదరు జర్నలిస్టు నిత్యం ఆయన కుమారుడు మంది సొమ్ముతో పెట్టిన ఛానెల్‌ కూర్చుకుని ‘చంద్రబాబు’ను తిట్టడం, పరుషంగా విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. దీని కూడా ఆయనకు కూలీ గిట్టిందంటారు. అదే సమయంలో..‘జగన్‌’ ఎవరిపై కేసులు వేయమంటే..వారిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు ఎడాపెడా ఏసేస్తున్నారు. దీనికో రేటు ఉందని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ఇలా..ఈయనొక్కరే కాదు. ఇంకొకాయన కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈయన గారు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నిటి చుట్టూ తిరిగారు. చివరకు వైకాపాకు అనుబంధంగా తయారయ్యారు. ఇటీవల ఆయనకు కూడా కోర్టు నుంచి అక్షింతలు పడ్డాయి. అయినా ఆయనలో మార్పేమీ రాలేదు. ఒక ప్రముఖ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన ఈయన అధికారంలో ఎవరు ఉంటే వారిపక్కన ఉంటారు. కాస్తాకూస్తో గిట్టుబాటు చేసుకుంటారనే ప్రచారం ఉంది.


ఈయన కాకుండా మరి కొందరు ఉన్నారు. వీరంతా వై.ఎస్‌. ఆయన కుమారుడి సేవలో తరిస్తారు. జర్నలిస్టు ఉద్యమ నేతల్లా ఉండే వీరికి వై.ఎస్‌ ఆయన కుమారుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జర్నలిస్టుల హక్కులు గుర్తుకు రావు. ఎప్పుడైతే ‘చంద్రబాబు’ అధికారంలోకి వస్తారో..అప్పుడే జర్నలిస్టుల బాధలు గుర్తుకు వస్తాయి. ప్రపంచాన్ని అల్లాడిరచిన ‘కరోనా’ సమయంలో జర్నలిస్టులు మరణిస్తే..అప్పుడు అధికారంలో ఉన్న ‘జగన్‌’ మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.5లక్షల సహాయం చేస్తామని జీవో ఇచ్చారు. అయితే..ఈ జీవోను అమలు చేయకపోయినా..ఈ ప్రసిద్ధి చెందిన జర్నలిస్టు సంఘనేత కనీసం నోరు కూడా మెదపలేదు. జీవో ఇచ్చి..ఎందుకు సహాయం చేయలేదని అడిగిన పాపాన పోలేదు. ఒకవేళ అడిగితే..ఏమవుతుందో తనకు తెలుసు కనుక..తనకు ఇచ్చిన రెండు పదవులను అనుభవిస్తూ..హైదరాబాద్‌ గెస్ట్‌ హౌస్‌ల్లో, ఢిల్లీ గెస్ట్‌హౌస్‌ల్లో సేదతీరిన ఈ ఉద్యమకారుడు ఇప్పుడు జర్నలిస్టుల హక్కులంటూ పాతపాటందుకున్నారు. మరొకాయన ఆయన తొలిరోజుల్లో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికలో పనిచేసి తరువాత వారిచ్చే జీతం వద్ద తేడా వచ్చి..ఎలక్ట్రానిక్‌ మీడియాలోకి ప్రవేశించాడు. ఉదయాన్నే దట్టంగా ముఖానికి మేక్‌ప్‌ వేసుకుని, ఎదుటివారిపై తుప్పర చిమ్మేస్తూ విశ్లేషణ పేరిట ‘జగన్‌’ జపం..వై.ఎస్‌ కుటుంబ జపం చేస్తూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే..చాలా మందే ఉన్నారు. ఎవడి బతుకు వాడిదని కొట్టేసే పరిస్థితులు ఇప్పుడు జర్నలిస్టుల్లో ఉంది. అయితే..తమకు సంబంధం లేని వాటిల్లో వేలు పెడుతూ..సొమ్ముల కోసం కక్కుర్తిపడితే..ఇప్పటికే సమాజంలో పాతాళానికి పడిపోయిన జర్నలిస్టుల విలువ..ఇక దిగజారడానికి కూడా అవకాశం లేని స్థితిలోకి వెళ్లిపోతుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ