‘కోటి’ మందిపై ‘కోటి’ సందేహాలు...!?
తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో కోటిమంది సభ్యులయ్యారని ఘనంగా ప్రకటించుకుంది. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత మంది సభ్యులు ఉండడం అరుదైన విషయమే. ‘ఆంధ్రప్రదేశ్’ ‘తెలంగాణ’ ‘అండమాన్’, ‘యానాం’ ‘ఢల్లీి’ ‘ముంబాయి’ ‘తమిళనాడు, ‘కర్ణాటక’ తదితర రాష్ట్రాల నుంచి తమకు సభ్యత్వం వచ్చిందని ఆ పార్టీ చెబుతోంది. దీనిలో చాలా వరకూ నిజమే. ఆ పార్టీ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. తెలుగువారు ఎక్కడ ఉంటే..అక్కడ ఈ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అసలు ఏమీ లేదన్న చోట కూడా..ఆ పార్టీ ఎక్కడోచోట తన ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం ‘కోటి’ సభ్యత్వం రావడం..ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘అన్న ఎన్టీఆర్’ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇంత సభ్యత్వ నమోదు ఎప్పుడూ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ..రాష్ట్ర విభజన తరువాత కానీ..ఇదే రకమైన సభ్యత్వాలు లేవు. అయితే..పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్’ చొరవ, ‘చంద్రబాబు’ ముందు చూపుతో..ఇప్పుడు సభ్యత్వం ‘కోటి’ దాటేసింది. ఒకరకంగా ఇది రికార్డే. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన కొన్ని పార్టీలకు ఈ రకమైన సభ్యత్వాలు లేవు.
‘టిడిపి’ రికార్డును చూసి ‘టిడిపి’ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఇప్పుడు వచ్చిన ఈ సభ్యత్వాలన్నీ నిజమైనవేనా...? పార్టీ సభ్యత్వం తీసుకున్న పార్టీ విధానాలు, ప్రభుత్వ పాలనను చూసే సభ్యత్వాలను తీసుకున్నారా..? అంటే సమాధానం సంతృప్తికరంగా ఉండదు. వాస్తవానికి ‘ఆంధ్రప్రదేశ్’ విషయమే తీసుకుంటే..ఇక్కడ దాదాపు 80లక్షల సభ్యత్వం వచ్చింది. అయితే..దీనిలో మొదటి నుంచి పార్టీని అభిమానించేవారు..పార్టీకి నిజమైన సేవ చేసిన వారు, నిజమైన అభిమానులు, తరతరాలుగా పార్టీ కాడిమోస్తున్నవారే అధికంగా ఉంటారు. అయితే..ఇప్పుడు కొత్తగా చేరిన వారి విషయంలోనే కొన్ని సందేహాలు ఉన్నాయి. వీరంతా ‘చంద్రబాబు’ను ‘లోకేష్’ను అభిమానించి పార్టీ సభ్యత్వం తీసుకున్నారా..? లేక ఇతర ప్రయోజనాలు ఆశించి సభ్యత్వం తీసుకున్నారా..? అనే దానిపై పార్టీలోనూ, పార్టీని అభిమానించేవారిలోనూ చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈసారి పార్టీ సభ్యత్వాన్ని పకడ్బందిగానే చేశారు. ప్రతివారు విడివిడిగానే..సభ్యత్వ రుసుములు చెల్లించారు. గతంలో..పార్టీ సభ్యత్వమంతా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఎక్కువగా చేయించేవారు. ఆయా నియోజకవర్గాలోని టిడిపి అభిమానుల పేరుతో సభ్యత్వ రుసుము వారే చెల్లించి రశీదులు పార్టీ కేంద్ర కార్యాలయాలకు పంపేవారు. అయితే..ఈసారి అంతా ఆన్‌లైన్‌లోనే సభ్యత్వ నమోదు జరిగింది. దీంతో ఒకేసారి వేలల్లో సభ్యత్వాలు నమోదు కాలేదు. అయితే...పూర్తిగా ఎమ్మెల్యేలు దీనికి దూరంగా ఉన్నారని చెప్పలేము కానీ..కొంత పారదర్శకంగానే జరిగిందని చెప్పవచ్చు.
రెండు,మూడు పార్టీల్లోనూ సభ్యత్వం
సభ్యత్వం భారీగా పెరగడానికి మరో కారణం కూడా ఉంది. పార్టీ సభ్యులైన వారికి జీవితభీమా వర్తింప చేస్తామని చెప్పడం, వాస్తవంగా అమలు చేస్తుండడంతో..చాలా మంది దానికి ఆకర్షితులయ్యారు. చనిపోతే..పార్టీ సహాయం చేస్తుందనే భరోసా ఉండడంతో..పార్టీపై అభిమానం లేని వారూ..ఇతర పార్టీలకు చెందిన వారు కూడా టిడిపి సభ్యత్వాలను తీసుకున్నారు. కాగా..మరి కొందరు ఇతర పార్టీల్లోనూ సభ్యత్వం పొందారు. ‘జనసేన’ ‘వైకాపా’ల్లో సభ్యత్వం ఉన్నవారూ..టిడిపిలోనూ సభ్యత్వం పొందారు. ఇటువంటి వారు..పార్టీపై అభిమానం కన్నా..పార్టీ నుంచి వచ్చే మేళ్ల కోసమే చేరారనే అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు పార్టీలో నమోదైన సభ్యత్వం నిజమైనదే అయితే..వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఇప్పటి కంటే బంపర్ మెజార్టీ రావాలి. 80 లక్షల మందితో పాటు, వారి కుటుంబ సభ్యులంతా ‘టిడిపి’కి ఓటు వేస్తే..చాలు..ఇంకెవరూ అవసరం లేదు. అందువల్ల ఈ సభ్యత్వాలనే బలమని భావించకుండా, పాలకులు ప్రజలతో మమేకం కావాలి. అదే సమయంలో..పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఆకాంక్షల మేర పాలన సాగాలి. అప్పుడే..ఇలా వచ్చిన ‘కోటి’ సభ్యత్వం నిజమైన సభ్యత్వం అవుతుంది.