TV18కు కోటి పదిహేను లక్షలు...!?
దావోస్‌లో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలను హైలెట్ చేయడానికి ‘సిఎన్‌బిసి టివి 18’ ఛానెల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,15,64,000/` ( ఒక కోటి పదిహేను లక్షల అరవై నాలుగు వేల రూపాయలు)ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దావోస్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రేపు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఆయన తనయుడు ‘ఐటిశాఖ మంత్రి నారా లోకేష్’తో పాలు పలువురు మంత్రులు, వివిధశాఖల అధికారులు ‘దావోస్’ వెళ్లనున్నారు. వీరి కార్యక్రమాలను హైలెట్ చేయడానికి, ప్రోత్సహించడానికి గాను ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టివి 18తో పాటు ‘ఎన్‌డిటివి’ ‘ఎన్‌డిటివి ప్లస్’ కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ‘దావోస్’లో హైలెట్ చేయబోతున్నారు. దీనికి గాను ‘ఎన్‌డిటివి’కి రూ.72లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రెండు ఛానెల్స్‌కు కలిపి దాదాపు రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ‘దావోస్’లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’తో పాటు విద్యా,ఐటిశాఖ మంత్రి ‘లోకేష్’ పెట్టుబడులపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ‘జగన్మోహన్‌రెడ్డి’ పెట్టుబడి యాత్రలు చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో ‘దావోస్’ వెళ్లారు. అయితే...ముందుగా ఆయన ‘లండన్’ వెళ్లి తరువాత ‘దావోస్’ వెళ్లారనే ప్రచారం సాగింది. అప్పట్లో పెట్టుబడుల సదస్సులో ‘జగన్’ చేసిన ప్రసంగాలను సోషల్‌మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యాయి. ‘ఇట్స్ లెంతీ క్వచెన్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ‘టిడిపి’ సోషల్‌మీడియా ఒక ఆట ఆడుకుంది. అప్పటి పెట్టుబడులశాఖ మంత్రి ‘గుడివాడ అమరనాథ్’ చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు కారణమైంది.మొత్తం మీద..బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తోన్న తొలిపెట్టుబడుల యాత్ర మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిద్దాం.