లేటెస్ట్

సీనియర్‌ ‘ఐఏఎస్‌’ల బదిలీలు...!?

రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత భారీగా సీనియర్‌ ఐఏఎస్‌లను బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈరోజో..రేపో..బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాస్తవానికి ఈరోజు సాయంత్రమే బదిలీలు జీవో వస్తుందని సమాచారం. అయితే..ఎవరెవరినీ బదిలీ చేస్తారనే దానిపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది శాఖాధిపతులతో పాటు, హెచ్‌ఓడిలను కూడా బదిలీ చేస్తారంటున్నారు. కొంత మంది ఐఏఎస్‌ అధికారులు రెండు కంటే ఎక్కువ పోస్టులకు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. ఇటువంటి వారిస్థానంలో నూతనంగా కొందరికి అవకాశం ఇస్తారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న దావోస్‌ వెళుతూ బదిలీలపై కసరత్తు చేశారని, దాని ప్రకారం ఈ రోజు ఉత్తర్వులు వెలువడుతాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. అదే సమయంలో ఆర్థికశాఖలోని అధికారిని కూడా సాగనంపుతారంటున్నారు. వీరు కాకుండా ఇటీవల తీవ్రస్థాయిలో వివాదాస్పదం అయిన ‘తిరుమల తిరుపతి’ దేవస్థానం అధికారులు కూడా బదిలీ లిస్టులోఉన్నారంటున్నారు. దీనిపై స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రి ‘దావోస్‌’ పర్యటన తరువాతనే వీరిని బదిలీ చేస్తారంటున్నారు. అయితే..ఈలోపు కూడా కొందరు ‘టీటీడీ’ అధికారులను బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది.


‘కాటంనేని’ బదిలీ...!

అత్యంత నిజాయితీపరుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ‘కాటంనేని భాస్కర్‌’ను బదిలీ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సిఆర్‌డిఏ కమీషనర్‌గా ఉన్న ‘కాటంనేని భాస్కర్‌’ను బదిలీ చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి ‘నారాయణ’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ఆయన ఒత్తిడి పనిచేసి ‘భాస్కర్‌’ బదిలీకి రంగం సిద్ధమైందంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌ల్లో అత్యంత నిజాయితీపరుడు, కష్టపడేతత్వం, నిరాడంబరంగా ఉండే ‘భాస్కర్‌’ను ప్రభుత్వం బదిలీ చేస్తే..నిజాయితీకి ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఏపాటి విలువ ఇస్తుందో...? ప్రజలకు తెలుస్తుందనే మాట..అధికార, రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. ‘సిఆర్‌డిఏ’ కమీషనర్‌గా ఆయన రాజధాని రైతుల మనస్సులను చూరగొన్నారు. అత్యంత వేగంగా సమస్యలను పరిష్కరించి, వందశాతం కష్టపడి పనిచేసే ‘భాస్కర్‌’ను తప్పించడానికి మంత్రి నారాయణ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. నేరుగా ‘భాస్కర్‌’ కార్యాలయానికి పదే పదే వచ్చి మంత్రి నారాయణ అక్కడ తిష్టవేస్తున్నారని, అసలు సిఆర్‌డిఏ కార్యాలయానికి ఆయన రావాల్సిన అవసరం ఏమిటో? ఎవరికీ తెలియదు. తాను చెప్పిన కాంట్రాక్టులను తన వాళ్లకు ‘భాస్కర్‌’ ఇవ్వలేదనే అక్కసుతోనే ‘నారాయణ’ ‘భాస్కర్‌’పై కక్షపెంచుకున్నారని, దాంతో ఆయనను బదిలీ చేయాలని ముఖ్యమంత్రిపై ఆయన ఒత్తిడి తెచ్చారని చివరకు ఆయన ఒత్తిడి ఫలించిందని, దీంతో బదిలీ లిస్టులో ‘భాస్కర్‌’ పేరు కూడా చేరిందంటున్నారు. మొత్తం మీద..నిజాయితీగా, నిష్టగా పనిచేసేవారిని తరిమేస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ