నెరవేరిన ‘నారాయణ’ పంతం
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి ‘పి.నారాయణ’తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన మాట వినడం లేదనే ఆగ్రహంతో..సిఆర్‌డిఏ కమీషనర్ ‘కాటంనేని భాస్కర్’ను ఆయన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై పదే పదే ఒత్తిడి చేసి చివరకు ఆయనను బదిలీ చేయించగలిగారు. ఆయనను ‘సిఆర్‌డిఏ’ నుంచి తప్పించి ఐటిసిÊఇ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా ఆయనకు ‘ఆర్టీజీఎస్ మరియు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పోస్టులకు పూర్తి అదనపు బాధ్యతను అప్పగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ‘కాటంనేని భాస్కర్’ నిజాయితీ, కష్టపడేతత్వం చూసి ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ తన కలల రాజధాని ‘అమరావతి’ నిర్మాణంలో కీలకమైన సిఆర్‌డిఏ కమీషనర్ పోస్టును ‘భాస్కర్’కు కట్టబెట్టారు. అయితే ఆయన అదే సమయంలో తన సన్నిహితుడు ‘నారాయణ’ను మున్సిపల్ మంత్రిగా నియమించారు. గతంలో..రాజధాని బాధ్యతను ‘నారాయణ’ మీద పెట్టినా..ఆయన వైఫల్యంతో..‘అమరావతి’ విమర్శకులకు టార్గెట్ అయింది. తాత్కాలిక రాజధాని అంటూ ‘నారాయణ’ నిర్మించిన భవనాలు ‘నారాయణ కాలేజీ’ వలే ఉన్నాయనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ‘నారాయణ’ను ‘చంద్రబాబు’ ఏమీ అనలేదు. అప్పట్లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాంబశివరావు’ రాజధాని ‘అమరావతి’లోని భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని, అలా చేస్తే..రాజధానిపై వస్తోన్న విమర్శలు ఆగిపోతాయని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ‘చంద్రబాబు’కు సూచించారు. అయితే..ఆయన సూచనను అప్పట్లో ‘చంద్రబాబు’, నారాయణలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో..రాజధానిలో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో..ప్రత్యర్థులు, రాజధాని వ్యతిరేకులు ‘అమరావతి’ గ్రాఫిక్స్ అంటూ హేళన చేయడంతో పాటు, దానిని అడ్డుకున్నారు. అప్పట్లో సమర్థులైన అధికారుల నేతృత్వంలో రాజధానిని పూర్తి చేసి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది కానీ..అలా చేయలేదు.
అయితే..గతం నుంచి గుణపాఠాలను పాలకులు నేర్వలేదు. ఈసారి సమర్థుడు, నిజాయితీపరుడైన ‘భాస్కర్’ను ‘రాజధాని’ నిర్మాణంలో కీలకం చేయడంతో..‘అమరావతి’ పనులు శరవేగంగా పూర్తి అవుతాయని ‘రాజధాని ప్రేమికులు’ భావించారు. అయితే..మున్సిపల్ మంత్రి ‘నారాయణ’ వ్యవహారశైలితో..రాజధాని పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. సిఆర్‌డిఏ కమీషనర్‌తో రోజూ ఆధిపత్యపోరు జరపడంతో పాటు, తనకు కావాల్సిన వారికి భారీ కాంట్రాక్టులు ఇవ్వాలని, నిబంధనలు పట్టించుకోకుండా వాటిని ఇవ్వాలని ఆయన భీష్మించుకొని కూర్చోవడంతో...నిజాయితీగా వ్యవహరించే ‘భాస్కర్’ ఆయనతో విభేదించారు. దీంతో..రోజూ ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు తప్పనిసరైంది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ‘నారాయణ’ ప్రతిరోజూ ‘సిఆర్‌డిఏ’ కార్యాలయానికి వెళ్లడం, కమీషనర్ ఛాంబర్‌లో కూర్చోవడం చేస్తున్నారు. దీంతో ‘నారాయణ’ ఉంటే...‘భాస్కర్’ అక్కడ ఉండడం లేదు. ఈ ఇద్దరి మధ్య నడుస్తోన్న గొడవ తెలుసుకుని ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ‘సిఆర్‌డిఏ’ కార్యాలయానికి వెళ్లవద్దని మంత్రి ‘నారాయణ’ను ఆయన సుతిమెత్తగా మందలించారు. అయితే..ఆయన మదలింపును పట్టించుకోకుండా..‘నారాయణ’ యధావిధిగా అక్కడకు వెళ్లసాగారు. దీంతో మళ్లీ పరిస్థితులు వారిద్దరి మధ్య దిగజారిపోయాయి. పైగా ‘భాస్కర్’ను బదిలీ చేయాలని ‘నారాయణ’పదే పదే పట్టుబడుతుండడంతో..ఇక తప్పనిసరి అయిన పరిస్థితుల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారైనా..‘చంద్రబాబు’ ‘భాస్కర్’ బదిలీకి పచ్చజెండా ఊపారు. నిన్న ‘దావోస్’ వెళుతూ...‘భాస్కర్’తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని ‘సిఎస్’కు చెప్పారు. దాని ప్రకారమే ఈ రోజు బదిలీలు జరిగాయి. మొత్తం మీద నిజాయితీగా, సమర్థవంతంగా, ముక్కుసూటిగా పనిచేసే అధికారులు తమకు అవసరం లేదన్నట్లు ప్రభుత్వ పెద్దలు భావించినట్లుంది.