వీళ్లతో ‘లోకేష్’కు తంటాలే...!?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్’ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారేమోనన్న అనుమానాలు ఆయన అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఆయనను అనవసరంగా వివాదాల్లోకి వీరు దింపుతున్నారని, ఆయనతో కావాలనే వీరు తప్పులు చేయిస్తున్నారనే భావన వారి నుంచి వస్తోంది. వీరు చెప్పేమాటలు, సలహాలతోనే ఆయన తప్పుమీద తప్పు చేస్తున్నారా..? లేక ఆయనే స్వయంగా తప్పులు చేస్తున్నారో తెలియడం లేదు కానీ..ఇటీవల కాలంలో తీవ్రమైన వివాదాస్పదమైన విషయంలో ఆయన ఘోరంగా దెబ్బతిన్నారు. ఎవరి మీదో పోటీ, భవిష్యత్తు అంటూ..లేనిపోని మాటలకు ‘లోకేష్’ పడిపోయారని, వీరంతా కలిసి ఆయనను చిన్నబుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ‘లోకేష్’ చుట్టూ ఉన్న ఆయన బృందంలోని వారంతా...‘లోకేష్’ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు మీడియా వ్యక్తులు, ‘లోకేష్’కు సన్నిహితులుగా చెప్పుకునే ఐఏఎస్ అధికారులు, ఆయన చిన్ననాటి స్నేహితులు, పార్టీలో ఆయనను కాకాపట్టేవారు..కొంత మంది యూట్యూబ్ వాళ్లూ...ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతూ ‘లోకేష్’ను మునగచెట్టెక్కించి, అక్కడ నుంచి వాళ్లే తోసేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం ‘లోకేష్’కు తెలుసా..లేదో కానీ..‘డిప్యూటీ సిఎం’ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అసలు ఆయనకు ‘ఉపముఖ్యమంత్రి పదవి’ అంటూ..రాగాలు తీసిన వారెవరు..? దానికి మద్దతు పలికిన వారెవరూ..? ఇప్పుడు ఆయనకు ఏమి తక్కువైందని ‘డిప్యూటీ’ కావాలి..? ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు..? దాదాపు అన్నిశాఖల మంత్రులు (ఒక్క జనసేన మంత్రులు) తప్ప అందరూ ఆయన మాట మీదే పనులు చేస్తున్నారు. తాను అనుకుంటే..ఎటువంటి పనులైనా..నిమిషాల మీద చేయగలిగే పరిస్థితి ఉంది. మరి ఎందుకు ‘ఉపముఖ్యమంత్రి పదవి’? దాని వల్ల వచ్చే లాభం ఏమిటో..ఆయనను ‘మునగ చెట్టు’ ఎక్కిస్తున్నవారికైనా తెలుసా..? ఇప్పటికిప్పుడు ‘డిప్యూటీ సిఎం’ పదవి కోరడం సమంజసమేనా..? కోరారనుకుందాం...? మరి దాని వల్ల ఎదరుయ్యే పరిణామాలను వీళ్లు ఎందుకు అంచనావేయలేదు. ఒకవేళ అంచనా వేస్తే..ఆ పరిణామాలను అడ్డుకునే వ్యూహాలేవి...? ఎదుటి బృందం ఎదురుదాడి చేయడంతోనే..‘లోకేష్’ బృందం తోకముడిచిందనే అభిప్రాయాలు ‘జనం’లోకి వెళ్లిపోయాయి. ఎటువంటి వ్యూహాలేమీ లేకుండా, ఎదురుదాడి చేసే నైపుణ్యం లేకుడా నేరుగా ‘ఉపముఖ్యమంత్రి’ రేసులోకి ‘లోకేష్’ను దించి వారంతా చోద్యం చూశారు..? వీళ్లంతా కలిసి ఒక పద్దతి ప్రకారం ‘లోకేష్’ను ఇరికించలేదు కదా....? అనే అనుమానాలు ఈ సంఘటన తరువాత వ్యక్తం అవుతున్నాయి.
ఆయన సన్నిహితులుగా చెప్పుకునే వాళ్లలో కొంత మంది అతిగా చేస్తున్నారనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. తాము ఏమి చెబితే ‘లోకేష్’ అది చేస్తారనే భావన వారిలో ఉందని, దాంతో..వారు తామే ‘లోకేష్’ను నడిపిస్తామనే భావనలో ఉన్నారంటున్నారు. ఇటువంటి వారి వలన ఆయనకు చాలా ప్రమాదాలు ఎదురవుతాయనే అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ‘లోకేష్’ కుటుంబసభ్యులు..ఆయనను సిఎంగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ..ఇప్పటికిప్పుడు ఆయన సిఎం అయ్యే పరిస్థితి లేదు. అయితే..సిఎం బదులు ‘ఉపముఖ్యమంత్రి’ అంటూ..ఆయన సన్నిహితులు, స్నేహితులు, యూట్యూబ్‌వాళ్లు ఊదరగొట్టారు. చివరకు ఏమైంది..? పూర్తిగా నష్టం జరిగిన తరువాత ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఆయనను ఉపముఖ్యమంత్రిని చేయాలని వీరు భావిస్తే..వీళ్లకో ‘వ్యూహం’ ఏడ్వాలి కదా..? ఎంతో చాకచక్యంగా పకడ్బందిగా, రెండో కంటికి తెలియకుండా చేయాల్సిన దానిని గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసేశారు. ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ కూడా..తనయుడు విషయంలో పొరపాట్లు చేసినట్లు కనిపిస్తోంది. తన ముందే..ఆయనను ఉపముఖ్యమంత్రి చేయాలని నేతలు కోరినప్పుడు, అది వీలవకపోతే.. వెంటనే దానిని ఖండిరచాల్సింది. ఆ విధంగా చేసుంటే..ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేవి. ఏది ఏమైనా..జరిగిన తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి. తన చుట్టూ ఉన్న వారిని, తనను మునగచెట్టు ఎక్కిస్తున్నవారి పట్ల ‘లోకేష్’ అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే..ఆయనకు భవిష్యత్తులో మరిన్ని తంటాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.