లేటెస్ట్

‘ఐఏఎస్‌’ బదిలీల్లో వింతలు, విడ్డూరాలు...!?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో ప్రభుత్వ పెద్దలు తమ సౌకర్యాలకు అనుగుణంగా బదిలీలు చేసుకున్నారు. నిజాయితీపరులు, సమర్థత, విశ్వసనీయంగా పనిచేసేవారిని అంతగా ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేశారు. మరోవైపు అవినీతి ఆరోపణలు ఉన్నవారు, గతంలో ‘జగన్‌’ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి, ‘జగన్‌’ ఆడమన్నట్లు ఆడినవారికి పెద్దపీట వేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి, అక్రమాలు, వ్యక్తిత్వంలేని వారిని ఎందుకు ‘చంద్రబాబు’ ఆయన కుమారుడు ఎంచుకున్నారో..అర్థం కావడంలేదని అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే సృహ వారిలో లోపించిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసే ‘సిఆర్‌డిఏ’ కమీషనర్‌ ‘కాటంనేని భాస్కర్‌’ బదిలీ రాజకీయ, అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఆయన చేసిన నేరం ఏమిటి..? నిజాయితీగా పనిచేయడమే ఆయన చేసిన పాపమా...? ఆయన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది కదా..? ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేవారి కన్నా..తమకు మూటలు పంచిపట్టేవారే..వారికి ఇష్టులా..? ఆయన బదిలీ కోసం మంత్రి ‘నారాయణ’ ఒత్తిడి తెచ్చారనే అనుకుందాం...? ఒక వేళ ‘భాస్కర్‌’కు ‘నారాయణ’కు పడకపోతే..‘భాస్కర్‌’ కన్నా నిజాయితీపరుడైన అధికారిని నియమించాలి కానీ..అవినీతి ఆరోపణలు, ‘జగన్‌’ మనిషి అనే పేరున్న ‘కన్నబాబు’ను ఎలా నియమించారని పార్టీ వర్గాలతో పాటు, సోషల్‌ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ‘భాస్కర్‌’  పనితీరును రాష్ట్రం మొత్తం చూసింది. గత టిడిపి హయాంలో..‘పట్టిసీమ’ నిర్మాణంలో ఆయన రాత్రిబంవళ్లు కష్టపడి పనిచేశారు. ఒక ఐఏఎస్‌ అధికారి అయి ఉండి కూడా రాత్రిళ్లు కాల్వగట్లపై నిద్రించి..‘చంద్రబాబు’ చెప్పిన సమయానికి ‘పట్టిసీమ’ను పూర్తి చేయించారు. అదే విధంగా ‘పోలవరం’ ప్రాజెక్టు విషయంలో ‘భాస్కర’ పనితీరు యావత్‌ రాష్ట్ర ప్రజలంతా గుర్తించారు. ‘భాస్కర్‌’ ‘పశ్చిమగోదావరి’ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘పోలవరం’ వద్ద కేవలం ‘కొండలు’ మాత్రమే ఉన్నాయి. అక్కడ కనీసం ఒక తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే..‘భాస్కర్‌’ ల్యాండ్‌పూలింగ్‌, ఇతర పనుల పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నారో..ఇక అప్పటి నుంచి ‘పోలవరం’ పనులు పరుగులు పెట్టాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలో ‘పోలవరం’ ప్రాజెక్టు అక్కడ నిలబడగలిగింది. ఆయన టైమ్‌లోనే ‘పోలవరం’ క్రస్ట్‌ గేట్లను కూడా బిగించారు. వళ్లు దాచుకోకుండా పనిచేసే అధికారిగా, అదే సమయంలో నిజాయితీగా, ముక్కుసూటిగా, విశ్వసనీయంగా పనిచేసే ‘భాస్కర్‌’ను ప్రాధాన్యత లేని శాఖకు పంపించడం పార్టీ నాయకులను, ఆయన గురించి తెలిసిన వారిని హతాశులను చేసింది. ఈయనొక్కరే కాదు..మరి కొందరు అధికారుల వ్యవహారంలోనూ అన్యాయం జరిగిందనే మాట వినిపిస్తోంది.

విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న ‘సారభ్‌గౌర్‌’ను కూడా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. ‘నారా లోకేష్‌’ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ‘గౌర్‌’ను ఏరికోరి ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే..ఆయన తన స్వంత పనుల కోసం మూడు నెలలు సెలవుపై వెళ్లడంతో ఆయనను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. ఆయ‌న నిజాయితీప‌రుడో..కాదో..తెలియ‌దు కానీ..టెక్నిక‌ల్‌గా మంచి నైపుణ్యం ఉంద‌నే ప్ర‌చారం ఉంది. ఆయ‌న‌కు ఉన్న అనుభ‌వం విద్యావ్య‌వ‌స్థ‌కు బాగా ప‌నిచేసేది. విద్యావ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు తెస్తున్న త‌రుణంలో ఆయ‌న‌ను అక్క‌డే కొన‌సాగించి ఉంటే బాగుండేది. అయితే ఆయనకు కుటుంబీకులకు ఏవో వ్యాపారాలు ఉన్నాయని, వాటిపైనే ఆయన శ్రద్ధచూపిస్తున్నారనే భావనతో ఆయనను బదిలీ చేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ‘జగన్‌’ మనిషిగా పేరున్న ‘అజయ్‌జైన్‌’కు కీలకమైన శాఖకు అప్పగించారు. ‘చంద్రబాబు’కు వ్యతిరేకంగా కోర్టుల్లో సాక్ష్యం చెప్పారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయినా..ఆయనను కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారనుకున్న ‘సాయిప్రసాద్‌’కు కులం దెబ్బ పడిరది. దీంతో..ఆయనను ‘చంద్రబాబు’ తన కార్యాలయంలో నియమించుకున్నారు. మరోవైపు ‘ముఖేష్‌కుమార్‌ మీనా’కు ప్రాధాన్యత కలిగిన ‘జిఎడి’ ఎక్సైజ్‌శాఖలను అప్పగించి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. ‘కోన శశిధర్‌’కు కూడా మంచి పోస్టులే ఇచ్చారు. ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి పోస్టుతో పాటు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి పోస్టును కట్టబెట్టారు. ‘కోన’ అంటే ‘చంద్రబాబు’కు ప్రత్యేకమైన అభిమానమట. అదే విధంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ‘బుడితి రాజశేఖర్‌’పై ‘చంద్రబాబు’ అవాజ్యప్రేమను మరోసారి చూపించుకున్నారు. మొత్తం మీద ఐఏఎస్‌ బదిలీల్లో ‘చంద్రబాబు’ నిజాయితీ,సమర్థతను పక్కనపెట్టి..ఆరోపణలు ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ