లేటెస్ట్

‘అమిత్‌షా’ దెబ్బతోనే..‘విజయసాయిరెడ్డి’ రాజీనామా...!?

వైకాపా రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు ‘విజయసాయిరెడ్డి’ ఆ పార్టీకీ,రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా వైకాపాకు ఇది పెద్ద దెబ్బే. హఠాత్తుగా ‘విజయసాయిరెడ్డి’ రాజీనామా ఎందుకో తెలియక, వారు పలువురిని వాకబు చేస్తున్నారు. ఆయనకూ అధినేత ‘జగన్‌’కూ ఇతర ముఖ్యనాయకుల మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసినా..ఆ విభేదాలతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళతారని వారు అనుకోలేదు. అయితే..ఈ రోజు ఆయన రాజీనామా ప్రకటన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన రాజీనామాపై వైకాపా అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే..అధికార కూటమికి మద్దతు ఇచ్చే మీడియా, కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఆయన రాజీనామాపై రకరకాలుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ‘విజయసాయిరెడ్డి’కి ‘జగన్‌ దంపతుల’కు పడడం లేదని, ఆయనకూ ‘సజ్జల రామకృష్ణారెడ్డి’కి మధ్య ఉన్న విభేదాలని, ‘వై.వీ.సుబ్బారెడ్డి’ ఆయనకూ పడడం లేదని కొందరు, ‘విజయసాయిరెడ్డి’ ఇటీవల నమోదైన ‘కాకినాడ సెజ్‌, పోర్టు’ కేసుల వల్లనేని మరి కొన్ని ఛానెల్స్‌ ఊదర గొడుతున్నాయి. అయితే..ఆయన రాజీనామాకు ఇది అసలైన కారణం అనిపించడం లేదు. కేసులు, పార్టీలో విభేదాలు..‘విజయసాయిరెడ్డి’కి పెద్ద సమస్య కాదు. ఆయనకు కేసులు కొత్తా..? జైలు కొత్తా..? ఏమీ కాదు..? ఎన్ని కేసులు ఉన్నా...? ఎన్ని ఆరోపణలు ఉన్నా..కొత్తగా మరెన్ని కేసులు వచ్చి మీద పడినా..‘విజయసాయిరెడ్డి’ ఆయన నాయకుడు ‘జగన్‌’ స్పందించే రకాలు కాదు. అయితే..ఎందుకు ఆయన ఇంత హఠాత్తుగా రాజీనామా చేశారు..? అంటే..కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. 


‘బిజెపి’ విశ్వాసాన్ని కోల్పోయారా..?

వైకాపా పార్టీ పుట్టిన దగ్గర నుంచి దాదాపు కేంద్రంలో ‘బిజెపి’నే అధికారంలో ఉంది. ‘రాజశేఖర్‌రెడ్డి’ మరణించిన తరువాత తనను ‘సిఎం’ చేయలేదని ‘జగన్‌’ పార్టీ పెట్టుకోవడంతో..కేంద్రంలో అధికారంలో ఉన్న ‘కాంగ్రెస్‌’ ‘జగన్‌’ను, అప్పట్లో ‘వై.ఎస్‌.కుటుంబాని’కి ఆడిటర్‌గా ఉన్న ‘విజయసాయిరెడ్డి’ని జైలుకు పంపింది. జైలు నుంచి ఇద్దరూ విడుదలైన తరువాత..కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.అయితే ఆ ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. దీంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ‘బిజెపి’ ఆశీస్సుల కోసం ‘జగన్‌’ ‘విజయసాయిరెడ్డి’ని ‘ఢల్లీి’కి పంపించారు. ‘ఢల్లీి’ ‘విజయసాయిరెడ్డి’ పలు విన్యాసాలు చేసి ‘బిజెపి’ పెద్దల మనస్సు చూరగొన్నారు. ‘ప్రధాని మోడీ’ కేంద్ర హోంమంత్రి ‘అమిత్‌షా’ల ఆశీస్సులు సంపాదించారు. వారి ఆశీస్సులు సంపాదించిన తరువాత ‘బిజెపి, టిడిపి’ల మధ్య వైషమ్యాలను సృష్టించి ‘బిజెపి’ పెద్దలను ‘జగన్‌’ వైపు మళ్లించారు ‘విజయసాయిరెడ్డి’. ‘బిజెపి పెద్దల’ ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో ‘వైకాపా’ ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో అధికారం దక్కిన దగ్గర నుంచి ‘జగన్‌’ బిజెపి పెద్దలకు కోపం రాకుండా, వారికి కట్టాల్సిన కప్పం కడుతూ..వారిని ఐదేళ్లు మెప్పించారు. అయితే..2024 ఎన్నికల్లో ‘జగన్‌’ ఓడిపోతారని తెలిసిన తరువాత ‘బిజెపి పెద్దలు’ ‘టిడిపి, జనసేన’లతో కలిసి ఎన్నికల్లో పోటీచేశారు.


ఈ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. అయితే...కూటమి విజయం సాధించినా..‘రాజ్యసభ’లో ‘వైకాపా’కు ఉన్న బలంపై ‘బిజెపి పెద్దలు’ కన్నేశారు. వారందరినీ..తమ పార్టీలో చేర్పించాలని ‘విజయసాయిరెడ్డి’ని ఆదేశించారు. ముందు దానికి సరేనన్న ‘విజయసాయిరెడ్డి’ తరువాత వారికి మోహం చాటేశారు. గత ఏడు నెలల నుంచి..‘విజయసాయిరెడ్డి’ ఎంతో ప్రయత్నం చేసినా..ముగ్గఉరు కంటే..ఎక్కువ మంది కూటమిలో చేరలేదు. దీంతో..‘అమిత్‌షా’ ‘విజయసాయిరెడ్డి’ ఎడాపెడా వాయించారని, ‘ఢల్లీి’లో తనకు కనిపిస్తే బాగుండదని హెచ్చరించారనే ప్రచారం ఉంది. ఇది ప్రచారం కాదు..కొన్ని వారాల క్రితం ‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ’కు ‘విజయసాయిరెడ్డి’కి మధ్య ఓ వివాదం జరిగింది. అప్పట్లో ‘రాధాకృష్ణ’ ‘విజయసాయిరెడ్డి’ని ఉద్దేశిస్తూ..మీ పార్టీ ఎంపీలను ‘బిజెపి’లో చేరుస్తానని, బిజెపి పెద్దలకు చెప్పి..ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నది నిజమా..? కాదా..? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే కదా..? అంటే ‘విజయసాయి’ ‘బిజెపి’తో చేసుకున్న ఒప్పందం అమలు చేయకపోవడంతో..‘బిజెపి పెద్దలు’ ‘విజయసాయిరెడ్డి’ సంగతి తేల్చడానికే ‘కాకినాడ సెజ్‌’ కేసును భారీగా కదిలించారు. ఈ కేసులో..‘ఈడీ’ రంగంలోకి దిగి ‘విజయసాయిరెడ్డి’ని ప్రశ్నించిన తరువాత జరిగే సీన్‌ ఏమిటో ‘సాయిరెడ్డి’కి అర్థం అయింది. తాను ఇంకా వైకాపాలో ఉంటే..తనకు ‘శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనే సంగతి ఆయనకు అర్థం అయింది. అయినా..ఏదో విధంగా ఉగ్గపట్టుకుని ఉండాలనకున్నారు..కానీ..ఇటీవల ‘విజయవాడ’ వచ్చిన ‘అమిత్‌షా’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’, ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’, బిజెపి నేతలతో కలిసి ‘అమరావతి’లో విందులో పాల్గొన్నారు. ఈ విందు తరువాత ‘చంద్రబాబు’ ‘అమిత్‌షా’లు ‘విజయసాయిరెడ్డి’ అంశంపై చర్చించారని ప్రచారం. ఇక ‘విజయసాయిరెడ్డి’ సంగతి చూడాల్సిందేనని వారు నిర్ణయించుకున్న తరువాత..‘విజయసాయిరెడ్డి’కి మరో మార్గం లేకపోయింది. దీంతో..ఇప్పుడు రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే..‘విజయసాయిరెడ్డి’ పని అప్పుడే అయిపోలేదని, వైకాపాలో ఉన్న మిగతా రాజ్యసభ్యులను కూడా ‘బిజెపి’లో చేర్పిస్తేనే.ఆయనకు విముక్తి లభిస్తుందని ‘అమిత్‌షా’ హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద..వైకాపాలో నెంబర్‌టూగా ఉన్న ‘విజయసాయిరెడ్డి’ రాజకీయజీవితం..అర్థాంతరంగా ముగిసిపోతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ