లేటెస్ట్

‘వైకాపా’కు ఏమీ కాదు...!?

‘వైకాపా’ పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న ‘విజయసాయిరెడ్డి’ ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరికొందరు వైకాపా రాజ్యసభ సభ్యులు ‘వైకాపా’ను వీడుతారని, వారంతా వెళ్లిపోతే..ఇక ‘వైకాపా’ను ‘జగన్‌’ మూసివేసి ‘లండన్‌’లో స్థిరపడతారని, ఇక ‘ఆంధ్రా’కు ఆయన రారని కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. యూట్యూబ్‌వాళ్లు ఇలా చేస్తున్నారంటే..ఏదో వ్యూస్‌ కోసమని ప్రాకులాడుతున్నారను కోవచ్చు. కానీ కొందరు ప్రముఖులుగా చెప్పుకునే వారు కూడా..ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీరు కాకుండా కొంత మంది ‘టిడిపి’ అభిమానులు, హార్డ్‌కోర్ట్‌ ‘టిడిపి’ ఫ్యాన్స్‌ ఇక ‘జగన్‌’ పార్టీ పని అయిపోయిందనే సంతోషంతో ఉన్నారు. అయితే వారు..ఆశ పడుతున్నట్లు జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే..ఏదో కొంత మంది రాజ్యసభ సభ్యులు, మరి కొంద మంది నాయకులు పార్టీని వీడితో..‘జగన్‌’ పార్టీకి పెద్దగా నష్టమేమీ ఉండదు. గతంలోనూ ఇదే నిరూపితమైంది. దీన్ని కావాలని వీళ్లు మరిచిపోతున్నట్లున్నారు. వాస్తవానికి ‘జగన్‌’ బెడద తప్పితే బాగుండు..అని రాష్ట్ర హితవు కోరుకునే వారు భావిస్తున్నారు. అయితే..అదే సమయంలో..వాస్తవిక దృక్ఫదంలో అది అయ్యే పనికాదు. ఎందు కంటే..రాష్ట్రంలో ‘జగన్‌’ పార్టీని ఆదరించేవారు లక్షల్లోనే ఉన్నారు. ‘జగన్‌’ అవినీతిపరుడు, అవివేకి, మూర్ఖుడు, స్వార్ధపరుడు లాంటి అవలక్షణాలు ఉన్నా..ఆయనను ఆయన పార్టీని సమర్థించే వారు వాటిని పట్టించుకోరు. కొన్ని కులాలు, మతాలకు చెందిన వ్యక్తులు వీటికి అతీతంగా..ఆయనను ఆరాధిస్తున్నారు. వారికి ‘ఆయన’ ఏమి చెబితే..అదే వేదం. ఆయన తమ కోసం పుట్టిన దేవదూతలాగా భావించేవారు చాలా మందే ఉన్నారు. గత ఎన్నికల్లో ‘జగన్‌’ పార్టీ ఘోరపరాజయం పాలయినా..వారిలో ఏమీ మార్పేమీ లేదు. గత ఎన్నికల ఓటమిని ‘జగన్‌’ ‘ఈవిఎం’లపై నెట్టేస్తే..ఆయన అభిమానులు కూడా దాన్నే నమ్ముతున్నారు తప్ప..గత ఐదేళ్ల అరాచకపాలనపై పన్నెత్తి ‘జగన్‌’ను ప్రశ్నించరు...? అది ‘జగన్‌’కు దేవుడిచ్చిన వరం. ఇటువంటి పరిస్థితుల్లో..ఇప్పుడు కొందరు నేతలు పార్టీని వీడిపోతే..‘వైకాపా’ ఉండదనుకోవడం సరైన ఆలోచన కాదు. 


వాస్తవానికి ‘కూటమి’ ప్రభుత్వం ఏర్పడినప్పుడు..దానిపై ప్రజలు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే రోజులు గడిచే కొద్ది..కూటమిపాలనపై ప్రజలు పెదవి విరిచే పరిస్థితి వచ్చేస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో..వాళ్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ‘దొంగోడో’ ‘అవినీతిపరుడో’..అరాచకశక్తో’ ఏదైతే ఏమీ..తమకు ఎంతో కొంత పంచాడని, వీళ్లు మాత్రం ఇంత వరకూ రూపాయి తమ ఖాతాల్లో వేయలేదనే భావన సగటు ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతోంది. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే..కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘టిడిపి’ కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో ‘తండ్రీకొడుకుల’పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు తమకు తియ్యటి కబుర్లు చెప్పి తమతో పనిచేయించుకున్నారని, విజయానంతరం..తాము కక్షలకు, కార్పణ్యాలకు దూరమని చెబుతున్నారని, నాడు తమ పీకలు కోసిన వారికి కనీసం జైలు కు కూడా పంపలేకపోతున్నారని, ఇటువంటి వారిని నమ్మి తాము అనవసరంగా దెబ్బతిన్నామనే భావన వారిలో ఉంది. అదే విధంగా అధికారవ్యవస్థపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ‘జగన్‌’ అవినీతిని పెంచిపోషించాడు.. నిజమే..మరి ‘చంద్రబాబు’ ఏమి చేస్తున్నాడు..‘నిజాయితీపరులైన అధికారులను పక్కన పెట్టి..‘జగన్‌’తో అంటకాగిన అధికారులనే కీలకస్థానాల్లో నింపేసేశారు. ఆయనకు..ఈయనకు తేడా ఏముంది..దొందూదొందే..అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పాలనలో కానీ, రాజకీయంగా కానీ..ఇప్పుడు ‘జగన్‌’కు, ‘చంద్రబాబు’కు పెద్ద తేడా లేదు. ఎవరు ఉన్నా..పేదలకు, మధ్య తరగతి వారికి ఒరిగేదేమీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా నుంచి కొంత మందిపోతే..పెద్దగా నష్టమేమీ లేదు. నిజానికి వైకాపాలో నాయకుల అవసరం పెద్దగా లేదు. అక్కడ ‘జగన్‌’ ఒక్కడే నాయకుడు. ఆయనను చూసే ‘జనం’ ఓట్లు వేస్తారు..నాయకులని చూసి కాదు. ఇది గత ఎన్నికల్లోనూ నిరూపితమైంది. 


రంగంలోకి ‘జగన్‌’ కుమార్తెలు...!

అయితే..ఇప్పుడు ఆయనకు ఉన్న సమస్య ఏమిటంటే..ఆయనపై ఉన్న అవినీతి కేసులు.ఈ కేసుల్లో విచారణ జరిగి, తీర్పులు వెలువడితే..‘జగన్‌’ పరిస్థితి తలకిందిలు కావచ్చు. ఆయనకు జైలుశిక్ష పడితేనే ఆయన పార్టీ..అధోగతి పాలవుతుంది. ఈ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కేంద్రంలో ఉన్న పెద్దలకు కోపం రాకుండా ఉండేందుకే..ఒక పద్దతి ప్రకారం రాజ్యసభ సభ్యులను కూటమిలోకి పంపుతున్నారు. అయితే..ఎంత చేసినా...‘బిజెపి పెద్దలు’ కనుక చేయిస్తే..ఏమిటనే చింత ఆయనను వెంటాడుతోంది. అయితే..ఆయన పూర్తిగా వారిపైనే నమ్మకం ఉంచకుండా..తన స్వంత మార్గాలు తాను చూసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా కేసులో తనకు జైలు శిక్ష పడితే..వెంటనే..తన భార్యను రంగంలోకి దించడానికి ఆమెకు అన్నిరకాలుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా అందుతోన్న మరో వార్త ఏమిటంటే..తనకు కనుక జైలుశిక్ష పడితే..తన కుమార్తెలను కూడా రాజకీయరంగంలోకి దింపడానికి రెడీగా ఉంచారని తెలుస్తోంది. ఒకవేళ తాను జైలుకు వెళితే..తన భార్య, ఇద్దరు కుమార్తెలు..రోడ్ల వెంటబడి తమ తండ్రిని జైలుకు పంపారని సానుభూతి యాత్రలకు సిద్దం అవుతారు. అప్పుడు ముగ్గురు ఆడకూతుళ్లు రోడ్డున పడ్డారనే సానుభూతి ప్రజల్లో తప్పకుండా ఉంటుంది. దానికి తోడు కులం, మతం, ప్రాంతీయతత్వం అనే వజ్రాయుధాలు ఆయన వద్ద ఎప్పుడూ  సిద్ధంగా ఉంటాయి. దీంతో..తాను జైలుకు వెళ్లినా..మళ్లీ అధికారం తమకే దక్కుతుందనే ఆలోచనతో ఉన్నారు.మొత్తం మీద ‘విజయసాయిరెడ్డి’ రాజీనామా, ఇతరుల రాజీనామాల వల్ల ‘వైకాపా’కు పెద్దగా నష్టం ఉండదనే భావన వ్యక్తం అవుతోంది. అయితే ఈ రాజీనామాలు, అసంతృప్తులు, అలకలు ‘జగన్‌’కు కొన్నాళ్లు చికాకులు సృష్టించవచ్చు. అంతకు మించేమీ జరగదు. ప్రజలను మళ్లీ ఎలా బురిడీ కొట్టించాలనే ఆలోచనే ‘జగన్‌’ బుర్రను స్థిమితంగా ఉంచడం లేదు. చూద్దాం..ఏమి జరుగుతుందో..? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ