అప్పుడు ‘రుణమాఫీ’..ఇప్పుడు ‘తల్లికివందనం’...!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆ పార్టీని వెంటాడి వేధిస్తాయి. చివరకు అవే విషయాలు ఆ పార్టీ ఓటమికి కూడా కారణమైన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటివో సంగతలు వద్దు కానీ..రాష్ట్ర విభజన తరువాత ఆ పార్టీ ఓటమికి కారణమైన ఓ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘టిడిపి’ గెలుపుకు ప్రధాన కారణం ‘రుణమాఫీ’ ‘చంద్రబాబు’ అనుభవమే. అయితే..తరువాత ఎన్నికల నాటికి ఈ రెండు విషయాలతోనే ‘టిడిపి’ ఘోర ఓటమికి కారణమైంది. ముఖ్యంగా ‘రైతులు’ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రుణమాఫీ’ సక్రమంగా అమలు కాకపోవడం ఒకటి. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉన్న పరిస్థితుల్లో ‘టిడిపి’ గెలుపుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అప్పటి వరకూ జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ‘జగన్’ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ఆయనదే గెలుపని..ఎక్కువ మంది నమ్మారు. అయితే..అప్పటి వరకు ఎన్నికల పరుగులో రెండోస్థానంలో ఉన్న ‘టిడిపి’ రుణమాఫీ హామీ ఇవ్వడం...‘జగన్’ ఆ హామీని నెవరేర్చలేనని దాన్ని ఇవ్వకపోవడంతో ‘టిడిపి’ వైకాపాను పాక్షికంగా వెనక్కునెట్ట గలిగింది. అంతలోనే..కేంద్రంలోని ‘కాంగ్రెస్’ ఘోరమైన పద్దతిలో రాష్ట్ర విభజన చేయడంతో..అనుభవజ్ఞుడైన ‘చంద్రబాబు’ వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని భావించిన వారు..ఒక్కసారిగా టిడిపివైపు మళ్లారు. ఈ రెండు విషయాలే అప్పట్లో ‘టిడిపి’ గెలుపుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక ఇతర విషయాలు ఎన్ని ఉన్నా.. వీటి తరువాతే..అయితే..‘రుణమాఫీ’ హామీతో అధికారంలోకి వచ్చిన..‘టిడిపి’ దాన్ని అమల్లో ఘోరంగా విఫలమైంది.
ప్రమాణస్వీకారం నాడు ‘చంద్రబాబు’ దానిపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోనే రైతుల ఆశలు సగం సచ్చిపోయాయి. తరువాత..రూ.50వేలు అంటూ ఒకసారి...బాండ్లు అంటూ..నానా రకాలుగా, ఎవరికీ అర్థం కాని పద్దతులను తెచ్చి విమర్శల పాలయ్యారు. ఒకేసారి రూ.50వేలు రుణమాఫీ చాలా మందికి జరిగినా..చేస్తానన్న లక్షా యాభవైల రుణమాఫీని పూర్తిగా చేయలేక ‘టిడిపి’ చేతులెత్తేసింది. దీన్ని..అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ‘వైకాపా’ బాగానే వాడుకుంది. ‘చంద్రబాబు’ మోసగాడని, ‘రుణమాఫీ’ చేయలేదని, గతంలో ‘వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి’ చేశారంటూ..బాగా ప్రచారం చేసి రైతులను తనవైపు తిప్పుకుంది. అదే సమయంలో అనుభవజ్ఞడని తెచ్చుకున్న ‘చంద్రబాబు’ రాజధానిని నిర్మించలేకపోవడం, పోలవరాన్ని పూర్తిచేయలేకపోవడం, ఇంకా కుల ముద్ర పడడంతో..ఘోరంగా ఓడిపోయారు. అప్పట్లో ఆయన ‘రుణమాఫీ’ని ఏదో విధంగా చేసినట్లయితే..ఆయన పార్టీ అంత ఘోరంగా ఓడిపోకుండా ఉండేది. కానీ..అప్పట్లో కొందరు సలహాదారుల వల్ల ఈ విషయంపై నానా పిల్లిమొగ్గలు వేసి దెబ్బతిన్నారు. గతంలో ‘రుణమాఫీ’ విషయంలో ఏమి జరిగిందో..ఇప్పుడు ‘తల్లికివందనం’ విషయంలోనూ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో ఎటువంటి వాగ్థానాలు చేయకపోయినా..‘చంద్రబాబు’ను ప్రజలు పిలిచి కుర్చీపై కూర్చోబెట్టేవారు. కానీ..ఆయనలో ఆత్మవిశ్వాసం లేక అలవిగాని హామీలను ఇచ్చారు. ఇప్పుడు వాటి అమలుకు నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా ‘అమ్మకువందనం’ అమలుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ చేసినట్లు చెబుతోన్న ప్రకనటను ఆధారంగా చేసుకుని ‘చంద్రబాబు’ మరోసారి మోసం చేస్తున్నారని, ఆయన సంక్షేమపథకాలను అమలు చేయరని వైకాపాకు చెందిన మీడియా ఒకటే దుష్పప్రచారం చేస్తోంది. వైకాపాకు చెందిన ప్రధాన మీడియాతో పాటు, వాటికి అనుబంధంగా ఉన్న యూట్యూబ్ ఛానెళ్లు దీనిపై రాద్ధాంతాన్ని చేస్తున్నాయి. ‘చంద్రబాబు’ ప్రజలకు బురిడీ కొట్టించాడని, ఓట్లు వేసుకున్న తరువాత..ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన మొదటి నుంచి అంతేనని, పేద ప్రజలను వంచించారని విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో ‘టిడిపి’కి మద్దతు ఇచ్చే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ‘చంద్రబాబు’ ‘అమ్మకవందనం’ ఇతర పథకాలను అమలు చేయరన్నట్లు వార్తలు వండి వారుస్తున్నాయి. అయితే..ఇక్కడ ‘చంద్రబాబు’ అదేమీ చెప్పలేదు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని, గత ఐదేళ్లలో జరిగిన అరాచకాల వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తరువాత ఇంతకంటే మంచిగా సంక్షేమపథకాలను అందిస్తానని ఆయన చెప్పారు.
దీన్ని ఆసరాగా చేసుకుని ‘చంద్రబాబు’ ఇక పథకాలను అమలు చేయరని, ఆయన మోసం చేశారని ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకూ నానా అగచాట్లు పడి ‘రుణమాఫీ’ని కొంత వరకూ ఆయన చేయగలిగారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రూ.50వేల రుణమాఫీని చేశారు. అంతే కాకుండా మిగతా వాటిని కూడా చిన్నగా సర్దుబాటు చేయడానికి చేయవలసిందంతా చేశారు. కానీ..అప్పటికే ఆలస్యం అయింది. ఐదేళ్ల కాలంలో చేసిన మంచి అంతా ‘రుణమాఫీ’పై జరిగిన ప్రచారంతో..బూడిదలో పోసిన పన్నీరైంది. అయితే...ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంటోంది. ‘తల్లికివందనం’ అమలు చేయరని, ఇంకా సంక్షేమపథకాలు ఇవ్వరని జరుగుతోన్న ప్రచారం ‘టిడిపి’ని మరోసారి గట్టిగా దెబ్దతీస్తుంది. ఏడాదికి దాదాపు రూ.12వేల కోట్లు ఈ పథకానికి ఖర్చు అవుతుంది. ఒక ఏడాది దీన్ని మిగిల్చుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి పనికిరాదు. అటువంటి ఆలోచనలు లేకుండా..దీన్ని చెప్పిన ప్రకారం అమలు చేయాలి. చదువుకునే విద్యార్ధులందరికీ దీన్ని వర్తింపచేసి..చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రజల చేత అనిపించుకోవాలి. ఆ దిశగా నిధుల సేకరణ చేసుకోవాలి. ఎలా నిధులు సేకరణ చేసుకుంటారో..తెలియదు...? అప్పులు చేస్తారా..? లేక తాకట్టులు పెడతారా..? ఇంకేమైనా చేస్తారా..? ఎలా చేసుకున్నా..ఈ పథకాన్ని మాత్రం ఖచ్చితంగా అమలుచేయాల్సిందే. ఒక వేళ దీన్ని అమలు చేయలేకపోతే గతంలో ‘రుణమాఫీ’ కొంత వరకు చేసి కూడా..ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. ‘తల్లికివందనం’ విషయంలో అలా జరగకుండా చూసుకోవాలి.