లేటెస్ట్

‘గుంటూరు’ మున్సిపల్‌ అవినీతి సొమ్ము...‘విలేకరి’ ఖాతాలోకి...!?

గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. విజయవాడలో సంభవించిన వరదల సమయంలో బాధితులను ఆదుకోవడానికి ‘గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌’ నుంచి సుమారు రూ.9కోట్ల 23ల‌క్ష‌లు ఖర్చు చేశారు. అయితే..ఈ ఖర్చు అంతా బోగస్‌ అని, వరదబాధితులకు నామమాత్రంగా సహాయం చేసి..దాదాపు 80శాతం నిధులను మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ దోచారని ‘గుంటూరు నగర మేయర్‌’ ‘కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడు’ ఆరోపిస్తున్నారు. తాము లెక్కలు అడిగితే చెప్పటం లేదని, కార్పొరేషన్‌ సమావేశాలను బహిష్కరిస్తున్నారని, ఆయన అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. వరదబాధితుల సహాయం కోసం నిధులు ఖర్చుచేయడం తప్పు కాదని, దానికి లెక్కలు చెప్పకపోవడం తప్పని..ఆయన వాదిస్తున్నారు. అయితే..తాను లెక్కలన్నీ పక్కాగా చెప్పానని మున్సిపల్‌ కమీషనర్‌  గ‌ట్టిగానే స‌మాధానం ఇస్తున్నారు. అయితే..ఈ మొత్తం వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని ‘గుంటూరు’ పౌరసమాజం అంటోంది. ఖర్చుచేసినరూ.9కోట్ల 23లక్షల్లో కమీషనర్‌ బినామీల ఖాతాల్లోకి వెళ్లాయనే ఆరోపణలు బహిరంగంగానే వస్తున్నాయి. ముఖ్యంగా ‘గుంటూరు’ పట్టణానికి చెందిన ఓ విలేకరి ఖాతాలో దాదాపు కోటి రూపాయల వరకు జమ అయ్యాయనే ప్రచారం సాగుతోంది. ఓ చిన్నపత్రికలో విలేకరిగా పనిచేస్తోన్న వ్యక్తి ఖాతాలో మున్సిపాల్టీకి చెందిన నిధులు జమ అయ్యాయని, వీటిని సదరు విలేకరి, కమీషనర్‌ పంచుకున్నారని వైకాపా ప్రచారం చేస్తోంది. అయితే..ఇదంతా నిజమేనని ‘గుంటూరు’కు చెందిన విలేకరులు చెబుతున్నారు. వాస్తవానికి సదరు విలేకరి మొదట నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టులు చేస్తుంటారని, విజయవాడ వరదల పనులు కూడా చేశారని, దానికి సంబంధించిన నిధులే..ఆయన ఖాతాలోచేరాయని మరి కొందరు విలేకరులు చెబుతున్నారు. అయితే..పనులు చేసి..నిధులు తీసుకుంటే..తప్పులేదని, కానీ..ఎటువంటి పనులు చేయకుండా, చేసినట్లు చూపించి, ప్రజల సొమ్ము నొక్కేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీన్ని వైకాపా రాజకీయం చేయడంతో..ప్రభుత్వం దీనిపై విచారణకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయితే..ఓ విలేకరి వ్యవహారం ఇప్పుడు పాత్రికేయవర్గంలో దుమారం రేపుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ