మద్యం గోడౌన్ల ఇన్సూరెన్స్ టెండర్లూ...‘జగన్’ మద్దతుదారులకే...!
పోటీ లేకుండా షీల్డ్ కు ధారాదత్తం
లోగుట్టు వాసుదేవ, విజయరెడ్డిలకే ఎరుక..?
చోద్యం చూస్తున్న ప్రభుత్వ పాలక యంత్రాంగం
మంత్రి దృష్టికి వెళ్లినా స్పందించని అధికారులు
మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్దలో గత ప్రభుత్వ అవినీతి మత్తు వదలిపెట్టటం లేదు. ప్రభుత్వం మారి ఏడు నెలలు గడిచినా ఇంకా ఏపిఎస్బిసిఎల్ లో తెరవెనుక వాసుదేవుని ప్రభావం కనిపిస్తుంది. వాసు దేవుని బంధువు విజయరెడ్డికే రాష్ట్ర మద్యం గోడౌన్ల ఫైర్ ఇన్సూరెన్స్ టెండర్ ఖరారు కావటం చర్చనీయాంశంగా మారింది. స్టేట్ బేవరేజీస్ పరిధిలోని 29 మద్యం గోడౌన్లుకు సంబంధించి ఆగ్ని ప్రమాద ఇన్సూరెన్స్ నిమిత్తం ఈ నెల 10వ తేదిన టెండర్ పిలువగా, ఈనెల 21వ తేదితో గడువు ముగిసింది. టెండర్ లో షీల్డ్ బ్రోకింగ్ ఇన్సూరెన్స్ సంస్ద ఒక్కటి మాత్రమే నిలిచింది. మరో బ్రోకింగ్ ఇన్సూరెన్స్ సంస్ద టెండర్ పోటీకి రాకుండే ఉండే విధంగా షీల్డ్ కు అనుగుణంగా నిబంధనలు టెండర్ లో పొందుపరిచారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఇన్సూరెన్స్ బ్రోకింగ్ వ్యవస్దలోనూ, ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మరో సంస్దకు టెండర్ దక్కకుండా ఉండే విధంగా టెండర్ అర్హతలు నిబంధనలు విధించటం లోపాయికారి ఒప్పందాలకు నిదర్శనంగా కనిపిస్తుంది.
ఇవీ టెండర్ అర్హత నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజిస్ కార్పొరేషన్ లిమిటిడ్ కు గతంలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్ద పని చేసి ఉండాలి. సుమారు ఐదు కోట్లు ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసి ఉండాలి. తెలుగు రాష్ట్రాలలో సేవలు అందించి ఉండాలి. ఈ విధంగా మరో సంస్ద టెండర్ లో పోటీకి రాకుండా నిబంధనలు పొందుపరిచి ఏకచత్రాధిపత్యంగా షీల్డ్ బ్రోకింగ్ ఇన్సూరెన్స్ సంస్దకు టెండర్ దారాధత్తం చేశారేనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా సంబంధిత శాఖ మంత్రి వద్దని చెప్పినా అధికారులు మాత్రం షీల్డ్ కు టెండర్ ధారదత్తం చేసేశారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపితే లోపాయికారి ఒప్పందాలుతో పాటు అవినీతి బహిర్గతం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.