లేటెస్ట్

మరో నాలుగేళ్లూ ‘కరకట్టే’ గతి...!?

‘విజయవాడ’ నుంచి ‘ప్రకాశం బ్యారేజ్‌’ మీదుగా ‘సచివాలయం’, హైకోర్టుకు వెళ్లే ప్రయాణీకులు మరో మూడేళ్లో, నాలుగేళ్లో..కరకట్ట రోడ్డుపై ప్రయాణించాల్సిందే. రాష్ట్ర రాజధానిగా ‘అమరావతి’ని నిర్ణయించిన తరువాత ‘కరకట్ట’ మీద నుంచే ‘వెలగపూడి’లోని ‘సచివాలయం’, హైకోర్టుకు వెళ్లేవారు ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్నారు. 2017లో రాజధాని పనులు ప్రారంభించిన తరువాత ఈ మార్గంలో విపరీతంగా ట్రాఫిక్‌ పెరిగిపోయింది. సింగిల్‌ రూట్‌ కావడంతో..కరకట్టపై ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. అప్పట్లో..రాజధాని పనులు త్వరగా పూర్తి అవుతాయని, దాంతో..‘కరకట్ట’తో సంబంధం లేకుండా ‘సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు’ నుంచి ‘ప్రకాశం బ్యారేజ్‌’ నుంచి ‘విజయవాడ’ వెళ్లడం సులువవుతుందని భావించేవారు.అప్పటి ‘టిడిపి’ ప్రభుత్వం కూడా ‘సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు’ను ఆగమేఘాలపై పూర్తిచేసేందుకు శ్రమించింది. దాదాపుగా ‘సచివాలయం’ నుంచి ‘ప్రకాశం బ్యారేజ్‌’ వరకూ ‘సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు’ను పూర్తి చేసింది. అయితే..‘మంతెన సత్యనారాయణ ఆశ్రమం’ నుంచి ‘ప్రకాశం బ్యారేజ్‌’ వరకూ ఉన్న రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో..‘సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు’ నిర్మాణం ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ మార్గంలో పయనించే ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇరుకైన రోడ్డుతో చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. గత ఏడేళ్ల నుంచి ఈ అగచాట్లు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

2019లో ‘టిడిపి’ ఓడిపోయి ‘వైకాపా’ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయి. రాజధాని ‘అమరావతి’ ఉసురు తీయడానికి ‘జగన్‌’ ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులు అంటూ..మూడుముక్కలాటాడారు. ఆయన హయాంలో..చీకటిపడితే..‘కరకట్ట రోడ్డు’లో కనీసం విద్యుత్‌ దీపాలు కూడా లేకుండా చేశారు. హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టినా ‘వైకాపా’ ప్రభుత్వం తమ తీరు మార్చుకోలేదు. అయితే..ఐదేళ్ల వైకాపా పాలనపై విసుగెత్తిన ప్రజలు..వైకాపాను ఘోరంగా ఓడిరచారు. దీంతో..‘కరకట్ట రోడ్డు’ కష్టాలు తీరిపోయినట్లేనని ‘సచివాలయం,హైకోర్టు’కు నిత్యం వెళ్లే ప్రయాణీకులు భావించారు. అయితే..వారు అనుకున్నట్లేమీ జరగడం లేదు. ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు గడిచిపోయినా..ఇంత వరకూ ‘కరకట్టరోడ్డు’ గురించి పట్టించుకున్నవారు లేరు. మిగిలిపోయిన ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తారని వారు ఆశిస్తే..‘కూటమి ప్రభుత్వం’ మాత్రం దీనిపై మీనమేషాలు లెక్కిస్తోంది. ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల వద్ద నుంచి తీసుకోలేకపోయింది. వారు అడిగిన కోర్కెలను తీర్చకపోవడంతో..వారు తమ భూములు ఇచ్చేది లేదని భీష్మించుకూర్చున్నారు. అయితే..బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ‘కూటమి ప్రభుత్వం’ రైతులు భూములు ఇవ్వకపోతే..ప్రజాప్రయోజనాల కోసం ‘ల్యాండ్‌ ఎక్వైజేషన్‌’ చేయాల్సింది. కానీ..ఇంకా పూలింగ్‌ కిందే భూములు ఇవ్వాలని కోరుతుండడంతో..ఆ ప్రాంతంలోని రైతులు తమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే..దీనికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వారు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, వారి కోర్కెలు తీర్చడం తమ వల్ల కాదని, మిగతా రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే వారికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే..దీనికి రైతులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ను నేరుగా నేషనల్‌ హైవేకు కలపడానికి సిద్ధమైంది. అంటే..ఇక ఇప్పటి వరకూ పూర్తైన ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ ‘ప్రకాశంబ్యారేజ్‌’ మీదుగా ‘విజయవాడ’లో కలవదు. ముందుగా అనుకున్న విధంగా కాకుండా ఇప్పుడు ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ ‘మంతెన సత్యనారాయణ ఆశ్రమం’ నుంచి ‘ఎయిమ్స్‌’కు వెళ్లే దారి గుండా ‘నేషనల్‌ హైవే’లో కలుస్తుంది. దీంతో..‘వారధి’పై విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండబోతోంది. అంతే కాకుండా.. ఇప్పుడు ‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ రూట్‌ మారడంతో..అది పూర్తయ్యే వరకూ..‘సచివాలయం, హైకోర్టు’కు నిత్యం వెళ్లేవారికి ‘కరకట్టే’ గతి కాబోతోంది. మరో నాలుగేళ్ల పాటు ‘కరకట్ట’ మీద నుంచే ఈ ప్రాంతంలో ప్రయాణించేవారు..వెళ్లాల్సి ఉంటుంది. 


ఎవరిది తప్పు...!

ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు అనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తొలుత తమ భూములు రాజధానికి ఇవ్వడానికి ఆ ప్రాంతంలోని రైతులు ఒప్పుకోలేదు. తమ భూములు ‘విజయవాడ’కు ఆనుకుని ఉన్నాయని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కంటే..తమ భూముల ధరలు ఎక్కువ ఉన్నాయని, తాము ఇచ్చేది లేదని వారు భీష్మించుకున్నారు. దీన్ని అప్పట్లో వైకాపా రాజకీయంగా వాడుకుంది. రాజధానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టి వారితో కోర్టుల్లో కేసులు వేయించింది. దీంతో ప్రభుత్వం అప్పట్లో నిదానించింది. అయితే..2024లో గెలిచిన తరువాత దూకుడుగా వెళ్లాల్సిన ప్రభుత్వం రైతులను బుజ్జగించి భూములు తీసుకోవాలనుకుంది. ‘విద్యాశాఖ మంత్రి’ ‘నారా లోకేష్‌’ నియోజకవర్గం కావడంతో..వారిని ఒప్పించి భూములు తీసుకోవాలని భావించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో..వారిని నొప్పించకుండా..‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ రూట్‌ను మార్చివేసింది. ఈ వ్యవహారంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వం చేసిన అలసత్యం వల్ల  ఇప్పుడు ‘సచివాలయం, హైకోర్టులకు వెళ్లడానికి ‘కరకట్టరోడ్డు’ తప్ప మరోమార్గం లేదు. అయితే..ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాజధాని ‘అమరావతి’కి సరైన రోడ్డును ఇప్పటిదాకా నిర్మించలేనివారు..ప్రపంచ స్థాయి రాజధాని ఎలా కడతారని పలువురు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డులో ప్రయాణించేవారు...ఏడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, మరో నాలుగు లేక ఐదేళ్లపాటు..ఇవే కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే...! కాగా..‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు’ పూర్తి అయినా..‘విజయవాడ’ నుంచి ‘సచివాలయం’ లేదా హైకోర్టుకు వెళ్లాలంటే..‘వారధి’ నుంచి వెళ్లాల్సిందే. దగ్గర దారి వదిలేసి..రోడ్ల చుట్టూ తిరగాల్సిందే. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ