‘చంద్రబాబు’ చుట్టూ తెలుగేతర ఐఏఎస్‌లు...!?
నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ‘చంద్రబాబునాయుడు’ తన పాత విధానాలను మార్చుకోవడం లేదనే భావన ‘టిడిపి’ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తీయగా మాటలు చెబుతారని, ఒకసారి అధికారంలోకి వచ్చిన తరువాత..ఆయన తీరు మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు మాట తప్పినా..పార్టీ కోసం నిత్యం పనిచేసే కార్యకర్తలు మాత్రం ఆయన కష్టాల్లో ఉన్న ప్రతిసారీ కసిగానే పనిచేసి మళ్లీ ఆయనను అధికారపీఠంపై కూర్చోబెడుతూనే ఉన్నారు. వారు ఎన్ని త్యాగాలు చేసినా, ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా..‘చంద్రబాబు’ మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నప్పుడూ అధికారులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారైనా..కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారనుకుంటే ఆయన మాత్రం మరోసారి వారి ఆశలను వమ్ము చేశారు. ఇప్పుడు ఆయన చుట్టూ అధికారులే కమ్మేశారు. వారే ఆయనను నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు చెప్పే కాకి లెక్కలను నమ్ముకుని, అంత సంతృప్తి, ఇంత సంతృప్తి అంటూ..రోజులు వెల్లదీస్తున్నారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులనే ఎక్కువ నమ్ముకుంటున్నారు. అదీ రాష్ట్రానికి చెందని అధికారుల మాటే ఆయన వింటున్నారని ప్రచారం సాగుతోంది. కీలకమైన స్థానాల్లో తెలుగేతర అధికారులను నియమించారు. వారికి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి అర్థం కాదు. తమకు తోచిందో...తమకు తెలిసిందే నిజమన్నట్లు వాళ్లు వ్యవహారాలను సాగిస్తున్నారు. తెలుగు ఐఏఎస్‌ల్లో నిజాయితీపరులు, సమర్థులు, యువకులు అనేక మంది ఉన్నా కీలకమైన పోస్టుల్లో తెలుగేతర అధికారులను ‘చంద్రబాబు’ నియమించారు. గతంలో కూడా ఆయన అలానే చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడూ అదే దారిలో నడుస్తున్నారని, ఆయన మారరని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అంతరంగిక సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.